దిశ బిల్లుకు ‘ఉరి’!

ABN , First Publish Date - 2020-12-03T09:10:32+05:30 IST

మహిళలపై అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులను, వివిధ రూపాల్లో ఎదురయ్యే హింసలను అరికట్టేందుకు, కేసులను సత్వరమే విచారించి దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు 2012లో కేంద్రం నిర్భయ చట్టం

దిశ బిల్లుకు ‘ఉరి’!

చరిత్ర సృష్టిస్తున్నామని చెప్పి చివరకు బిల్లు ఉపసంహరణ

ప్రత్యేక చట్టంపై కసరత్తు ఏది?.. కేంద్ర చట్టాలను ధిక్కరించేలా రూల్స్‌

విచారణ, శిక్షపై అత్యుత్సాహం.. నిర్భయ, పోస్కోకు పోటీ ప్రతిపాదనలు

ఏడాదిగా కేంద్రం నుంచి కొర్రీలు.. రెండుసార్లు సవరించినా మారని కథ

చివరికి కీలక బిల్లు కాలగర్భంలోకి.. ముందే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’ 

కొత్త బిల్లు తెచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మహిళలపై అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులను, వివిధ రూపాల్లో ఎదురయ్యే హింసలను అరికట్టేందుకు, కేసులను సత్వరమే విచారించి దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు 2012లో కేంద్రం నిర్భయ చట్టం తీసుకొచ్చింది. ఢిల్లీలో నిర్భయ సంఘటన అనంతరం మహిళాలోకం పోరాట ఫలితంగా ఈ చట్టం వచ్చింది. 2019, నవంబరు  27న హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వైద్యురాలు(దిశ పేరుపెట్టారు)పై నలుగురు దుండగులు అత్యాచారం చేసి చంపేశారు. నిర్భయ కేసు తర్వాత అంతగా అలజడిరేపిన  సంఘటన ఇది. ఈ కేసు విచారణలో ఉండగానే డిసెంబరు 6న నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. దీనిపై దేశంలోని అన్ని రాష్ట్రాలు విభిన్నంగా స్పందించాయి. నిర్భయ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలన్న సూచనలు వచ్చాయి. ఏపీ సర్కారు అందరికంటే ముందు, దేశంలోనే తొలిసారి అంటూ.. దిశ చట్టం తీసుకొస్తామని గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో ప్రకటించింది.


సీఎం చెప్పారన్న హడావుడిలో అధికారయంత్రాంగం ఆ నెల 10వ తేదీ నాటికల్లా దిశ బిల్లు-2019ను రెడీచేశారు. దానికి న్యాయశాఖ అభిప్రాయం కూడా తీసుకున్నారు.  ఆ మరుసటి రోజే ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. డిసెంబరు 13న శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆ తర్వాత లాంఛనాలు పూర్తిచేసి కేంద్రం ఆమోదానికి పంపించారు. ఈ బిల్లు రూపకల్పనలోని లోటుపాట్లను  ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పటికప్పుడు కథనాలుగా ప్రచురిస్తూనే ఉంది. ఈ కథనాల్లో పేర్కొనినట్టే ఈ 11నెలల కాలంలో ఆ బిల్లుపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనేక కోర్రీలు వేసింది. ఏపీ నుంచి ప్రత్యేక అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి వివరణలు ఇచ్చారు. అయినా కేంద్రం చివరకు ఆ బిల్లును తిరస్కరించింది. దీంతో అది  ఎలా వెళ్లిందో అలాగే వెనక్కు వచ్చింది. చివరకు ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. మరో 10రోజులయితే ఆ బిల్లు ఆమోదం పొంది ఏడాదవుతుంది. ఆ ముచ్చట తీరకుండానే సర్కారు బిల్లును వెనక్కు తీసుకుంది. 


తొందరే ముంచిందా!

మహిళల భద్రత, రక్షణకు కేంద్రస్థాయిలో నిర్భయతోపాటు అనేక చట్టాలు ఉన్నాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీపీసీ) అనేక  సెక్షన్‌లు ఇందుకోసం ఉన్నాయి. అయినా, రాష్ట్రాల స్థాయిలో మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించుకోవచ్చు. వాటిని రాష్ట్రపతి ఆమోదించాక అమలు చేసుకోవచ్చు. ఈ లెక్కన రాష్ట్రంలో మహిళల రక్షణకు ఎంతటి కఠినమైన చట్టాలనయినా జగన్‌ సర్కారు రూపొందించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ తయారు చేసే ఏ చట్టమయినా కేంద్ర చట్టాలకు లోబడి ఉండాలి. వాటిని ధిక్కరించే అంశాలు వాటిల్లో ఉండకూడదు. కేంద్ర చట్టాలకు పోటీగా అసలే ఉండకూడదు. ఇది చట్టాల రూపకల్పన సమయంలో పాటించే సాధారణ సూత్రం. దిశ బిల్లు-2019 ఈ అంశాలకు లోబడి లేదని కేంద్రం తేల్చిచెప్పింది. నిర్భయ చట్టం 2012తోపాటు, ఇంకా ఇతర అనేకానేక చట్టాల్లోని సెక్షన్‌లు, క్లాజులు, రూల్స్‌ను ధిక్కరించేలా, వాటిని తోసిరాజేలా నిబంధనలు దిశబిల్లులో ఉన్నాయి. కేంద్రం వాటినే ఎత్తిచూపుతూ ఎందుకు వాటిని చేర్చారంటూ ప్రశ్నించింది. అన్నీ తెలిసే కేంద్ర చట్టాలను ధిక్కరించేలా దిశబిల్లులో క్లాజులను చేర్చారా? లేక తెలియక జరిగిన పొరపాటా? అంటూ కేంద్ర హోంశాఖ ప్రశ్నించింది. వాటిపై బదులు ఇవ్వాలని ఈ ఏడాది రెండుసార్లు వివరాలు కోరింది.


అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి వివరణలు ఇచ్చినా కేంద్రం పరిగణించలేదు. ఎందుకంటే...దిశ బిల్లులోని ఆరు అంశాలు కేంద్ర చట్టాలను ధిక్కరించేలా, తోసిరాజేలా ఉన్నాయి. కేంద్రం దిశ బిల్లును తిరస్కరించడంతో రాష్ట్ర సర్కారు మార్గదర్శనం తుస్సుమంది. నిజానికి, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ బిల్లులు రూపొందించినా కొన్ని సవరణలు, మార్పులతో అవి ఆమోదం పొందాయి. కానీ ఏపీ బిల్లు మొత్తానికి మొత్తం కొర్రీల్లో చిక్కుకుపోయింది. ఈ బిల్లు ఆమోదించక ముందే దిశ పోలీసు స్టేషన్‌లను రాష్ట్రమంతా ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులను నియమించారు. బిల్లు ఆమోదంతో సంబంధం లేకుండా అందులోని అంశాలను అనధికారికంగా అమలు చేశారు. 


కింకర్తవ్యం?

తాజా అనుభవంతో ఏపీ సర్కారు న్యాయనిపుణుల పర్యవేక్షణలోనే దిశ బిల్లును కొత్తగా రూపొందించాల్సిఉంది. అది కేంద్ర చట్టాల్లోని అంశాలను తోసిరాజేలా ఉండకూడదు. కొత్తగా మరో బిల్లును రూపొందించి దాన్ని చట్టసభల్లో ఆమోదించాలి. మరోసారి కేంద్రం దానిని తిరస్కరించకుండా గత పాఠాలను నెమరవేసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా, కేంద్రం వెనక్కి పంపించిన బిల్లుల్లో ఇది రెండోది. తొందరపాటు, కేంద్ర న్యాయ చట్టాలపై అవగాహనలేకుండానే బిల్లును హడావుడిగా రూపొందించడం వల్లే కేంద్రం తిరస్కరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


రేపిస్టులను అణచడానికి కఠిన చట్టాలు ఉండాల్సిందే! మహిళలు, చిన్నపిల్లలను చెరపట్టేవారిని ఉరికొయ్యల దరికి చేర్చాల్సిందే!  ‘దిశ’ బిల్లుతో అవన్నీ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడమూ సబబే! కానీ, దీనికోసం చేయాల్సిన కసరత్తులోనే తప్పుటడుగులు పడ్డాయి. చివరకు.. తాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెచ్చిన దిశ బిల్లును తానే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. కొత్తగా మరో బిల్లుకు రూపకల్పన చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆ బిల్లు కేంద్రం వద్ద గట్టెక్కేవరకు అధికారులను అప్రమత్తం చేస్తూ, చురుగ్గా వ్యవహరించాలి. కానీ ఆర్భాటం, హడావుడి, అత్యుత్సాహమే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ బిల్లు విషయంలో కనిపించింది... వెరసి పురిట్లోనే దిశ బిల్లుకు సంధి కొట్టేసింది!


పంపినంత వేగంగా వెనక్కి..

ఢిల్లీకి వెళ్లిన దిశ బిల్లు ఒకటికి రెండుసార్లు తిరిగి వచ్చింది. బిల్లు వెనక్కి వచ్చినప్పుడల్లా సర్కారు తీరుపై చర్చ జరుగుతూనే ఉంది. ‘రాష్ట్రంలోని అధికారులకు చటాన్ని సమగ్రం చేయడం చేతకాదా.? కేవలం ఒక సెక్షన్‌(354) సరిచేయడం కూడా రాదంటే నమ్మశక్యంగా అనిపించడంలేదు’ అనే వ్యాఖ్యలు వినిపించేవి. 

Updated Date - 2020-12-03T09:10:32+05:30 IST