నీరు లేక ఎండిపోతున్న అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు
రూ.లక్షలు దుర్వినియోగం
అనంతపురం, రాప్తాడు: రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ప్రభుత్వం చేపట్టిన లక్ష్యం క్షేత్ర స్థాయిలో నెరవేరలేదు. మొక్కలకు నీరు సకాంలలో పోయకపోవడం, సంరక్షించకపోవడం వలన మొక్కలు ఎండిపోతున్నాయి. రోడ్డు పక్కన పచ్చగా చిగురించాల్సిన మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. మొక్కల సంరక్షణకు నెలానెలా బిల్లులు మాత్రం నమోదు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కరువు జిల్లాలో విరివిగా మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రహదారులకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు పెంచాలని ఉపాధి పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా రాప్తాడు మండలంలో పలు గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా దాదాపు 12 వేల మొక్కలు నాటారు. గతేడాది ఆగస్టులో మొక్కలు నాటి వాటికి రక్షణగా చుట్టూ ముళ్ల కంపలు నాటారు. గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, వాటికి రక్షణగా ముళ్ల కంపలు అమర్చేందుకు ఇప్పటి వరకూ రూ. లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నీరు సక్రమంగా పోయకపోవడం, సంరక్షణ లేకపోవడం వలన మొక్కలు ఎండిపోయాయి. ప్రస్తుతం 30 శాతం మొక్కలు మాత్రమే అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. మిగతా చోట్ల ఎండిన కొమ్మలు దర్శనమిస్తున్నాయి. మొక్కలు ఎండిపోయినా వాటి సంరక్షణ పేరుతో బిల్లులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లే మొక్కలు ఎండిపోతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఏపీఓ రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా కొన్నిచోట్ల రోడ్డు పక్కన గల ఎండు గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం ద్వారా కొన్ని మొ క్కలు చనిపోయాయని బతికి ఉన్న మొక్కలకు మా త్రమే బిల్లులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు.