లోపాలను దిద్దుకోండి : జగన్ సర్కార్‌కు హైకోర్టు సూచన

ABN , First Publish Date - 2021-05-06T21:00:47+05:30 IST

కోవిడ్ వైద్య చికిత్సపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై దాదాపు మూడు గంటల పాటు హైకోర్టులో

లోపాలను దిద్దుకోండి : జగన్ సర్కార్‌కు హైకోర్టు సూచన

అమరావతి : కోవిడ్ వైద్య చికిత్సపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై దాదాపు మూడు గంటల పాటు హైకోర్టులో విచారణ సాగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీన్ కుమార్ విచారణ చేపట్టారు. పడకలు, ఆక్సిజన్ లభ్యత, నోడల్ ఆఫీసర్ల పనితీరు, 104 కాల్ సెంటర్, వ్యాక్సినేషన్ పురోగతి తదితర అంశాలపై విచారణ చేపట్టారు. ఈ అంశాలలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా పరీక్షల ఫలితాలను కూడా వేగవంతం చేయాలని సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఏమాత్రం పొంతన లేకుండా ఉందని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక.. పడకలు లేవని నోడల్ అధికారులే చెప్పడంపై కూడా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.


అనంతపురం ఆస్పత్రిలో కోవిడ్ మరణాలపై ఓ రిపోర్టును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఆక్సిజన్ సరఫరాపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉండే బళ్లారి, తమిళనాడు నుంచి ఇచ్చేలా చూడాలని కేంద్రానికి సూచించింది. వీటితో పాటు కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్ల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నోడల్ అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, ఎక్కువ పరీక్షలు చేసేలా సౌకర్యాలు కూడా పెంచాలని కోరింది. ఇక వ్యాక్సినేషన్‌పై కూడా హైకోర్టు ఆరా తీసింది. 45 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా అందరికీ వ్యాక్సిన్ వేయడంలో ప్రభుత్వం ముందున్న ఇబ్బందులేంటని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

Updated Date - 2021-05-06T21:00:47+05:30 IST