ఏపీ, తెలంగాణలో ఐఓసీ మెగా ఇథనాల్‌ ప్లాంట్లు

ABN , First Publish Date - 2021-02-25T06:23:32+05:30 IST

ఆహార వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మెగా ఇథనాల్‌ తయారీ ప్లాంట్లను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)

ఏపీ, తెలంగాణలో  ఐఓసీ మెగా ఇథనాల్‌ ప్లాంట్లు

రూ.1,200 కోట్ల పెట్టుబడులు

రోజుకు 5 లక్షల లీటర్ల ఉత్పత్తి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆహార వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మెగా ఇథనాల్‌ తయారీ ప్లాంట్లను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఏర్పాటుచేస్తోంది. ఒక్కొక్క ప్లాంట్‌పై రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రోజుకు 5 లక్షల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఐఓసీ డైరెక్టర్‌ (పరిశోధన, అభివృద్ధి) ఎస్‌ఎ్‌సవీ రామకుమార్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ శ్రవణ్‌ ఎస్‌ రావు తెలిపారు.


భూమి కేటాయింపు జరిగిన ఏడాదిన్నరలో ప్లాంట్‌ను సిద్ధం చేయాలని కంపెనీ భావిస్తోంది. కాగా ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రెండు చోట్ల స్థలాన్ని చూపించిందని, ఇందులో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉందని శ్రవణ్‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని త్వరలో కలవనున్నట్లు చెప్పారు. చమురు కంపెనీలు మొత్తం 12 బయో ఫ్యూయల్‌ రిఫైనరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయని.. ఇందులో మూడింటిని ఐఓసీ ఏర్పాటు చేస్తోందని రామకుమార్‌ తెలిపారు. 


మార్కెట్లోకి ప్రీమియం డీజిల్‌: పెట్రోల్‌ తరహాలోనే ఐఓసీ త్వరలో సుపీరియర్‌, ప్రీమియం గ్రేడ్‌ డీజిల్‌ను విడుదల చేయనుంది. కర్బన ఉద్గారాల విడుదల తక్కువగా ఉండడమే కాక ఎక్కువ మైలేజీని ఈ డీజిల్‌ ఇస్తుందన్నారు. 




5,000 కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్లు: కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సతత్‌ పథకం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రామకుమార్‌ తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే.. రుణం ఇప్పించడం నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వరకూ అన్నీ ఐఓసీనే చూసుకుంటుందన్నారు.


కాగా బయోటెక్నాలజీ ద్వారా కార్బన్‌ డైయాక్సైడ్‌ను ఫెర్మెంటేషన్‌ విధానంలో ఇథనాల్‌గా మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు రామకుమార్‌ వెల్లడించారు. కార్బన్‌డైయాక్సైడ్‌ నుంచి నేరుగా ఒమెగా-3 ఫ్యా టీ యాసిడ్లు, లిపిడ్‌లను తయారు చేసే టెక్నాలజీని రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనంగా హైడ్రోజన్‌ను తీసుకురావడంపై ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు.


అల్యూమినియం బ్యాటరీల తయారీ: ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం అల్యూమినియం బ్యాటరీని ఐఓసీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు ఇజ్రాయెల్‌ కంపెనీ పీహెచ్‌ఐ ఎనర్జీతో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేసింది. గిగావాట్‌ సామర్థ్యంతో త్వరలో అల్యూమినియం ఎయిర్‌ బ్యాటరీ త యారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. లిథియం బ్యాటరీకి ప్రత్యామ్నాయంగా ఈ బ్యాటరీలను కంపెనీ తీసుకువస్తోంది. 


Updated Date - 2021-02-25T06:23:32+05:30 IST