నచ్చితే నో రూల్స్!

ABN , First Publish Date - 2020-08-13T07:44:50+05:30 IST

నచ్చితే నో రూల్స్!

నచ్చితే నో రూల్స్!

రిటైర్‌ అయిన డైరెక్టర్‌కు మళ్లీ చాన్స్‌

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు


అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ ఒకే నిబంధనలా? అంటే... కాదు కాదు  ప్రభుత్వానికి నచ్చినోళ్ల విషయంలో మాత్రం నిబంధనలు వర్తింవచని ఉద్యోగులు అంటున్నారు. పెట్టిన నిబంధనలను నచ్చని వారికి మాత్రమే వర్తింపజేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు ఈ విషయాలనే ధ్రువీకరిస్తున్నాయని ఉద్యోగులు పేర్కొన్నారు. జూలై 31వ తేదీన ప్రొటోకాల్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా రిటైర్‌ అయిన కె.శైలజారెడ్డిని తిరిగి నియమించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపోమాపో రానున్నాయని ఆ శాఖ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. రిటైర్‌ కావడానికి 2 నెలల ముందే శైలజారెడ్డి ప్రభుత్వానికి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరిగి తనను డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించాలని ఆ దరఖాస్తులో కోరారు. అయితే ఈ దరఖాస్తు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో అధికారులు దానిని పక్కన పడేశారు. ఇంతలో ఆమె జూలై 31వ తేదీన రిటైర్‌ అయ్యారు. అయినా పట్టు వదలకుండా ఆమె సీఎంవో అధికారుల అండదండలతో మళ్లీ తనను అక్కడే అదే పోస్టులో నియమించాలంటూ సంబంధిత అధికారులపై  ఒత్తిడి చేశారు. దీంతో అధికారులు నిబంధనలు పట్టించుకోకుండా హడావిడిగా ఆమెను తిరిగి నియమించుకునేందుకు ఆదేశాలు సిద్ధం చేశారు. అయితే, ఉద్యోగ విరమణ పొందిన శైలజారెడ్డిని మళ్లీ నియమించడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నియామకం వల్ల తాము పదోన్నతులు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం రిటైర్‌ అయిన వారిని తీసుకోవద్దని చెప్తూనే శైలజారెడ్డి విషయంలో ఆ నిబంధనలు పక్కన పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తించాలి గానీ మనిషి మనిషికీ నిబంధనలు ఎందుకు మారుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. 


అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...!

రిటైర్‌ అయిన వారిని తిరిగి తీసుకోవద్దని జగన్‌ ప్రభుత్వం కొద్దికాలం క్రితం జీవో నంబర్‌ 2323ని జారీచేసింది. ఇప్పుడు అదే జీవోని పక్కకునెట్టి శైలజా రెడ్డిని తిరిగి నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పైగా రిటైర్‌ అయిన వాళ్లు ఫైళ్లపై పెట్టే సంతకాలు చెల్లవని, వాటికి విలువ ఉండదు కాబట్టి ఏవైనా న్యాయపరమైన చిక్కులు వస్తే అవి సీఎం తలకు చుట్టుకుంటాయన్న కారణం చెప్తూ ఇటీవల సీఎంవోలో జె.మురళి, పీవీ. రమేశ్‌, అజేయ కల్లం నుంచి సబ్జెక్టులు పూర్తిగా తొలగించిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు శైలజారెడ్డి ప్రోటోకాల్‌ విభాగంలో నియమితురాలైతే ఫైళ్ల మీద ఎలా సంతకాలు పెడతారు? పెట్టినా అవి చెల్లుతాయా అని ఉద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-13T07:44:50+05:30 IST