దేవుడి భూమికి దిక్కెవరు.. రూ.250 కోట్ల విలువైన భూమికి మంత్రి టెండర్‌

ABN , First Publish Date - 2021-09-29T08:03:33+05:30 IST

అక్కడా ఇక్కడా లాగే కమీషన్లు ఏ మూలకు సరిపోతాయి! ఎన్ని కాంట్రాక్టులు చేస్తేమాత్రం ఏమంత వస్తాయి! ఇవన్నీ కాదు ఏదైనా గట్టిగా పట్టాలి... ఒకేసారి వందలకోట్లు రావాలి!... అని అనుకున్నారు ఓ మంత్రిగారు! ఏకంగా దేవుడి భూములకే టెండర్‌ పెట్టారు. అది కూడా ఎకరం..

దేవుడి భూమికి దిక్కెవరు.. రూ.250 కోట్ల విలువైన భూమికి మంత్రి టెండర్‌

గుడివాడ శివారులో  25 ఎకరాల దేవదాసీ ఇనామ్‌ భూమి

ఎకరం విలువ 10 కోట్లపైనే అని అంచనా

ఆలయ భూములుగా ఎప్పుడో నిర్ధారణ

నిషేధిత జాబితాలో చేర్చిన దేవదాయ శాఖ

ఇప్పుడు ఎన్‌వోసీ ఇవ్వాలంటూ మంత్రి ఒత్తిడి

పదవి ఉండగానే పని పూర్తికి తాపత్రయం

నెలలో ఐదుసార్లు దేవదాయ కమిషనరేట్‌కు

ఇప్పటికే ఆయనకు అనుకూలంగా నివేదిక!


త్వరలో జరిగే మంత్రివర్గ మార్పుల్లో అందరితోపాటు తన పదవీ పోతుందని ఆ మంత్రికి తెలుసు! ‘తీసేసిన మంత్రి’గా తన మాటకు పెద్ద విలువ ఉండదనీ తెలుసు. అందుకే... పదవి ఉండగానే ఓ పెద్ద పని పూర్తి చేసుకునేందుకు తెగ తొందర పడుతున్నారు. అధికారులనూ తొందర పెడుతున్నారు. అదేమిటంటే... సుమారు రూ.250 కోట్ల విలువైన దేవుడి భూమిని సొంతం చేసుకోవడం! ఇందులో విచిత్రం ఏమిటంటే... భూములను కాపాడాల్సిన అధికారులు కూడా... మంత్రికి వంత పాడుతున్నారు. దేవుడి భక్తి మానేసి... మంత్రికి భజన చేస్తున్నారు. ఆయన కోరుకున్న విధంగానే.. ‘ఇది దేవుడి భూమే కాదు. దేవుడికీ, ఆ భూమికీ ఎలాంటి సంబంధమూ లేదు’ అని నివేదిక ఇచ్చేశారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): అక్కడా ఇక్కడా లాగే కమీషన్లు ఏ మూలకు సరిపోతాయి! ఎన్ని కాంట్రాక్టులు చేస్తేమాత్రం ఏమంత వస్తాయి! ఇవన్నీ కాదు ఏదైనా గట్టిగా పట్టాలి... ఒకేసారి వందలకోట్లు రావాలి!... అని అనుకున్నారు ఓ మంత్రిగారు! ఏకంగా దేవుడి భూములకే టెండర్‌ పెట్టారు. అది కూడా ఎకరం రెండెకరాలు కాదు... ఏకంగా 25.54 ఎకరాలు! దాని విలువ... రూ.250 కోట్లు. ఆయన అనుకోగానే... చకచకా ఫైళ్లను కదిలించారు. ‘మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను చెప్పిన భూమికి ఎన్‌వోసీ ఇవ్వాలి అంతే!’ అని అధికారులకు హుకుం జారీ చేశారు.


కృష్ణా జిల్లా గుడివాడలోని భీమేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం రెండింటికీ కలిపి పట్టణ శివారులో జాయింట్‌ ఇనామ్‌ భూములు ఉన్నాయి. వెలివర్తిపాడులో సర్వే నంబరు 272లో 15.07 ఎకరాలు, 294లో 5.64 ఎకరాలు, యల్లయపాలెంలోని సర్వే నంబరు 4లో 4.83 ఎకరాల భూములు ఉన్నాయి. దేవదాసీ ఇనామ్‌ కింద ఈ భూములను దాతలు విరాళంగా ఇచ్చారు. 1942లో దేవదాసీ ఇనామ్‌లు రద్దు కావడంతో ఆ భూములు పూర్తిగా ఆలయాల పరిధిలోకి వచ్చాయి. ఆ భూములను కొందరు ఆక్రమించుకున్నారని 2016లో ఆలయాల అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూముల పరిరక్షణకు దేవదాయశాఖ ట్రైబ్యునల్‌ను అధికారులు ఆశ్రయించారు. వాటిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్‌.. వాటిలో చాలావరకూ దేవుడి భూములేనని, వాటిలో ఆక్రమణదారులను తొలగించాలని ఎవిక్షన్‌ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఆ భూములను దేవదాయశాఖ చట్టం 43(10) సెక్షన్‌లోకి చేర్చి, నిషేధిత జాబితాలో చేర్చాలని అప్పటి కమిషనర్‌ స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖను కోరారు. అందుకు అనుగుణంగా 2017లో ఆ భూములను 22ఏ1(సి) జాబితాలో చేర్చారు. దాని ప్రకారం ఆ భూములు రిజిస్ర్టేషన్ల శాఖ నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి.


ఆ మంత్రి కన్ను

పట్టణ శివారు, వాణిజ్య కార్యకలాపాలకు అనుగుణంగా ఉండే ఈ భూములపై మంత్రి కన్నేశారు. ఇప్పటికే ఆక్రమణలో ఉండటం, అందులో తన అనుచరులే ఉండటంతో ఆ భూములను దక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా ఆ భూములు దక్కించుకోవాలని దేవదాయశాఖ మంత్రిని కూడా పిలవకుండా కృష్ణా జిల్లా అధికారులు, దేవదాయశాఖ అధికారులతో కలిసి విజయవాడలో ఓ సమావేశం ఏర్పాటు చేయించారు. ఆ భూములకు ఎన్‌వోసీ ఇచ్చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే... అలా నేరుగా ఎన్‌వోసీ ఇవ్వడం ఎక్కడా ఉండదని, దానికో ప్రొసీజర్‌ ఉంటుందని అధికారులు తెలిపారు. ముందుగా ఎన్‌వోసీకి దరఖాస్తు చేసుకోవాలని మంత్రికి వివరించారు. అయితే దరఖాస్తు కూడా మీరే తయారుచేయాలంటూ ఆయన దేవదాయశాఖ అధికారులనే ఆదేశించారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులు సూచించగా... ‘కమిటీ ఎందుకు? ఎంతమందిని జైలుకు పంపిస్తారు?’ అని ఆ మంత్రి వ్యాఖ్యానించడంతో అధికారులంతా అవాక్కయ్యారు.


అంటే... జరిగేది తప్పు అని తెలిసే చేయిస్తున్నానని మంత్రి చెప్పకనే చెప్పేశారు. అనంతరం ఇదే విషయంపై సీఎంవోలోని ఓ ఉన్నతాధికారి వద్ద మంత్రి దీనిపై సమావేశం ఏర్పాటు చేశారు. ఆ ఉన్నతాధికారి కూడా ముందు ఓ కమిటీని ఏర్పాటు చేద్దామని, దాని ప్రకారం చేద్దామని సూచించడంతో... కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, గుడివాడ ఆర్డీవో, దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌లతో కమిటీని నియమించారు. ఇది ‘పద్ధతి’గా జరగాలన్న నిర్ణయంలో భాగంగా ఏర్పాటైన కమిటీ! దేవుడి భూములు కాపాడాలన్నది వారి అజెండాలో లేదు. అందుకే... మంత్రి కోరుకున్నట్లుగా ఎన్‌వోసీ ఇచ్చేందుకు అనుకూలంగా ఇటీవలే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఖాతరు చేయకుండా జిల్లా అధికారులు అనుకూలంగా నివేదిక ఎలా ఇచ్చారన్నది అర్ధంకాని వ్యవహారం. దీనిలో జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి బాగా ఎక్కువ ఉత్సాహం చూపించినట్లు దేవదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. 


ముందుకు వెళ్లేదెలా?

‘‘కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది కదా! ఇక... భూములపై ఎన్‌వోసీ జారీ చేయండి’’ అని ఆ మంత్రి అధికారులపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అయితే, ఈ భూములపై ట్రైబ్యునల్‌ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. వాటిని ఉల్లంఘించి ఎన్‌వోసీ ఇచ్చేస్తే భవిష్యత్తులో అది తమ మెడకు చుట్టుకుంటుందని అధికారులు జంకుతున్నారు. మంత్రి మాత్రం ఏ మాత్రం జాప్యాన్ని భరించలేకపోతున్నారు. ఎందుకంటే... మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగిపోతే తన పదవి ఉండదని, ఎన్‌వోసీ రావడం మరింత కష్టమని ఆయనకూ తెలుసు! అందుకే... ఎలాగైనా వెంటనే పని చేసేయాలని ఆ మంత్రి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యస్థాయి అధికారులపై దూషణలకు దిగుతూ, అసభ్యపదజాలం కూడా ఉపయోగిస్తున్నారని దేవదాయశాఖ వర్గాలు వాపోతున్నాయి.


ఎకరం పది కోట్లు

గుడివాడ పట్టణ శివారులో ప్రముఖ కాలేజీలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు సమీపంలో ఉన్న ఈ భూములకు భారీ ధర పలుకుతోంది. ఎకరం దాదాపు రూ.10కోట్లు ఉండొచ్చని అంచనా. ఎన్‌వోసీ చేతికొస్తే ఇక్కడ రిసార్ట్‌లు కట్టాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అంత ఖరీదైన భూములను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని ఆ మంత్రి టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ భూములకు ఎన్‌వోసీ ఇచ్చేస్తారా? ఇస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏకంగా రూ.250కోట్ల విలువైన భూములకు దేవదాయ శాఖ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఎన్‌వోసీలు ఇవ్వలేదు. ఆ భూములపై త్వరగా ఎన్‌వోసీ జారీచేయాలని ఒత్తిడి చేస్తూ నేరుగా ఆ మంత్రే నెల రోజుల వ్యవధిలో దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి ఐదుసార్లు వచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. దేవుడి భూములు దేవుడి వద్దే ఉంటాయా... లేక మంత్రి గారి ఖాతాలోకి వెళతాయో.. చూడాలి మరి! 

Updated Date - 2021-09-29T08:03:33+05:30 IST