సజ్జల సంచలన కామెంట్స్‌పై గల్లా ఫ్యామిలీ నుంచి రియాక్షన్ లేదేం..!?

ABN , First Publish Date - 2021-08-14T08:20:53+05:30 IST

సజ్జల సంచలన కామెంట్స్‌పై గల్లా ఫ్యామిలీ నుంచి రియాక్షన్ లేదేం..!?...

సజ్జల సంచలన కామెంట్స్‌పై గల్లా ఫ్యామిలీ నుంచి రియాక్షన్ లేదేం..!?

  • పరిస్థితుల ఆధారంగా నిర్ణయం
  • అమరరాజా తరలింపుపై గల్లా రామచంద్రనాయుడు
  • తీర్పు మేరకే నడుచుకుంటాం.. ప్రభుత్వ చర్యలపై స్పందనకు నో
  • కేసులు పూర్తిగా తేలాకే మాట్లాడతాం
  • తమిళనాడుకు తరలిపోతామనడంపై జవాబివ్వలేం: గల్లా జయదేవ్‌
  • పదవీ విరమణ చేసిన రామచంద్ర.. అమరరాజా కొత్త బాస్‌ జయదేవ్‌


తిరుపతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామిక సంస్థ అమరరాజాపై వస్తున్న వార్తలపైనా, పీసీబీ అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల తదితరులు చేసిన వ్యాఖ్యలపైనా స్పందించేందుకు గల్లా కుటుంబం నిరాకరించింది. విషయం కోర్టులో ఉండగా మాట్లాడలేమని, కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని వ్యవస్థాపక చైర్మన్‌ రామచంద్ర నాయుడు తెలిపారు. పరిశ్రమను ఇతర ప్రాంతాలకు తరలించే అంశంపై ‘‘ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని వచ్చాం. చేయగలిగింది చేశాం. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం. పరిశ్రమ వెళ్లిపోతుందంటూ వస్తున్న వార్తలపై ఇప్పుడు స్పందించలేము. భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా రేపటి తరం నిర్ణయం తీసుకుంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలోని కరకంబాడిలో ఉన్న అమరరాజా పరిశ్రమలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 


యువ నాయకత్వానికి బాధ్యతలు

తాను పదవీ విరమణ చేస్తున్నానని.. అమరరాజా బాధ్యతలను యువ నాయకత్వానికి అప్పగిస్తున్నానని.. ఇకపై చైర్మన్‌గా గల్లా జయదేవ్‌, డైరెక్టర్లుగా గౌరినేని హర్షవర్ధన్‌, విక్రమాదిత్య వ్యవహరిస్తారని ప్రకటించారు. చిత్తూరు జిల్లా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో 1985లో స్థాపించిన అమరరాజా పరిశ్రమ ప్రస్థానాన్ని ఆయన వివరించారు. తన పదవీ విరమణ తర్వాత యువ రక్తం తాము పాటించిన సిద్ధాంతాలతో సంస్థను మరింత ముందుకు తీసుకుపోతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. పదవీ విరమణ తనకెంతో తృప్తిగా, హాయిగా ఉందన్నారు. సామాజిక సేవలో రిటైర్మెంట్‌ జీవితాన్ని గడుపుతానని చెప్పారు.


సజ్జల సంచలన కామెంట్స్‌పై రియాక్షన్ లేదేం..!?

‘‘పరిశ్రమ కాలుష్యంపై అనేక కథనాలు వస్తున్నాయి. వాటి వెనుక రాజకీయ కక్షసాధింపు ఏమైనా ఉందని భావిస్తున్నారా? ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు?’’ అని మీడియా అడిగిన ప్రశ్నలకు గల్లా జయదేవ్‌ స్పందించారు. ‘‘గత నెల రోజుల నుంచి అన్ని పత్రికల్లో, చానల్స్‌లో ఏదో ఒక వార్త వస్తోంది. ఒక సెక్షన్‌ మీడియాలో ఒక వార్త వస్తోంది... ఇంకో సెక్షన్‌ మీడియాలో ఇంకో వార్త వస్తోంది. అది మంచిదైనా, చెడ్డదైనా స్పందించలేదు. ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా మా కంపెనీపై చాలా చెడ్డగా, కాలుష్యంపైన రాసింది. దానిపైనా మేం స్పందించలేదు. అది మా పాలసీ. అది కోర్టులో ఉంది. మావైపు నుంచి అన్ని డాక్యుమెంట్లను కోర్టుకు అందించాం. అవి పబ్లిక్‌ కు అందుబాటులో ఉన్నాయి. మీడియా మిత్రులు కొద్ది ప్రయత్నం చేస్తే అవి దొరకడం కష్టమేమీ కాదు. కోర్టు కేసు పూర్తయ్యే వరకూ దానిపై స్పందించలేము’’ అని వివరించారు. పరిశ్రమ విస్తరణ కోసం తమిళనాడు వెళ్తోందని, అసలు పరిశ్రమనే తరలిస్తారంటూ వస్తున్న వార్తలపై స్పందించాలన్న విజ్ఞప్తిపై జయదేవ్‌... ‘‘తమిళనాడులో విస్తరణ అనే రూమర్‌పై నేను స్పందించలేను. భవిష్య ప్రణాళికలపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే స్పందించ గలుగుతాం. భవిష్యత్తు అవసరాలు, అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, భాగస్వాములందరికీ మంచి చేసే నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుంది’’ అని చెప్పారు. 


అవకాశాలను సృష్టించుకోవాలి..

అవకాశాలను మనమే సృష్టించుకుంటూ పోవాలని.. అది దేశప్రగతికి ఉపయోగపడుతుందని రామచంద్ర నాయుడు వ్యాఖ్యానించారు. అమరరాజా ప్రస్థానాన్ని వివరించారు. ‘‘రూ.2 కోట్లతో కరకంబాడిలో రెండు ప్లాంట్లు ప్రారంభించాం. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రూ.6 వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద బ్యాటరీ తయారీ సంస్థగా అమరరాజా నిలిచింది. ప్రపంచంలోనే ఉత్తమ ప్లాంట్‌గా మన్ననలు అందుకుంది. 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. 8 వేల మంది చదువుకోని వారికి కూడా స్కిల్స్‌ నేర్పించి మంచి వర్కర్లుగా తయారుచేశాం. సిబ్బందిని కేవలం జీతగాళ్లగానే చూడకుండా వారికి అవసరమైన అన్నిరకాల వసతులను కల్పించాం. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవ చేస్తున్నాం. నాణ్యమైన విద్య అందిస్తున్నాం. మనకు రావలసిన అవకాశాలు బయటకు వెళ్తున్నాయని.. మనకు కావలసిన వాటిని మనమే డిజైన్‌ చేసుకుంటే.. ఎవరో తయారు చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అగత్యం ఉండదు’’ అని పేర్కొన్నారు.


నేను రాజకీయవేత్తను కాదు..

రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం నుంచి సమస్యలేమైనా ఎదురవుతున్నాయా? గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం భిన్నమైనదని మీరు భావిస్తున్నారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు... ‘‘సమస్యలు కొత్తగా ఏమీ లేవు. పరిశ్రమ స్థాపన నుంచి ఇప్పటి వరకూ సవాళ్లు వస్తూనే వున్నాయి. వాటి నుంచి పారిపోవడం లేదు. ఎదుర్కొంటూ, పరిష్కరించుకుంటూ సాగుతున్నాం. నేను రాజకీయవేత్తను కాదు. సోషల్‌ వర్కర్‌ని, పరిశ్రమాధిపతిని మాత్రమే. ప్రభుత్వాలపై వ్యాఖ్యానించే అర్హత నాకు లేదు’’ అని వ్యవస్థాపక చైర్మన్‌ చెప్పారు.

Updated Date - 2021-08-14T08:20:53+05:30 IST