మూడు రోజుల్లో అన్ని వివరాలతో ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తా: ఆనం

ABN , First Publish Date - 2020-06-04T23:24:35+05:30 IST

మరోసారి అధికారులపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో 9, రాష్ట్రంలో 174 నియోజకవర్గాలే ఉన్నాయా? అని ప్రశ్నించారు.

మూడు రోజుల్లో అన్ని వివరాలతో ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తా: ఆనం

నెల్లూరు: మరోసారి అధికారులపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో 9, రాష్ట్రంలో 174 నియోజకవర్గాలే ఉన్నాయా? అని ప్రశ్నించారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని అధికారులు మర్చిపోయారా అని ఆనం నిలదీశారు. రాపూర్‌లో రివ్యూ మీటింగ్‌కు చివరి నిమిషంలో డీఆర్‌డీఏ పీడీ ఎగ్గొట్టారని ఆరోపించారు. మంత్రులకు గెస్ట్‌హౌస్‌లో టీ, టిఫిన్‌లు ఏర్పాటు చేయాలన్నారని, టీ,‌ టిఫిన్‌లు మోసేందుకే ఉన్నతాధికారులు ఉన్నారా? అని ఆయన మరోసారి ప్రశ్నించారు. వెంకటగిరికి తాగునీటిపై ఏ అధికారి కూడా సమాధానం ఇవ్వడం లేదని, మూడు రోజుల్లో అన్ని వివరాలతో ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. 


బుధవారం కూడా అధికారులపై ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారుచేయలేదని తప్పుబట్టారు. జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని, ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ చెప్పినా అధికారులు వినడంలేదని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న తీరు ఎప్పుడూ చూడలేదని వాపోయారు. 23 జిల్లాలకు మంత్రిగా చేసిన తనకు, ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి సిద్ధమని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు.

Updated Date - 2020-06-04T23:24:35+05:30 IST