నష్టాల్లో.. సర్కారు వారి చేపల వ్యాపారం

ABN , First Publish Date - 2022-05-13T10:09:37+05:30 IST

సర్కారు వారి చేపలు, రొయ్యల వ్యాపారం సక్రమంగా సాగడం లేదు. ‘ఫిష్‌ ఆంధ్ర-ఫిట్‌ ఆంధ్రా’ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్వా హబ్‌లు, ఫిష్‌ మార్ట్‌లు మూతపడే స్థితికొచ్చాయి.

నష్టాల్లో.. సర్కారు వారి చేపల వ్యాపారం

  • చేపల శీతలీకరణకు కరెంట్‌ బిల్లుల దెబ్బ
  • జర్మన్‌ పరికరాల్లో ధరల మాయజాలం
  • మూసివేత దిశగా రిటైల్‌ అవుట్‌లెట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): సర్కారు వారి చేపలు, రొయ్యల వ్యాపారం సక్రమంగా సాగడం లేదు. ‘ఫిష్‌ ఆంధ్ర-ఫిట్‌ ఆంధ్రా’ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్వా హబ్‌లు, ఫిష్‌ మార్ట్‌లు మూతపడే స్థితికొచ్చాయి. రాష్ట్రంలో 14 వేల రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకూ ఏర్పాటు చేసినవి సుమారు 300 మాత్రమే. వాటిలోనూ సగానికిపైగా సక్రమంగా నడవడం లేదని చెబుతున్నారు. ఇసుక, మద్యం మాదిరిగా.. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా విక్రయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఫిష్‌ మార్ట్‌ల పేరుతో చేపలు, రొయ్యల వ్యాపారం చేపట్టింది. ఆక్వా ఉత్పత్తులకు స్థానికంగా మార్కెట్‌ కల్పించి, స్థానికంగా ఆహార వినియోగాన్ని పెంచాలనే ఉద్ధేశంతో.. జనానికి తాజా చేపలు, రొయ్యల రుచి చూపించడానికి కొన్ని పట్టణాల్లో రిటైల్‌ అవుట్‌లెట్లను తెరిపించింది. ఆక్వా హబ్‌ నుంచి కిలో చేపలు రూ.130కు తెచ్చి, రిటైల్‌ అవుట్‌లెట్‌లో రూ.150-160 చొప్పున అమ్మాల్సి ఉంటుంది. రవాణా ఖర్చులను అవుట్‌లెట్‌ నడిపేవారే భరించాలి.


అమ్ముడుపోని సరుకును కూలింగ్‌లో ఉంచాలి. చేపలు, రొయ్యలు తాజాగా ఉండకపోతే.. కొనుగోళ్లు సాగవు. వీటిని తాజాగా ఉంచడానికి శీతలీకరణ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ కోల్డ్‌స్టోరేజీలు, ఫ్రిజ్‌లకు విద్యుత్‌ కోతలతో తిప్పలొచ్చాయి. జనరేటర్లపై కోల్డ్‌స్టోరేజీలు నడపాలంటే  రోజుకు రెండు మూడు గంటలుజనరేటర్లు వాడినా.. నెలకు రూ.200 అదనంగా ఖర్చవుతోంది. విద్యుత్‌ చార్జీల పెరుగుదలతో నెలకు రూ.ఐదారు వేల బిల్లు వస్తోంది. అంత బిల్లు చెల్లించడం భారంగా ఉంటోందని గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వ్యాపారులు చెప్పారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోని ఒక రిటైల్‌ అవుట్‌లెట్‌కు కరెంటు బిల్లు బకాయి పడటంతో మూసేసుకోవల్సి వచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మితే లాభం పెద్దగా లేక, ఖర్చులు కూడా రాక, దుకాణాల అద్దెలు కట్టలేక.. అవుట్‌లెట్‌ నిర్వాహకులు సతమతమౌతున్నారు. ఈ సమస్యలతో రిటైల్‌ అవుట్‌లెట్ల నిర్వహణ కష్టంగా మారి, వీటిని మూసేసే పరిస్థితి వస్తోందని చెబుతున్నారు.


మత్స్యశాఖకు కమీషన్లు.. 

రిటైల్‌ ఫిష్‌ అవుట్‌లెట్ల నిర్వహణ పెద్ద ఉపాధి కల్పన కేంద్రంగా ప్రభుత్వం ప్రచారం చేసింది. దీంతో చేపలు, రొయ్యల వ్యాపారంపై ఆసక్తి ఉన్న అనేక మంది యువకులు అవుట్‌లెట్లకు అనుమతుల కోసం మత్స్యశాఖను సంప్రదించారు. ఆక్వా రిటైల్‌ అవుట్‌లెట్‌కు బ్యాంకులు రూ.3లక్షల వరకు రుణం ఇస్తున్నాయి. ఇందులో 30ు రాయితీ ఉంది. రూ.50వేలు లబ్ధిదారుడు మార్జిన్‌మనీగా పెట్టుకోవాలి. బ్యాంకు రుణాన్ని ఆక్వా హబ్‌లకు ఇస్తే.. అవుట్‌లెట్‌ ఏర్పాటుకు రూ.లక్ష విలువైన జర్మన్‌ పరికరాలను సరఫరా చేస్తున్నారు. అయితే రూ.లక్ష విలువైనదని చెప్తున్న ఈ మెటీరియల్‌ బహిరంగ మార్కెట్‌లో సగం కంటే తక్కువకే లభిస్తాయని చెప్తున్నారు. అయినా హబ్‌ నుంచే ఈ పరికరాలను తీసుకోవాలని అధికారులు అంటున్నారని అవుట్‌లెట్ల నిర్వాహకులు చెప్తున్నారు. కాగా, రైతులకు కిలోకు రూ.120 కూడా చెల్లించడం లేదని పశ్చిమగోదావరి జిల్లాలోని చేపల చెరువుల నిర్వాహకుడు చెప్పారు. రైతుకు, హబ్‌కు మధ్య ఉన్న ధర వ్యత్యాసాన్ని మత్స్యశాఖ కమీషన్‌గా పొందుతున్నట్లు తెలుస్తోంది. 


స్పందన కరువై.. లక్ష్యం కుదింపు 

రాష్ట్రంలో 70ఆక్వా హబ్‌లు, 14వేల రిటైల్‌ అవుట్‌లెట్లు ఏర్పాటు చేయాలని మత్స్యశాఖకు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ట్రయల్‌ రన్‌గా ప్రస్తుతం 19 హబ్‌ల పరిధిలో 300 రిటైల్‌ అవుట్‌లెట్స్‌ మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇందులోనూ సగానికిపైగా సక్రమంగా నడవడం లేదని చెప్తున్నారు. దీంతో రిటైల్‌ అవుట్‌లెట్ల ఏర్పాటు కోసం మత్స్యశాఖ ఆన్‌లైన్‌-ఆ్‌ఫలైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. అయినా ఆశించిన స్పందన లేకపోవడంతో రిటైల్‌ అవుట్‌లెట్ల సంఖ్యను ఏడు వేలకు తగ్గించాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించిందని సమాచారం. 

Read more