శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు చర్యలు

ABN , First Publish Date - 2021-02-26T08:51:14+05:30 IST

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని హైకోర్టుకు టీటీడీ నివేదించింది. అందులో భాగంగా గతేడాది డిసెంబరు 12న విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీధర్‌రావు...

శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు చర్యలు

  • ఆస్తుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాం
  • విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ...  హైకోర్టుకు తెలిపిన టీటీడీ
  • ఆ వివరాలు తమ ముందుంచాలన్న ధర్మాసనం
  • విచారణ వచ్చే వారానికి వాయిదా


అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని హైకోర్టుకు టీటీడీ నివేదించింది. అందులో భాగంగా గతేడాది డిసెంబరు 12న విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీధర్‌రావు, జస్టిస్‌ సీతారామమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు టీటీడీ తరఫు న్యాయవాది సుమంత్‌ న్యాయస్థానానికి తెలిపారు. శ్రీవారి ఆస్తుల వివరాలను గత నవంబరు 28న వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు. ఆస్తుల రక్షణకు టీటీడీ తీర్మానాలు చేసిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వెబ్‌సైట్‌లో పొందుపర్చిన ఆస్తుల వివరాలతో పాటు తీర్మానాలను తమ ముందుంచాలని ఆదేశించింది. విచారణను వచ్చేవారానికి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. టీటీడీకి సంబంధించిన 23 ఆస్తుల వేలం నిలిపివేయాలని కోరుతూ అనంతపురానికి చెందిన బీజేపీ నేత జగతి అమర్‌నాథ్‌ వేసిన పిల్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు, ఆస్తులకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయని, వాటి రక్షణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వై.బాలాజీ కోరారు. ఓ వ్యవహారంలో టీటీడీ పరువునష్టం దావా వేసిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. వ్యాజ్యంలో పేర్కొన్న విషయాలు కాకుండా ఇతర అంశాలు ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర విషయాల జోలికి వెళ్లవద్దని, వ్యాజ్యంలోని అంశాలకు లోబడి వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది.


Updated Date - 2021-02-26T08:51:14+05:30 IST