గోదావరికి వరద పోటు

ABN , First Publish Date - 2020-08-13T07:38:50+05:30 IST

గోదావరికి వరద పోటు

గోదావరికి వరద పోటు

19 గ్రామాలకు ఆగిన రాకపోకలు


ధవళేశ్వరం, ఏలూరు, ఆగస్టు 12: భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతుండటంతో బుధవారం ఉదయం కాటన్‌ బ్యారేజీ గేట్లను ఎత్తి 2 లక్షలా 25 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి ధవళేశ్వరం, విజ్జేశ్వరం హార్మ్‌లతోపాటు, ర్యాలీ, మద్దూరు హార్మ్‌లలోనూ గేట్లను కొద్దిమేర ఎత్తి 2,62,518 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10 అడుగులుంది. భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 29.50 అడుగులకు చేరుకుంది. అలాగే బుధవారం సాయంత్రానికి ఎగువన కాళేశ్వరం వద్ద నీటిమట్టం 8.76 మీటర్లు, పేరూరు వద్ద 9.88, దుమ్ముగూడెం 8.40, కూనవరం 11.90, కుంట  8.42, కొయిదా 15.81, పోలవరం కాఫర్‌డాం 23.70, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.02 మీటర్లుగా ఉంది.  పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం మండలం కొత్తూరు కాజ్‌వే వద్ద బుధవారం పెద్ద ఎత్తుననీరు చేరడంతో దాదాపు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్పిల్‌ చానల్‌ వైపు గోదావరి వరద చేరకుండా రక్షణగా నిర్మించిన మట్టి కట్లకు గండిపడడంతో స్పిల్‌వే వైపు భారీ ఎత్తున వరద చేరింది. మధ్యాహ్నానికి ఇంకా పెరిగి, స్పిల్‌వేలోని స్లూయిజ్‌ల మీదుగా నీరు ఎగువకు ఎగబాకడం మొదలైంది. దీంతో స్పిల్‌వే వద్ద పనులన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేశారు. మరో 24 గంటల్లో స్పిల్‌వే భాగం పూర్తిగా నీటమునుగుతుందని భావిస్తున్నారు. గోదావరి ఉపనది శబరి కూడా పోటెత్తడంతో గోదావరిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉంది. ఏజెన్సీలోని కొండవాగులన్నీ పొంగిపొర్లుతున్నాయి. బుట్టాయిగూడెం మండలం విప్పలపాడు జల్లేరు వాగు కోతకు గురైంది. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం కాలువపై జల్లేరు వాగు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2020-08-13T07:38:50+05:30 IST