‘ఎంసెట్‌’లో తప్పు రాసినా ఒప్పే!

ABN , First Publish Date - 2020-10-18T08:24:35+05:30 IST

‘ఎంసెట్‌’లో తప్పు రాసినా ఒప్పే!

‘ఎంసెట్‌’లో తప్పు రాసినా ఒప్పే!

23 ప్రశ్నలకు ఏ ఆప్షన్‌ పెట్టినా మార్కులిచ్చారు


అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): గత నెల 17 నుంచి 25 వరకు జరిగిన ఏపీ ఎంసెట్‌ అనంతరం,  విడుదలైన ప్రాథమిక కీపై అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా గణితం నుంచి ఎక్కువ అభ్యంతరాలొచ్చాయి. వాటిని సబ్జెక్టు నిపుణుల కమిటీతో పరిశీలన చేయించాలి. వాటిల్లో వేటిని పరిగణలోకి తీసుకున్నారు, వేటిని తిరస్కరించారనేది తేల్చాలి. ఇందుకు సంబంధించిన సిఫారసును రెండో సెట్‌ కమిటీ సమావేశపు అజెండాలో పెట్టి ఆమోదం తీసుకోవడం తప్పనిసరి. ఫలితాల విడుదలకు ముందు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ నిర్వాహకులు లైట్‌ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ విభాగంలో 17 ప్రశ్నలకు, అగ్రికల్చర్‌ విభాగంలో 6 ప్రశ్నలకు (మొత్తం 23 ప్రశ్నలు) సంబంధించిన నాలుగు ఆన్సర్‌లలో ఏ ఆప్షన్‌ ఇచ్చినా (ఆల్‌ ఆప్షన్స్‌) మార్కులు వేయడం గమనార్హం. ఫలితంగా మెరిట్‌ అభ్యర్థులకు నష్టం జరిగిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ నిపుణుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుందా? లేదా, ఎంసెట్‌ కన్వీనరే తీసుకున్నారో స్పష్టత లేదు. జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో జరిగిన ఎంసెట్‌ ఫలితాలు ఈ నెల 10న విడుదలైన విషయం తెలిసిందే. ఈ విషయమై ఎంసెట్‌ కన్వీనర్‌ వి.రవీంద్రను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఒకే ప్రశ్నకు మల్టిపుల్‌ ఆన్సర్లు ఉన్నట్లు గుర్తించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదేమీ కొత్త విషయం కాదని, గతంలోనూ ఈ పద్ధతిని అనుసరించారని తెలిపారు. 

Updated Date - 2020-10-18T08:24:35+05:30 IST