రూ. 20వేల లోపు అగ్రిగోల్డ్‌ డిపాజిట్లను చెల్లించేందుకు అనుమతించండి

ABN , First Publish Date - 2020-10-01T08:52:50+05:30 IST

అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులకు బకాయిలు చెల్లించేందుకు అనుమతించాలని ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం తెలంగాణ హైకోర్టును బుధవారం కోరారు. అగ్రిగోల్డ్‌ గ్రూపు సంస్థల కుంభకోణంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ చేయాలన్నారు...

రూ. 20వేల లోపు అగ్రిగోల్డ్‌ డిపాజిట్లను చెల్లించేందుకు అనుమతించండి

  • తెలంగాణ హైకోర్టును కోరిన ఏపీ


హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులకు బకాయిలు చెల్లించేందుకు అనుమతించాలని ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం తెలంగాణ  హైకోర్టును బుధవారం కోరారు. అగ్రిగోల్డ్‌ గ్రూపు సంస్థల కుంభకోణంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ చేయాలన్నారు. అగ్రిగోల్డ్‌ స్థిరాస్థులను వేలం ద్వారా విక్రయించేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతించిందని తెలిపారు. ఆ మేరకు కోర్టులోనే ఆస్తులను వేలం వేశారన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల్లో సుమారు 62 శాతం మంది ఏపీకి చెందినవారేనని కోర్టుకు వివరించారు. వీరిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో రూ.1150కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధుల నుంచి రూ.263.99 కోట్లు మంజూరు చేసిందని, రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి కోర్టు అనుమతితో తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సమక్షంలో 232.33 కోట్లు (సుమారు 94శాతం) చెల్లించారని పేర్కొన్నారు. రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి చెల్లించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఏజీ  కోరారు. ఏపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిధులు కేటాయించినందున మిగిలిన ప్రతివాదుల వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం వ్యాజ్యాలను భౌతిక కోర్టుల్లో ప్రత్యక్షంగా విచారిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను నవంబరు 4కి వాయిదా వేసింది. 


Updated Date - 2020-10-01T08:52:50+05:30 IST