ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2021-12-02T14:11:51+05:30 IST

వీఆర్వోలు సచివాలయాలకు వస్తే వారిని తరమాలంటూ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) అమలు తీరుపై బుధవారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి అప్పలరాజు..

ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

సచివాలయాలకు వస్తే వీఆర్వోలను తరమండి!

వారిని కట్టడి చేయలేని తహసీల్దార్లు ఎందుకు?

మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు

క్షమాపణకు వీఆర్వోల సంఘం డిమాండ్‌

నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన 


పలాస, విజయవాడ సిటీ: వీఆర్వోలు సచివాలయాలకు వస్తే వారిని తరమాలంటూ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) అమలు తీరుపై బుధవారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు. సమావేశానికి ముందు అక్కడికి హాజరైన వీఆర్వోలను పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ కమిషనర్‌ టి.రాజగోపాలరావు బయటికి పొమ్మన్నారు. తమను పిలిచి ఎందుకు అవమానిస్తున్నారని వారు ప్రశ్నించగా, మరింత కటువుగా మాట్లాడడంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు.


అంతలో అక్కడికి వచ్చిన మంత్రికి జరిగిన విషయాన్ని విన్నవించేందుకు వీఆర్వోలు ఆయన్ను చుట్టుముట్టారు. దీనిపై మంత్రి అసహనం వ్యక్తంచేశారు. ‘రాజకీయం చేయడానికి వచ్చారా? ఉద్యోగానికి వచ్చారా?’ అంటూ మండిపడ్డారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ వీఆర్వోలు రేపటి (గురువారం) నుంచి సచివాలయాలకు వస్తే సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వారిని తరమాలంటూ పిలుపునిచ్చారు. వీఆర్వోలను కట్టడి చేయలేని అధికారులు ఎందుకని తహసీల్దార్లను నిలదీశారు.


మంత్రి తీరుపై వీఆర్వోలతో పాటు తహసీల్దార్లు కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. సమావేశానికి పిలిచి అవమానించడం తగదని, కలెక్టర్‌ వద్దే తేల్చుకుంటామని వీఆర్వోలు చెప్పారు. కాగా.. మంత్రి వ్యాఖ్యలను వీఆర్వోల సంఘం తీవ్రంగా ఖండించింది. తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఏపీవీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు, రవీంద్రరాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-12-02T14:11:51+05:30 IST