‘పన్నుల చెల్లింపునకు మరోసారి గడువు ఇవ్వండి..’

ABN , First Publish Date - 2020-07-07T02:52:30+05:30 IST

పన్నులు చెల్లించేందుకు మరో రెండు నెలలు గడువు పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్‌ను ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ

‘పన్నుల చెల్లింపునకు మరోసారి గడువు ఇవ్వండి..’

విజయవాడ: పన్నులు చెల్లించేందుకు మరో రెండు నెలలు గడువు పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్‌ను ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర రవాణా రంగం సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో లాక్‌డౌన్ వల్ల లారీ ఓనర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి నుండి వినియోగదారుల వరకు ఉన్న సప్లై పూర్తిగా నిలిచిపోయిందన్నారు. మార్కెట్‌లో గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీజిల్‌పై రూ.11 వరకు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ అభ్యర్థన మేరకు పన్ను చెల్లింపునకు అదనంగా రెండు నెలల పాటు గడువు ఇచ్చారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటులో కూడా పన్నులు చెల్లించలేని దుర్భర స్థితిలో చాలా మంది ఉన్నారని లారీ ఓనర్ల దీన స్థితిని ఈశ్వరరావు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి సమయంలో పన్నులు చెల్లించని వారికి 50శాతం అపరాధ రుసుము చెల్లించాలని నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇబ్బందులు ఉన్నా జూన్ 30 వ తేదీకి ముందుగా చాలా మంది అప్పులు చేసి మరీ చెల్లించారని, కొంతమంది అవకాశం లేకపోవడంతో చెల్లించలేదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, నేషనల్ పర్మిట్ రెన్యూవల్ చలానా లేకుండా కేంద్రం రెండు నెలలు అదనంగా గడువు పెంచిందని, కావున రెండో త్రైమాసిక పన్ను, ఇతర పన్నులు చెల్లించేందుకు మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌కు ఈశ్వరరావు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-07-07T02:52:30+05:30 IST