చర్చలపై సర్కారు దాగుడుమూతలు

ABN , First Publish Date - 2022-04-04T09:28:18+05:30 IST

సీపీఎ్‌సపై ఉద్యోగ సంఘాలతో చర్చల విషయంలో ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది.

చర్చలపై సర్కారు దాగుడుమూతలు

1వ తేదీన సీపీఎస్‌ సంఘాలకు ఆహ్వానం

తాజాగా లేఖలో వాటి పేర్లు మాయం

ప్రభుత్వ వైఖరిపై ఆయా సంఘాలు భగ్గు 

7న జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం  


అమరావతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): సీపీఎ్‌సపై ఉద్యోగ సంఘాలతో చర్చల విషయంలో ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశానికి సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలను విస్మరించడం, ఆ తర్వాత పిలవడం, మళ్లీ లేఖలో వాటి పేర్లను తొలగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 7వ తేదీ జరిగే సమావేశానికి రావాలని ఆంధ్రప్రదేశ్‌ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎ్‌సయూఎస్‌), ఆంధ్రప్రదేశ్‌ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏపీసీపీఈఏ)లను ఆహ్వానిస్తూ ఈ నెల 1వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే తేదీతో ఉన్న లేఖను జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని సంఘాలకు పంపిన సర్కారు.. ఆ లేఖలో సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలకు చోటు కల్పించలేదు. దీనిపై సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఒకేరోజు ఆహానిస్తూ ఒక లేఖ, ఆహ్వానం లేకుండా మరో లేఖను ప్రభుత్వం ఎలా తయారు చేసిందని ప్రశ్నిస్తున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉందంటూ, తమకు ఆహ్వానం లేని లేఖ రెండు రోజుల తర్వాత ఆదివారం వెలుగులోకి రావడంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. తొలుత సీపీఎ్‌సపై ఈ నెల 4వ తేదీన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాలకు ఆర్థిక శాఖ అధికారులు గత నెల 31వ తేదీన ఆహ్వానం పంపారు. ఏపీసీపీఎ్‌సయూఎస్‌, ఏపీసీపీఈఏలను మాత్రం ఆహ్వానించలేదు. దీంతో సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై సీఎ్‌సకు లేఖ రాశాయి. సీపీఎస్‌ రద్దు అజెండాగా పోరాడుతున్నామని, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘చర్చలు సరే.. పిలుపేదీ’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత ప్రభుత్వం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని 7వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆ సమావేశానికి సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలను కూడా ఆహ్వానించింది. తాజాగా లేఖలో ఆ సంఘాల పేర్లు మాయమయ్యాయి. ఇంత చిత్రమైన సమావేశం రాష్ట్ర చరిత్రలోనే జరగలేదని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎం దాస్‌ విమర్శించారు. చర్చలు లేకుండా సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-04-04T09:28:18+05:30 IST