Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘టెండర్‌’కు తూట్లు!

ఇక నెలనెలా ధరల సవరింపు

కాంట్రాక్టరు అడిగినంతా ఇవ్వడమే!

జగన్‌ సర్కారు ఆదేశం.. చమురు

ధరల తరహాలోనే నెలవారీ సమీక్ష

జల వనరుల శాఖ ఉత్తర్వులు


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టెండరు విధానానికి తూట్లు పొడిచే సరికొత్త ప్రణాళికను జగన్‌ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. నెలకోసారి ధరలను సవరించి.. కాంట్రాక్టర్లు అడిగినంత చెల్లించే పద్ధతిని తీసుకొచ్చింది. టెండరు పొందిన సంస్థ చేస్తున్న పనులపై నెలవారీ సమీక్షలు జరిపి బిల్లులు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇప్పటివరకూ ఉన్న అన్ని టెండరు విధానాలనూ రద్దు చేసింది. రోజువారీ చమురు ధరల సమీక్షల తరహాలో.. కాంట్రాక్టు పనులు, ముడిసరుకుల ధరలను నెలవారీగా సమీక్షలు నిర్వహించి.. సవరణలు చేయనుంది. పరికరాల ధరలు పెరిగితే కాంట్రాక్టు సంస్థకు ఆ మేరకు ధరల వ్యత్యాసాన్ని చెల్లిస్తుంది. ధరలు తగ్గితే తగ్గిస్తుంది. ప్రపంచ మార్కెట్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్రం చమురు ధరలను రోజువారీ సవరిస్తున్న సంగతి తెలిసిందే. ముడి చమురు ధర తగ్గితే ఆ మేరకు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా తగ్గిపోతాయని అప్పట్లో నమ్మబలికింది. కానీ ధరలు పైకి ఎగబాకడమే తప్ప దిగిరావడం లేదు. ఇప్పుడు జగన్‌ సర్కారు కూడా ఇదే పద్ధతి పాటించాలన్న నిర్ణయానికి వచ్చి.. ఉత్తర్వులు కూడా ఇచ్చేంది. కాంట్రాక్టు సంస్థలు కొనుగోలు చేస్తున్న ముడి సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని.. టెండరులో కోట్‌ చేసిన ధరకూ వాస్తవ ధరకూ భారీ వ్యత్యాసం ఉండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన జల వనరుల శాఖ.. కాంట్రాక్టు సంస్థ చేపడుతున్న పనులకు సంబంధించిన ముడిసరుకుల ధరలను నెలవారీ సమీక్షించి.. ఆ మేరకు వ్యత్యాసం చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. అంటే.. టెండరు పిలిచి ఒక ధరను నిర్ధారించినా.. అదే ధరను కొనసాగించాలన్న నిబంధనలేవీ ఇక ఉండవన్న మాట. ఇప్పటి దాకా ఏయేటికాయేడు స్టాండర్డ్‌ ఆఫ్‌ షెడ్యూల్డ్‌ రేట్‌ (ఎస్‌ఎ్‌సఆర్‌)ను సవరిస్తూ వస్తున్నారు. ఇక ఏ నెలకు ఆ నెల సవరణలు చేస్తూ అందుకు అనుగుణంగా చేసిన పనులకు బిల్లులను చెల్లించనున్నారు. ఈ విధానం అమల్లోకి తేవడానికి వీలుగా.. గతంలో జారీ చేసి అమలులో ఉన్న రోడ్లు, భవనాలు, జల వనరుల శాఖల ఉత్తర్వులన్నిటినీ రద్దు చేస్తూ గత నెల 30న జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి జీవో 62ని జారీ చేశారు. ఇది అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్‌ విభాగాలు, కార్పొరేషన్లకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ ఉత్తర్వు ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రాక్టు పనులకు వర్తించదని.. వాటికి పాత ఉత్తర్వులే అమలులో ఉంటాయని పేర్కొన్నారు. 


నెలనెలా ఈఎన్‌సీ కమిటీ సమీక్ష..

తాజా జీవో ప్రకారం.. కాంట్రాక్టు పనుల్లో అత్యంత కీలమైన ముడిసరుకులు సిమెంటు, ఇసుక, బట్యుమెన్‌, పెట్రోలియం, ఆయిల్‌, లూబ్రికేషన్లు, డీఐ పైపులు, పీవీసీ పైపులు, ఎంఎస్‌ పైపుల ఽధరలు, కార్మికుల వేతనాలను ప్రతినెలా ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫ ఆధ్వర్యంలోని కమిటీ సమీక్షిస్తుంది.  

రూ.40 లక్షలు దాటిన కాంట్రాక్టు పనులన్నిటినీ ఈ ఉత్తర్వు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం పాజిటివ్‌, నెగటివ్‌ విధానాలతో కూడిన ధరల నిర్ణాయక సూత్రీకరణనూ జల వనరుల శాఖ తెచ్చింది. ఇక...పెట్రోలియం ఉత్పత్తులు, బట్యుమెన్‌ ముడిసరుకుపై మాత్రం ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తారు. ధరల్లో వ్యత్యాసముంటే చెల్లిస్తారు.

Advertisement
Advertisement