కొత్త జిల్లాకు ఎవరో..?

ABN , First Publish Date - 2022-04-04T14:43:06+05:30 IST

కొత్త జిల్లాకు ఎవరో..?

కొత్త జిల్లాకు ఎవరో..?

- ఉద్యోగుల విభజనపై అయోమయం

- నేడు పాలన ప్రారంభించాల్సి ఉన్నా.. తెగని తంటా

- రాష్ట్రశాఖల నుంచి అందని ఉత్తర్వులు


అనంతపురం: అధికారికంగా సోమవారం శ్రీసత్యసాయి జిల్లాలో ప్రారంభం కానుంది. అధికారులు, ఉద్యోగులు అందరూ ఆయా కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించాలి. వారివారి సీట్లలో ఆశీనులై, విధుల్లో నిమగ్నమవ్వాలి. నేటికీ ఉద్యోగుల విభజనపై స్పష్టత లేదు. కొత్త జిల్లాకు ఎవరెవరు వెళ్లాలో అనేదానిపై రాష్ట్ర అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. దీంతో అధికారులు, ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది.శ్రీసత్యసాయి జిల్లాలో ఇప్పటికే కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌, ఎస్పీ, డీఆర్వో, ఆర్డీఓలను ప్రభుత్వం నియమించింది. ఆయా శాఖలకు సంబంధించిన హెచఓడీలు ఎవరు, ఉద్యోగులు ఎవరిని ఏయే క్యాడర్‌లో పంపించాలి, అనే దానిపై ఆదివారం వరకు స్పష్టత రాలేదు. ఉదయం నుంచి ఈ ఉత్తర్వుల కోసం అనంత జిల్లాకు చెందిన ఆయాశాఖల హెచఓడీలు ఎదురుచూస్తూ వచ్చారు. రాత్రి అయినా ఉత్తర్వులు రాకపోవడంతో ఉద్యోగుల విభజనపై గందరగోళం నెలకొంది. ప్రధానంగా ఆయా శాఖల హెచఓడీలు సోమవారం పుట్టపర్తిలో ప్రారంభమయ్యే పాలనలో పాలుపంచుకోవాలి. ఎవరికి ఆయా శాఖల బాధ్యతలు ఇవ్వాలో రాష్ట్రశాఖల నుంచి సమాచారం రాలేదు. ఉద్యోగులను ఏయే క్యాడర్‌లో ఎంతమందిని పంపాలి? సీనియర్లను కేటాయించాలా.. లేదా జూనియర్లనా? ఆప్షన్లు తీసుకుని పంపాలా అనే దానిపై స్పష్టత రాలేదు. పండుగ పూటఅయినా ఈ ఉత్తర్వుల కోసమే అనంత జిల్లా శాఖల హెచఓడీలు ఆతృతగా ఎదురుచూస్తూ కనిపించారు. కనీసం హెచఓడీ ఎవరో అని చెబితే వారికి ఆ బాధ్యతలు అప్పగించవచ్చు. పైస్థాయి నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే ఏం చేయాలని ఓ శాఖ కీలక ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిశాఖల్లోనూ ఇదే గందరగోళం ఆదివారం కొనసాగింది.కొత్త జిల్లా వైద్యాధికారి పద్మావతి : నూతనంగా ఏర్పాటైన శ్రీసత్యసాయి జిల్లా వైద్యాధికారిగా డాక్టర్‌ పద్మావతిని నియమించినట్లు తెలిసింది. ఆమె అనంత జిల్లా అదనపు వైద్యాధికారిగా ఉంటూ కొంత కాలంగా డిప్యుటేషనలో రాష్ట్రశాఖలో పనిచేస్తున్నారు. ఆమెకు డిప్యుటేషన రద్దు చేసి, పుట్టపర్తి జిల్లా వైద్యాధికారిగా నియమించారని అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-04-04T14:43:06+05:30 IST