కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ మంత్రి

ABN , First Publish Date - 2020-03-26T19:12:37+05:30 IST

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామాలకు పయనమైన కొంత మంది ఇంకా ఇబ్బందులు..

కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ మంత్రి

హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామాలకు పయనమైన కొంత మంది ఇంకా ఇబ్బందులు పడుతున్న అంశంపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ఈ అశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నిన్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో కొత్తగా ఎవరూ ప్రయాణాలు చేయకుండా చూడాలని కోరారు. అందరి క్షేమం కోసం దేశమంతా  లాక్‌డౌన్‌గా ఉన్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండేలా చొరవ చూపాలని కేటీఆర్‌ను కోరారు. ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి మంత్రి తీసుకువెళ్లారు.


అలాగే గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఆగిపోయిన విద్యార్థులు, ప్రజలను తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి ఏపీ రాష్ట్రంలోకి అనుమతించేలా చూడాలని గౌతమ్ రెడ్డి గుంటూరు రూరల్ ఎస్పీ విజయ్ కుమార్‌తో అన్నారు. పరీక్షల అనంతరం అవసరమైతే సమీపంలోని క్వారంటైన్ తరలివెళ్లేందుకు సుముఖంగా ఉన్నవారందరినీ అనుమతించి, వారికి అత్యవసరమైన సదుపాయాలు అందించాలన్నారు. ఇకపై ఎవరూ, ఎక్కడికి ప్రయాణం చేయవద్దని ప్రజలకు మంత్రి గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో అశ్రద్ధతో ఒక్కరు బయటికి వచ్చినా మనతో పాటు ఎన్నో ప్రాణాలకు ముప్పు అని.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని మంత్రి మేకపాటి అన్నారు.

Updated Date - 2020-03-26T19:12:37+05:30 IST