Abn logo
Sep 26 2021 @ 02:06AM

చమురు కంపెనీలకు సర్కారు ‘మంట’

 • సీఎఫ్‌వో చార్జీల పేరుతో భారీగా భారం
 • రుసుము వసూలు పద్ధతిలో మార్పు
 • వేల రెట్లలో పెరిగిన అదనపు మోత
 • ఏడాదికి రూ.2500 కోట్ల వసూలు లక్ష్యం
 • 5 పైసల నుంచి రూపాయి వరకు ప్రతిపాదన
 • చివరికి.. రూపాయికే ఫిక్స్‌ అయిన ప్రభుత్వం
 • ఓఎన్జీసీపైనే రూ.790 కోట్ల అదనపు భారం
 • భరించలేమంటున్న చమురు కంపెనీలు
 • సీఎం జగన్‌తో ఓఎన్జీసీ చైర్మన్‌ సమావేశం
 • సీఎ్‌ఫవో చార్జీలు తగ్గించాలని విన్నపం
 • అయినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
 • ఉత్పత్తి తగ్గించే యోచనలో సంస్థలు


సర్కారు వారి ‘బాదుడు’ కార్యక్రమం చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీసే కంపెనీలకూ విస్తరించింది. ‘బాబోయ్‌ భరించలేం’ అని ఆయా సంస్థలు నెత్తీనోరు బాదుకునే స్థాయిలో భారం మోపింది. దేశంలో మరే తీర రాష్ట్రంలోనూ లేని విధంగా ‘కన్సంట్‌ ఫీజ్‌ ఫర్‌ ఆపరేషన్‌’ (సీఎ్‌ఫవో) చార్జీల మోత మోగించింది. ఒకట్లూ, పదులూ, వందలూ కాదు... ఒకేసారి వేలరెట్లలో రుసుము పెంచింది.


(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

సముద్రగర్భంలోని సహజ వాయువు, గ్యాస్‌ నిక్షేపాలన్నీ కేంద్రం పరిధిలోకే వస్తాయి. ఆయా క్షేత్రాలను కేంద్రమే కేటాయిస్తుంది. గ్యాస్‌, చమురు నిక్షేపాల కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రకరకాల పన్నుల రూపంలో భారీ ఆదాయం లభిస్తుంది. చమురు వెలికితీత, శుద్ధి సమయంలో కాలుష్యం వెలువడుతుంది కాబట్టి... వాటిని ‘రెడ్‌ కేటగిరీ’లో చేర్చారు. దీనికి సంబంధించి మొత్తం టర్నోవర్‌పై పన్ను వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మార్చేశారు. ఉత్పత్తి అయ్యే ప్రతి స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌ చమురు, గ్యాస్‌పై రూపాయి చొప్పున సీఎ్‌ఫవో రుసుము వసూలు చేయాలని నిర్ణయించారు. కాలుష్య నియంత్రణ చట్టం కింద రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ దీనిని వసూలు చేస్తుంది. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉత్తర్వులు జారీ అయ్యాయి.


భరించలేమంటూ... 

చమురు, గ్యాస్‌ వెలికితీత కంపెనీల నుంచి సీఎ్‌ఫవో చార్జీల రూపంలో ఏడాదికి దాదాపు రూ.2500 కోట్లు వసూలు చేయాలని జగన్‌ సర్కారు నిర్ణయించుకుంది. ఉదాహరణకు... ఒక ప్రైవేటు సంస్థ పాత పద్ధతిలో తూర్పు గోదావరి జిల్లాలో తాము చేసిన ఉత్పత్తికి రూ.60 లక్షల పన్ను కడుతోంది. కొత్త చార్జీల ప్రకారం అది రూ.1100 కోట్లకు చేరింది. ఇక... ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ రూ.13 కోట్లు కట్టేది. అది ఇప్పుడు రూ.790 కోట్లకు చేరుతోంది. దీంతో... చమురు, గ్యాస్‌ వెలికతీత సంస్థలు షాక్‌కు గురయ్యాయి. ఒకేసారి వందలకోట్ల భారం మోపడంపై గగ్గోలు పెడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఈ స్థాయి రుసుములు లేవని చెబుతున్నాయి. 


పైసల నుంచి రూపాయికి...

కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఓఎన్జీసీ, రిలయెన్స్‌, ఆయిల్‌ ఇండియా, వేదాంత తదితర సంస్థలు గ్యాస్‌, చమురు నిక్షేపాలు వెలికితీస్తున్నాయి. ఒక స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌కు ఇంత చొప్పున సీఎ్‌ఫవో వసూలు చేస్తారు. ఆదాయం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... దీనిపైనా దృష్టి సారించింది. సీఎ్‌ఫవో రుసుమును ఎంత పెంచితే ఎంత ఆదాయం వస్తుందనే లెక్కలు తీసింది. మొత్తం నాలుగు కంపెనీలు రోజుకు 58.29 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల చమురు, గ్యాస్‌ నిక్షేపాలను వెలికి తీస్తున్నట్లు తేల్చింది. ఓఎ్‌ఫసీ రుసుము పెంపుపై తొలుత పలు రకాల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒక్కో స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌ ఉత్పత్తికి 5పైసలు విధిస్తే ఆదాయం రూ.106 కోట్లకు చేరుతుంది. అదే... పది పైసలు విధిస్తే రూ.212 కోట్లు వస్తాయి. కానీ... రూపాయి వరకు లెక్కలు కట్టింది. పైసల ప్రతిపాదనను పక్కనపెట్టి... రూపాయికి ఫిక్స్‌ అయిపోయింది. వెరసి.. ఒక్కో స్టాండర్డ్‌ క్యూబిక్‌  మీటర్‌కు వసూలు చేసే సీఎ్‌ఫవో రుసుమును ఒకేసారి రూపాయికి పెంచింది. దీనివల్ల రాష్ట్రానికి ఏటా రూ.2,127కోట్ల ఆదాయం వస్తుంది.


ఓఎన్జీసీపై ఎంత భారమో...

ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల సంగతి పక్కనపెడితే... ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీపైనా రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారం మోపింది. ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ఓఎన్జీసీపై రూ.790 కోట్లు అదనపు భారం పడనుంది. పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో మరో రూ.520 కోట్ల వరకు రాష్ట్రప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అంశంపై ఓఎన్జీసీ చైర్మన్‌ సుభాష్‌ కుమార్‌ నాలుగు రోజుల క్రితమే  సీఎం జగన్‌ను కలిశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ ఇప్పటికే కష్టాల్లో ఉందని, సీఎ్‌ఫవో రుసుమును ఆ స్థాయిలో విధిస్తే మరిన్ని ఇక్కట్లు తప్పవని చెప్పినట్లు తెలిసింది. సీఎ్‌ఫవో చార్జీలు అమలు చేస్తే తమకు ఏమేరకు నష్టం వస్తుందో వివరించారు. వాటిని తగ్గించాలని కోరారు. అయినప్పటికీ... ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక... ప్రైవేటు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని ఢిల్లీలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ విభాగానికి లేఖలు రాశాయి. అంత పెను భారం మోయడం కష్టమని రాష్ట్రప్రభుత్వానికి కూడా విజప్తి చేశాయి.


కంపెనీలు ఏం చేస్తాయి... 

దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సీఎ్‌ఫవో ఫీజుల భారం లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఒకేసారి మోత మోగించడంపై కంపెనీలు అసహనంగా ఉన్నాయి. తమ వినతులపై ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయాలన్నదానిపై తర్జన భర్జనలు పడుతున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే ఉత్పత్తిని తగ్గించాలని కూడా భావిస్తున్నట్లు  సమాచారం. ఇదే జరిగితే పారిశ్రామిక అవసరాలు, ఎరువుల ఉత్పత్తి, ఇతర రంగాలపైనా ప్రభావం పడుతుంది. అంతేకాదు... సీఎ్‌ఫవో భారం పెరిగితే, ఆ మేరకు ఆయా సంస్థలు ‘కార్పొరేట్‌ సామాజిక బాధ్యత’ (సీఎ్‌సఆర్‌) కింద చేపడుతున్న సేవా కార్యక్రమాలను కుదించుకునే అవకాశం కూడా ఉంది. ఈ చార్జీలపై న్యాయపోరాటం చేసే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఈ స్థాయిలో రుసుము పెంచడంపైనా కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు కంపెనీలను తమదైన శైలిలో దారికి తెచ్చుకునేందుకే ఈ కొరడా ఝళిపించారా? అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది.