హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్.. ఆ వెంటనే జగన్ సర్కార్ నిర్ణయమిది..!

ABN , First Publish Date - 2020-10-22T00:09:21+05:30 IST

ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ సర్కార్ మరోసారి తన పక్షపాత బుద్ధిని బయటపెట్టుకుంది. నిమ్మగడ్డ ఆ స్థానంలోనే...

హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్.. ఆ వెంటనే జగన్ సర్కార్ నిర్ణయమిది..!

అమరావతి: ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ సర్కార్ మరోసారి తన పక్షపాత బుద్ధిని బయటపెట్టుకుంది. నిమ్మగడ్డ ఆ స్థానంలోనే కొనసాగడం ఇష్టం లేని వైసీపీ సర్కార్ తాజాగా స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ ఎన్నికల సంఘాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా.. ప్రభుత్వంపై ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ న్యాయ వ్యవస్థను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక ఎన్నికలకు జగన్ సర్కార్ సహకరించడం లేదని ఏపీ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున రిట్ పిటిషన్ దాఖలైంది.


ఎన్నికల సంఘం నిర్వహణకు ఖర్చయ్యే నిధులను మంజూరు చేయకుండా ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషన్‌లో నిమ్మగడ్డ పేర్కొన్నారు. అయితే.. ఏపీ ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలుసుకున్న వైసీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ పిటిషన్ వేసిన వెంటనే ఎన్నికల సంఘం నిర్వహణ నిధుల కింద రూ.39 లక్షలు విడుదల చేసింది. రూ.40 లక్షలకు గానూ రూ.39 లక్షలు విడుదల చేశామని, దీనిపై అదనంగా ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించడం గమనార్హం. ఏదైనా అవసరం ఉంటే ఏపీ ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. 


అయితే.. రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తాము గమనిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తాము గమనిస్తే తప్పేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని, ప్రభుత్వ వైఖరితో హైకోర్టును ఆశ్రయించాల్సిరావడం బాధాకరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీతారామ్మూర్తి, అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు.

Updated Date - 2020-10-22T00:09:21+05:30 IST