పేదింటి పట్టా మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2020-08-13T07:43:52+05:30 IST

పేదింటి పట్టా మళ్లీ వాయిదా

పేదింటి పట్టా మళ్లీ వాయిదా

కరోనా, హైకోర్టునూ కాదని షెడ్యూల్‌

పంపిణీకి పంద్రాగస్టున ముహూర్తం

సుప్రీంలో విచారణకొస్తుందని ధీమా

అలా జరగకపోవడంతో వెనక్కి

పంపిణీకి డీకేటీ పట్టానే పరిష్కారం

కన్వేయెన్స్‌ డీడ్‌తో సర్కార్‌కు కష్టమే

రాష్ట్ర రెవెన్యూ నిపుణుల స్పష్టీకరణ

తాత్కాలికంగా వాయిదా: ధర్మాన


అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఇంటిస్థలాలపై ఊహించినదే జరిగింది. 25 లక్షల మంది పేదలకు ఆగస్టు 15న ఇంటిస్థలాల పట్టాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన మరోసారి కార్యరూపం దాల్చలేదు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం తప్పక విచారణకు వస్తుందని భావించారు. ఈ ధీమాతోనే పంద్రాగస్టున ఈ కార్యక్రమం ఉంటుందని నిన్నటి వరకు ప్రభుత్వ పెద్దలు చెబుతూ వచ్చారు. అయితే, సుప్రీంలో ఈ కేసు తేలలేదు. దీంతో పేదింటి స్థలాల పంపిణీ తేదీ మారుతుందని రెవెన్యూ మంత్రి బుధవారం వెల్లడించారు. అయితే, అది ఎప్పుడు ఉంటుందనేది చెప్పలేదు. సుప్రీం కోర్టు ఈ కేసును తేల్చితేనే, అది కూడా ప్రభుత్వం కోరుకున్న కన్వేయెన్స్‌ డీడ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తేనే ముందడుగు పడుతుంది. లేదంటే కన్వేయెన్స్‌ డీడ్‌ల నుంచి వెనక్కుతగ్గి అసైన్‌మెంట్‌ చట్టం మేరకు డీకేటీ పట్టాల రూపంలో పేదలకు పట్టాలు ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు.


తొలిసారి..: మార్చి 25న ఉగాది రోజున ఇంటిస్థలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీనికి సంబంధించిన జీవో 44ని అదే నెల 23న హైకోర్టు నిలిపివేసింది. అసైన్‌మెంట్‌ చట్టం నిబంధనలకు అనుగుణంగా పేదలకు డీకేటీ పట్టాలుగా కాకుండా కన్వేయెన్స్‌డీడ్‌లుగా ఇంటిపట్టాలు ఇస్తామని సర్కారు జీవో 44ని ఈ ఏడాది ఫిబ్రవరి 22న జారీ చేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు అసైన్‌మెంట్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం డీకేటీ పట్టాల రూపంలోనే ఇంటిస్థలాలు ఇస్తున్నారు. వాటిని 28 ఏళ్ల నిర్ధిష్ట కాలపరిమితి వరకు అమ్ముకోవడానికి వీల్లేదు. కన్వేయెన్స్‌డీడ్‌ల కింద ఇచ్చే ఇంటిపట్టాలను పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఎలాంటి ఎన్‌వోసీలతో సంబంధం లేకుండా అమ్ముకోవచ్చని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఇదే అతిపెద్ద చిక్కు! కన్వేయెన్స్‌ డీడ్‌లను ఏ చట్టపరిధిలో ఇస్తారు? దీనికి హేతుబద్దత ఏమిటన్న హైకోర్టు ప్రశ్నలకు రెవెన్యూశాఖ బదులివ్వలేదు. దీంతో హైకోర్టు జీవో44ని నిలిపివేసింది. దీంతో ఉగాది నాడు కార్యక్రమం వాయిదా పడింది. 


రెండోసారి: పేదింటి స్థలాల పంపిణీకి పడిన చిక్కును విప్పే దారి ఏమిటో కనిపెట్టకుండా తాను అనుకున్నదే జరగాలన్న పట్టుదలను ప్రభుత్వం ప్రదర్శించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతినాడు ఇంటిపట్టాలు ఇస్తామని రెండో షెడ్యూల్‌ ప్రకటించారు. ఇటు కరోనాప్రభావం, అటు హైకోర్టు ఉత్తర్వులతో ఆ రోజున కార్యక్రమం చేపట్టలేకపోయారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తూ స్పెషల్‌ పిటిషన్‌ వేసింది. ఈ క్రమంలో ఆ తేదీ కూడా దాటిపోయింది. 


మూడోసారి..: వైఎస్‌ జయంతి జూలై 8న ఇంటిపట్టాల పంపిణీ ఉంటుందని మూడో షెడ్యూల్‌ ప్రక టించారు. అయితే, అప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించేయడం, మరణాలు, కేసులు రెండూ భయపెట్టేస్థాయికి వెళ్లిపోవడం సహా పలు కారణాలతో అది వర్కవుట్‌ కాలేదు. 


నాలుగోసారి..: నాలుగోసారి ఆగస్టు 15కు షెడ్యూల్‌ మార్చారు. ఆ రోజు ఇంటిపట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌, జేసీలకు ఆదేశాలు వెళ్లాయి. అయితే, రోజులు గడుస్తున్నకొద్దీ ప్రభుత్వంలో ఆందోళన. బుధవారం సుప్రీం కోర్టు ఈ కేసును పరిష్కరిస్తుందని అధికారులు గత మూడు రోజులుగా ప్రచారం చేస్తున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. కనీసం విచారణకు వచ్చిందా? రాలేదా? వాయిదాపడిందా? లేదా? అన్న విషయాలపై స్పందించేందుకు కూడా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విముఖతగా ఉన్నారు. 


వీరు చెప్పరా.. ఆయన వినరా?

భూముల చట్టాల రూపకల్పన, అమలులో రెవెన్యూదే కీలకపాత్ర. ఏ చట్టంలో లేని కన్వేయెన్స్‌ డీడ్‌లు ఇస్తామని సీఎం జగన్‌ చెబుతున్నప్పుడు అది చట్టవిరుద్ధమైన ప్రతిపాదన అని, కోర్టులు కొట్టేస్తాయని రెవెన్యూశాఖ గట్టిగా చెప్పలేకపోతోందా? లేక సీఎంకు ఎదురుచెప్పడం ఎందుకని మౌనంగా ఉంటోందా? అని పలువురు రెవెన్యూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘‘పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే ప్రభుత్వ అసలు ఉద్దేశం అయితే చట్ట పరిధిలో డీకేటీ పట్టాలు ఇస్తే ఏ గొడవా ఉండదు. ఏ కోర్టులూ అడ్డుకోవు. కన్వేయెన్స్‌ డీడ్‌లకు అనుమతి ఇవ్వడం అంటే చట్టవ్యతిరేక పనులకు చట్టసమ్మతిని కోరినట్లుగానే ఉంటుంది’’ అని రెవెన్యూ నిపుణుడు త్రినాథరావు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. 


పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నాం: కృష్ణదాస్‌


పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. ‘‘పంద్రాగస్టు రోజు జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేస్తున్నాం. మళ్లీ ఎప్పుడు పంపిణీ చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తాం’’ అని శ్రీకాకుళంలో బుధవారం వెల్లడించారు.

Updated Date - 2020-08-13T07:43:52+05:30 IST