వారం రోజులు తిరగకముందే.. తన నిర్ణయాన్ని మార్చుకున్న ఏపీ ప్రభుత్వం!

ABN , First Publish Date - 2020-07-02T14:28:48+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా..

వారం రోజులు తిరగకముందే.. తన నిర్ణయాన్ని మార్చుకున్న ఏపీ ప్రభుత్వం!

సొంతిల్లు ఇక కలే..

పేదల గూడు చెదిరింది 

3,840 లబ్ధిదారుల ఇళ్లు రద్దు

సుమారు రూ.28 కోట్లు వృథా

బేస్‌మెంట్‌ లోపు ఉంటే నిలిపివేత

వారంలోనే ప్రభుత్వ నిర్ణయం మార్పు


నరసరావుపేట(గుంటూరు): పేదల గృహాల నిర్మాణంలో ప్రభుత్వం రోజుకో నిర్ణయం తీసుకుంటోంది. జిల్లాలో గత ప్రభుత్వం చేపట్టిన గృహాలను ఇటీవల పేదలకు కేటాయించింది. వారం రోజులు తిరగకముందే ఇళ్ళ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పెద్దఎత్తున నిర్మాణం చేపట్టిన గృహాలను రద్దుచేస్తూ బుధవారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బేస్‌మెంట్‌ లోపువున్న గృహాల నిర్మాణాన్ని నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. జిల్లాలో నిర్మాణం చేపట్టిన 3,840 గృహాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు వెచ్చించిన నిర్మాణ వ్యయం రూ. 28 కోట్లు వృథా అయినట్లే.


అందరికీ ఇళ్ళ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాలోని గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహా పురపాలక సంఘాల పరిధిలో 32,192 గృహాల నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. వీటిలో దాదాపు 80 శాతం గృహాల నిర్మాణం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. గత నవంబర్‌లో 4వేల గృహాల నిర్మాణం వివిధ దశలలో నిలిచిపోవడంతో వీటికి రివర్స్‌ టెండర్‌ నిర్వహించిన విషయం విదితమే. నిర్మాణం చేపట్టిన మొత్తం గృహాల్లో 3840 ఇళ్ళను రద్దు చేయగా ఇంకా 28,352 గృహాలను ఈ నెల 8న లబ్ధిదారులకు పంపిణీచేసేందుకు పురపాలక సంఘాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


రద్దు చేసిన గృహాలు బెస్‌మెంట్‌ లెవల్‌ కన్నా తక్కువ నిర్మాణం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈస్థాయిలో నిర్మాణానికి రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఒక్కొక్క ఇంటికి వ్యయం కాగా దీని ప్రకారం సుమారు రూ.28 కోట్లు ప్రభుత్వ నిర్ణయంతో వృథా అయినట్టు అంచనాగా ఉంది. ఇప్పటివరకు నిర్మించిన వాటిని తొలగించాలన్నా ఇంకా భారీగానే వ్యయమవుతుంది. ఇళ్ళను రద్దుచేయడంలో సదరు లబ్ధి దారులకు ఇంటికోసం స్థలం కేటాయించాల్సి వుంది. పూర్తయిన గృహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. వీటికి కనీస వసతులు సమకూరలేదు.


ఏడాదిగా ఈ పనులకు నోచుకోలేదు. ఇందుకు రూ.185 కోట్లు వ్యయం అవుతుందని, నిధులు విడుదలచేయాలని ఏపీ టిడ్కో ప్రతిపాదనలు పంపినా ఎటువంటి కదలిక లేదు. అత్యధికంగా పిడుగురాళ్ళ మునిసిపాల్టీలో 816 గృహాలను ప్రభుత్వం రద్దు చేసింది. అపార్ట్‌మెంట్‌ల తరహాలో నిర్మించిన గృహాలను పంపిణీ చేసినా వసతులు కల్పించే వరకు వాటిలో నివాసం ఉండే పరిస్ధితి లేదు. రద్దుచేసినగృహాల లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని బాధితులు కోరుతున్నారు. 



Updated Date - 2020-07-02T14:28:48+05:30 IST