ఏపీలో మరో ఉద్యమం...?

ABN , First Publish Date - 2021-09-14T02:31:44+05:30 IST

ఏపీలో మరో ఉద్యమం...?

ఏపీలో మరో ఉద్యమం...?

ఏపీలో ప్రభుత్వం మారినప్పటినుంచీ రాజధాని అమరావతి ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కౌలు రైతులూ కష్టాల పాలవుతున్నారు. కౌలు డబ్బులు ఖాతాల్లో వేయడంపై జగన్‌ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో, రైతులు తీవ్రమయిన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సహనం నశించిన రైతులు.. హైకోర్టు మెట్లెక్కడంతో కౌలు చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అయితే, నేటికీ చాలామందికి కౌలు చెల్లించలేదు. దీంతో, వారంతా మరోసారి ఉద్యమబాట పడుతున్నారు.


రాజధాని రైతులు తమకు రావాల్సిన కౌలు సాధనకోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పట్టా భూములున్న రైతులకు తోడు.. దళిత అసైన్డ్ రైతులకు కూడా కౌలు పడకపోవడం పట్ల వారు మరింత మండిపడుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న అసైన్డ్, లంక భూముల్లో దాదాపు 80 నుండి 90 శాతం దళితులకు చెందిన భూములే ఉన్నాయి. అయితే నిన్నా మెన్నటి వరకూ రాయపూడి రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామాల్లో సిబిసిఐడి విచారణ జరుగుతుందని రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆ విచారణ తేలే వరకూ కౌలు వేయబోమని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే, ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ లేనే లేదని తేల్చేసింది. దీంతో, తమకు కౌలు పడుతుందని అసైన్డ్ రైతులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కౌలు డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కౌలు విషయంలో అనేకమార్లు కమిషనర్‌ను కలిసి విజ్జప్తి చేసిన దళిత అసైన్డ్ రైతులు.. తక్షణం  కౌలు చెల్లించకపోతే సీఆర్డీఏ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంత వరకూ డెబ్బై శాతం మందికి కౌలు పడలేదని, అసైన్డ్‌ రైతులకు అయితే, రూపాయి కూడా వెయ్యలేదని మండిపడ్డారు. దళితుల మీద జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందంటున్న బాధిత రైతులు.. తక్షణం కౌలు చెల్లించకపోతే సీఆర్డీఏ ఆఫీసుతో పాటు.. మంత్రి బొత్సా ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. 


రాజధాని రైతులకు ఏడేళ్లుగా ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది. అయితే, జగన్‌ సీఎం అయ్యాక.. ఏనాడూ సకాలంలో కౌలు ఇవ్వడం లేదని, ఎంక్వైరీల పేరుతో సవాలక్ష సమస్యలను సృష్టిస్తోందని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిదవ సంవత్సరం కౌలు ఆగస్టు నెలాఖరులో పడిందని, ఆరవ సంవత్సరం కౌలు ఆగస్టు రెండోవారం దాటాక, ఏడవ సంవత్సరం కౌలు జులై నెలలో పడిందని రైతులు చెబుతున్నారు. అయితే, అందరికీ కౌలు చెల్లిస్తామని న్యాయస్ధానానికి చెప్పిన జగన్‌ సర్కారు.. ఇప్పటికీ చాలామంది రైతుల అకౌంట్లలో జమచేయలేదంటున్నారు. ప్రతిసారీ కౌలు విషయంలో న్యాయస్ధానాలకు వెళ్తేనో, సీఆర్డీఏ ఆఫీసు ముట్టడికి సిద్ధమైతేనో తప్ప కౌలు దక్కడం లేదని చెబుతున్నారు. కరోనా మూలంగా నానా ఇబ్బందులు పడుతున్న తమకు.. ఇటు, కౌలు అందక అటు, అప్పు పుట్టక సతమతం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అటు భూమిలేని వారికి ఇస్తామన్న అమరావతి పింఛను సైతం నాలుగు నెలలుగా ఇవ్వడం లేదని తక్షణం జగన్ సర్కార్ ప్రకటించినట్టు 5వేల రూపాయల పింఛను ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అటు.. కౌలు ఇవ్వడం మరింత ఆలస్యం చేస్తే న్యాయస్ధానాలకు వెళ్ళి మరీ వడ్డీతో సహ కౌలు సాధిస్తామని, ఈసారి అసలుతో వదిలేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. 


రాజధాని అమరావతిలో కౌలు సకాలంలో చెల్లిస్తామని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటి వరకూ చెల్లించకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసైన్డ్ రైతులకే కాదు.. పట్టాలు ఉన్నవాళ్లకు కూడా మొండిచేయి చూపించడంపై మండిపడుతున్నారు. తక్షణం కౌలు చెల్లించకపోతే మరోసారి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయస్థానానికి ఇచ్చిన మాటపై గౌరవం ఉంచి రైతులకు కౌలు డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 


Updated Date - 2021-09-14T02:31:44+05:30 IST