అప్పుల కోసం అతి తెలివి.. వింత ప్రతిపాదనతో విస్తుపోయిన బ్యాంకులు

ABN , First Publish Date - 2021-09-29T07:59:57+05:30 IST

ఇదీ రాష్ట్ర ఆర్థిక శాఖ వైఖరి. అందినకాడికి అప్పులు తెచ్చుకుంటున్న సర్కారు... చివరికి కేంద్ర ప్రభుత్వ నిధులనూ తాకట్టు పెట్టి అప్పులు తేవడానికి సిద్ధమైంది. ‘‘రాష్ట్రానికి అప్పులివ్వండి. నిర్ణీత గడువులోగా రాష్ట్రం చెల్లించలేకపోతే, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్రం..

అప్పుల కోసం అతి తెలివి.. వింత ప్రతిపాదనతో విస్తుపోయిన బ్యాంకులు

కేంద్రాన్ని, బ్యాంకులను బురిడీ కొట్టించే యత్నం

కేంద్ర పథకాలకు వాటా నిధులు ఇవ్వని రాష్ట్రం

రెండేళ్లలో 26 వేల కోట్లు సొంతానికి మళ్లింపు

ప్రత్యేక ఖాతాలు తెరవాల్సిందేనన్న కేంద్రం

మ్యాచింగ్‌ గ్రాంట్‌ జమ చేయక తప్పని స్థితి

ఆ మొత్తం అప్పుగా ఇవ్వాలంటూ బ్యాంకులకు లేఖ

దానికి కేంద్రం తన వాటాగా ఇచ్చే నిధులే ‘ష్యూరిటీ’

బ్యాంకులకు ఆర్థిక శాఖ కార్యదర్శి లేఖ

వింత ప్రతిపాదనతో విస్తుపోయిన బ్యాంకులు

అది కుదరదని స్పష్టం చేస్తూ జవాబు

వంద ఖాతాలకు బదులు.. 5 కార్పొరేషన్ల ఏర్పాటు


ఇది అతి తెలివికి మించిన తెలివి! బ్యాంకులను, కేంద్ర ప్రభుత్వాన్నీ బురిడీ కొట్టించేంత మహా తెలివి! కేంద్ర ప్రాయోజిత పథకాలకు తనవంతు నిధులు విడుదల చేయాల్సిన రాష్ట్రం ఎంచక్కా చేతులెత్తేసింది. అదేమిటని ప్రశ్నిస్తే... ‘ఆ నిధులేవో మీరే అప్పుగా ఇవ్వండి’ అని బ్యాంకులను కోరింది. దీనిని కూడా దీర్ఘకాలిక ఓవర్‌  డ్రాఫ్ట్‌గా పరిగణించాలని అడిగింది. ‘మీకు ఏం చూసి అప్పు ఇవ్వాలని’ బ్యాంకులు ప్రశ్నించగా... ‘ప్రత్యేకంగా చూసేదేముంది! కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఢిల్లీ నుంచి డబ్బులు వస్తాయి కదా! అదే... ష్యూరిటీగా పెట్టుకుని, మా వాటా నిధులను అప్పుగా ఇచ్చేయండి’ అని స్మార్ట్‌గా చెప్పేసింది. ఈ తెలివితేటలు చూసి బ్యాంకులకే బుర్ర తిరిగిపోయింది. ‘అవేవీ కుదరవు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులు ఇటీవలే లేఖ రాశాయి.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘మీ ఇంటికొస్తే ఏమిస్తావ్‌? మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్‌’...

ఇదీ రాష్ట్ర ఆర్థిక శాఖ వైఖరి. అందినకాడికి అప్పులు తెచ్చుకుంటున్న సర్కారు... చివరికి కేంద్ర ప్రభుత్వ నిధులనూ తాకట్టు పెట్టి అప్పులు తేవడానికి సిద్ధమైంది. ‘‘రాష్ట్రానికి అప్పులివ్వండి. నిర్ణీత గడువులోగా రాష్ట్రం చెల్లించలేకపోతే, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్రం ఇచ్చే నిధులు బ్యాంకుల ఖాతాల్లోనే ఉంటాయి కదా! వాటిని తనఖా పెట్టుకోండి’’ అంటూ సెప్టెంబరు 2వ తేదీన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బ్యాంకులకు లేఖ రాశారు. కేంద్ర పథకాల నిధులు తాకట్టు పెట్టుకుని రాష్ట్రానికి అప్పులివ్వమనే ప్రతిపాదన బహుశా దేశచరిత్రలోనే ఇదే మొదటిసారి కావచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పుల కోసం బ్యాంకులతో ప్రభుత్వాల బేరసారాలు సర్వసాధారణమే! కానీ, ఇలా కేంద్ర నిధులు తాకట్టుపెడతామంటూ రాతపూర్వకంగా ఒక సెక్రటరీ లేఖ రాయడమనేది అసాధారణ చర్య అని అంటున్నారు.


కేంద్ర పథకాలకు చిల్లు...

కేంద్రం చిన్నా పెద్దా పథకాలు అన్నీ కలుపుకొని దాదాపు వంద పథకాలకు నిధులు ఇస్తోంది. ఈ రకంగా రాష్ట్రానికి సంవత్సరానికి దాదాపు రూ.13,000 కోట్లు కేంద్రం నుంచి వస్తున్నాయి. దీనికి రాష్ట్రం తన వాటాను (మ్యాచింగ్‌ గ్రాంట్‌) జత చేసి.. పథకాలను అమలు చేయాలి. రాష్ట్రం వాటా రూ.7-8వేల కోట్ల వరకు భరించాల్సి ఉంటుంది. అంటే... కేంద్రం నుంచి ఈ రెండేళ్లలో రూ.26,000 కోట్లు పథకాల కోసం వచ్చాయి. కానీ రెండేళ్లుగా ఆ నిధులను రాష్ట్రం కేంద్ర ప్రాయోజిత పథకాలకు వినియోగించలేదు. తన వాటాను జత చేయకపోగా... కేంద్రం ఇచ్చిన నిధులను సొంత అవసరాలకు వాడేసింది.


ఉదాహరణకు... రోడ్లు బాగుచేయడానికి(సీఆర్‌ఐఎఫ్‌), కార్మికులు కట్టిన బీమా డబ్బులు (ఈఎ్‌సఐ), ఉపాధి హామీ నిధులు, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం), హౌసింగ్‌ ఇలాంటి అనేక రంగాలకు చెందిన నిధులతోపాటు... గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి  ఏఐఐబీ ఇచ్చిన సొమ్ములనూ పక్కదారి పట్టించారు. దీనివల్ల నష్టపోయిన వారి నుంచి కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై కేంద్రం స్పందించి... ప్రతీ కేంద్ర పథకానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, తామిచ్చే నిధులను అందులో జమ చేయడంతో పాటు, రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంటును జమ చేయాలని స్పష్టం చేసింది. ఆ బ్యాంకు ఖాతా లాగిన్‌ వివరాలు తమకు సమర్పించాలని ఏడాది క్రితం రాష్ట్రానికి లేఖ రాసింది. కానీ, రాష్ట్రం ఆ లేఖను సీరియ్‌సగా తీసుకోలేదు. దీంతో 3 నెలల క్రితం మరోసారి కేంద్రం లేఖ రాసి....సెప్టెంబరు ముగిసేలోగా బ్యాంకు ఖాతాలు కచ్చితంగా తెరవాలని ఆదేశించింది. లేదంటే నిధులు నిలిపివేస్తామని హెచ్చరించింది. 


అదీ అప్పుగా మీరే ఇవ్వండి... 

కేంద్ర పథకాల కోసం బ్యాంకు ఖాతాలు తెరవకతప్పదని భావించిన ప్రభుత్వం... బ్యాంకర్లతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ‘కేంద్రం ఇచ్చే నిధులు బ్యాంకు ఖాతాలో వేస్తాం. కానీ, రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంటుని బ్యాంకులే భరించాలి. దానిని ప్రభుత్వానికి ఇచ్చిన అప్పుగా(ఓడీ) భావించాలి’ అనే వింత ప్రతిపాదన చేసింది. ఈ తిరకాసు లెక్కలు తమకెందుకంటూ బ్యాంకులు మౌనం వహించాయి. దీంతో ఒక అడుగు ముందుకేసి... ‘‘కేంద్రం ఇచ్చే నిధులు ఎలాగూ బ్యాంకు ఖాతాలోనే ఉంటాయి కదా! ఆ నిధులు తనఖా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటును ఓడీగా ఇవ్వండి’’ అని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి లేఖ రాశారు. దీనిపై బ్యాంక్‌ల నుంచి ఇటీవల సమాధానం వచ్చింది. ‘‘కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం రాష్ట్రం ఇచ్చే మ్యాచింగ్‌ గ్యాంట్‌ను ఓడీ రూపంలో అప్పుగా ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు. ఓడీ అప్పుతో లింకు పెట్టకుండా ఖాతాలు తెరిచే విషయమై స్థానిక ట్రెజరీ బ్రాంచులను సంప్రదించవచ్చు’’ అని సూటిగా చెప్పాయి.


100 ఖాతాలకు బదులు.. 5

కేంద్ర పథకాలు దాదాపు వంద వరకు ఉన్నాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వంద బ్యాంకు ఖాతాలు తెరవాలి. అలా తెరిస్తే... నిధులు మళ్లించడం అసాధ్యం కాబట్టి ఇక్కడా కొంత తెలివి ప్రదర్శించారు. ఆ 100 పథకాలను 5 కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకొచ్చి..5 ఖాతాలు తెరవాలని నిర్ణయించారు. ఆ మేరకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ వంద పథకాలను సాధారణంగా ప్రభుత్వంలోని 32 శాఖలు, 180కి పైగా ఉన్న హెచ్‌ఓడీలు నిర్వహిస్తాయి. అలాంటిది కేవలం 5 కార్పొరేషన్ల పరిధిలోకి తేవడం వెనుక అంతరార్థం... నిధుల మళ్లింపు కోసమే అని నిపుణులు చెబుతున్నారు.


ఇంకో రూ.1000 కోట్ల అప్పు

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం ఆర్బీఐ వద్ద జరిగిన బాండ్ల వేలంలో పాల్గొని ఈ అప్పు సంపాదించింది. వెరసి... సెప్టెంబరు 7 నుంచి 28వ తేదీ వరకు మొత్తం రూ.5000 కోట్లు అప్పుగా తెచ్చింది. అప్పుల్లో ఇది కొత్త రికార్డు. కేంద్రం 9 నెలలకు ఇచ్చిన రూ.20,750 కోట్ల అప్పును రాష్ట్రం 5 నెలల్లోనే వాడేసింది. అదనపు అప్పు కోసం కేంద్రం చుట్టూ తిరిగి బతిమలాడటంతో... సెప్టెంబరు 3న రూ.10,750 కోట్ల రుణానికి అనుమతించింది. ఇందులో ఇప్పటికే రూ.5,000 కోట్లు వాడేశారు. అంటే... కేవలం మూడు వారాలకే సగం వాడేశారు. ఇంకో రూ.5750 కోట్లు మాత్రమే రుణ పరిమితి మిగిలి ఉంది. అక్టోబరులో అమలు చేస్తామంటున్న ఆసరా పథకానికి కూడా ఈ అప్పులు సరిపోవు. కాబట్టి, మరోసారి అప్పులు కావాలంటూ కేంద్రం చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - 2021-09-29T07:59:57+05:30 IST