పార్లమెంట్‌లో ఏపీ... ఉక్కు ప్రైవేటీకరణ తథ్యం

ABN , First Publish Date - 2021-07-27T08:44:52+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని పోరాడుతున్న కార్మికుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని, ఈ ప్రక్రియ ఆగదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

పార్లమెంట్‌లో ఏపీ... ఉక్కు ప్రైవేటీకరణ తథ్యం

బేరసారాలు జరుగుతున్నాయి:  కేంద్రం 


న్యూఢిల్లీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని పోరాడుతున్న కార్మికుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని, ఈ ప్రక్రియ ఆగదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌ రావు కరాడ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై రెండో ఆలోచనే లేదని స్పష్టం చేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు 35 ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ సంస్థలు, ఉమ్మడి రంగంలో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని సూత్రప్రాయంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ప్రస్తుతం 21 సంస్థల ప్రైవేటీకరణ కోసం బేరసారాలు జరుగుతున్నాయని, వాటిలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కూడా ఉందని మంత్రి తెలిపారు.   


గోదావరి ట్రైబ్యునల్‌పై అభ్యర్థన రాలేదు

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956 (ఐఎ్‌సఆర్‌డబ్ల్యూడీ) నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య గోదావరి నదీ జలాల పంపకం విషయమై తీర్పు కోసం గోదావరి ట్రైబ్యునల్‌ ఏర్పాటు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు, అభ్యర్థనలూ రాలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.


పరిశీలనలో ‘విజయవాడ-బెంగళూరు’ డీపీఆర్‌

విజయవాడ నుంచి బెంగళూరు వరకు నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను కన్సల్టెన్సీకి అప్పగించామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 


ఏపీకి జీఎస్టీ బకాయి రూ.4052 కోట్లు 

ఆంధ్రప్రదేశ్‌కు 2020 ఏప్రిల్‌ నుంచి మార్చి 2021 మధ్యకాలంలో జీఎస్టీ పరిహారం రూపంలో రూ.2780.24 కోట్లు చెల్లించామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి స్పష్టం చేశారు. అదే కాలానికి సంబంధించి ఇంకా రూ.2493 కోట్లు, ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలకు గాను రూ.1559 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమల జీఎస్టీ బకాయిలను 45 రోజుల్లో చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌... మిథున్‌ రెడ్డి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Updated Date - 2021-07-27T08:44:52+05:30 IST