ఉద్దానం కిడ్నీ బాధితుల అవస్థలపై ఏపీ హైకోర్టు తీర్పు

ABN , First Publish Date - 2022-02-02T02:47:24+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల అవస్థలపై ఏపీ హైకోర్టు

ఉద్దానం కిడ్నీ బాధితుల అవస్థలపై ఏపీ హైకోర్టు తీర్పు

అమరావతి: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల అవస్థలపై ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఉద్దానంలో జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇటుకబట్టీల వ్యర్థాలను నిలిపివేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కిడ్నీ బాధితుల అత్యవసర కేసులను ఆస్పత్రులు నిరాకరించకూడదని ఆదేశించింది. ఆస్పత్రిలో బాధితుల అడ్మిషన్లు, ఇతర వివరాలపై రికార్డులు నిర్వహించాలని పేర్కొంది. ఉద్దానం ప్రాంతంలోని పీహెచ్‌సీలో తగిన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఉద్దానం ప్రాంతంలో బాధితులకు వైద్య నిపుణులతో చికిత్స అందించాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్దానం ప్రాంతంలో సెమినార్‌లు నిర్వహించి అవగాహన కల్పించాలంది. డయాలసిస్‌ యూనిట్లు, టెస్టింగ్‌ ల్యాబరేటరీలను వెంటనే నిర్మించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. భూగర్భ జలాల్లో కలుషితాలను తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు లీగల్‌ సర్వీస్‌ అథారిటీతో కమిటీలను నియమించాలంది. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ తగిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్రం నిధులు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజల జీవించే హక్కు, తగిన ఆరోగ్య సంరక్షణ కోసం స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు సహాయం చేయాలని హైకోర్టు ఆదేశించింది. కిడ్నీ బాధితులను ఆదుకోవాలని  హైకోర్టులో న్యాయవాది లక్ష్మీనారాయణ పిటిషన్‌ వేశారు. సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.  

Updated Date - 2022-02-02T02:47:24+05:30 IST