ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో.. వచ్చిందెవరు?

ABN , First Publish Date - 2020-03-31T17:35:53+05:30 IST

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తికి..

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో.. వచ్చిందెవరు?

ఢిల్లీ వెళ్లిన వారిలో 22 మంది గుర్తింపు

అప్రమత్తమైన అధికారులు.. ఐసొలేషన్‌కు తరలింపు

విజయవాడ ల్యాబ్‌కు రక్త నమూనాలు

ఇంకెవరు ఉన్నారోనంటూ అధికారుల గాలింపు

క్వారంటైన్‌లో 2,705 మంది విదేశీ ప్రయాణికులు 

ఆచూకీ లేని 72 మంది కోసం రంగంలోకి సీఐడీ  

గాలింపు చేపట్టినట్టు ప్రకటించిన ఎస్పీ నవదీప్‌సింగ్‌  


ఏలూరు(పశ్చిమ గోదావరి): ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ కార్యక్రమానికి వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన వారితోపాటు ఇతర రాష్ర్టాల వారు ఉండటంతో దేశం మొత్తం అప్రమత్తమైంది. మన రాష్ట్రంలో గుంటూరు వాసి ఆ మత ప్రార్థనలో పాల్గొని వచ్చాడు. అతనికి కరోనా వైరస్‌ వ్యాధి ఉన్నట్లు గుర్తించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. అన్ని జిల్లాల్లోనూ ఆ ప్రార్థనలో పాల్గొన్న వారి వివరాలు సేకరించింది. గుంటూరుకు చెందిన వ్యక్తి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 15న నిజాముద్దీన్‌లో ఎక్కి వచ్చాడు. అదే ట్రైన్‌లో మన జిల్లాకు చెందిన వారు ప్రయాణించడంతో జిల్లా యంత్రాంగం వారిని గుర్తించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.


ఏలూరు తంగెళ్ళమూడి, పెన్షన్‌లైన్‌, పలు ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది, భీమవరం, ఆకివీడు, ద్వారకా తిరుమల, నల్లజర్ల, ఉండి, పెనుగొండ, ఇరగవరం ప్రాంతాలకు చెందిన 13 మంది ఢిల్లీలో 15, 16, 17 తేదీల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు. వేర్వేరుగా వెళ్లారు. ఏలూరుకు చెందిన ముగ్గురు ఆరో తేదీన వెళ్ళగా, మిగిలిన ఆరుగురు 13వ తేదీన వెళ్ళారు. జిల్లాలో మిగిలిన వారు 13నే వెళ్ళారు. వీరంతా వచ్చేటప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి 18వ తేదీన దిగారు. తొలుత 13 మందిని సోమవారం ఉదయం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో చేర్చగా, ఏలూరుకు చెందిన తొమ్మిది మందిని సోమవారం రాత్రి ఐసొలేషన్‌ వార్డులో చేర్పించారు.


ఢిల్లీ ప్రార్థనకు వెళ్లిన 22 మంది ఏలూరులోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. వీరి నుంచి రక్త నమూనాలను సేకరించి సోమవారం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీకి పంపించారు. మరో ఇద్దరి నమూనాలను సేకరించారు. వీరిలో ఒక వ్యక్తి బంగ్లాదేశ్‌ నుంచి రావడంతో అతడిని ఐసొలేషన్‌లో ఉంచారు. విదేశాల నుంచి వచ్చిన మరో మహిళను ఐసొలేషన్‌లో ఉంచారు. మొత్తం 24 మంది నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌ పరీక్షల నిమిత్తం పంపినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.సుబ్రహ్మణ్యేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంత వరకు ఆసుపత్రుల్లో మొత్తం 37 మంది శాంపిల్స్‌ను నిర్ధారణ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌ల కు పంపగా, 13 మందికి నెగిటివ్‌ వచ్చిందని, మరో 24 మందికి రిపోర్టు రావాల్సి వచ్చిందన వివరించారు. మొత్తం 3,911 మంది విదేశీ ప్రయాణికులను గుర్తించామని, వీరిలో నిర్ధేశిత 28 రోజుల గృహ నిర్బంధాన్ని 1,206 మంది పూర్తి చేశారని వివరించారు. మరో 2,705 మంది విదేశీ ప్రయాణికులు నిర్దేశిత 28 రోజుల గృహ నిర్బంధంలో వివిధ దశల్లో ఉన్నారన్నారు.  


సరిహద్దుల్లో క్వారంటైన్‌

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన జీలుగుమిల్లిలో స్థానిక గిరిజన గురుకుల బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలల్ని క్వారంటైన్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు సోమవారం అధికారులు పరిశీలించినట్లు తహసీల్దారు జి.ఎలీషా తెలిపారు. దీంతో సరిహద్దు ప్రాంతంలో వచ్చే ఇతర ప్రాంత వ్యక్తుల్ని గుర్తించి అధికారులు కరోనా వైరస్‌ ప్రబలకుండా పరిశీలనలో ఉంచే వీలు కల్పిస్తున్నారు.  


నారాయణపురంలో బంగ్లాదేశీయుడు

ఒక వ్యక్తి ఈ నెల 17న ఢిల్లీ నుంచి విజయవాడకు విమానంలోను.. అక్కడి నుంచి ఉంగుటూరు మండలం నారాయణపురం వరకు కారులో వచ్చి ఇక్కడ స్వీయ నిర్బంధంలోవున్న బంగ్లాదేశీయుడిని ఆరోగ్య సిబ్బంది సోమవారం గుర్తించారు. అతనిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వారి ఆచూకీ కోసం వెతుకుతున్న సమయం లో ఈ బంగ్లాదేశీయుడిని గుర్తించారు. 


ద్వారకా తిరుమలలో..

ద్వారకా తిరుమల మండలంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల ఐఏఎస్‌ కోచింగ్‌ నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. 14 రోజుల క్రితం 20 మంది కలిసి రైలులో వచ్చారు. అలా ప్రయాణించిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు గుర్తించడంతో క్వారంటైన్‌కు పంపించారు.


మాకు ఫోన్‌ చేయండి

విదేశాల నుంచి వచ్చిన వారిలో జిల్లాకు చెందిన 72 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో 24 మంది ఎన్‌ఆర్‌ఐలు జిల్లాకు వచ్చారని, వారి వివరాలు, ఫొటోలతో సహా సీఐడీ అధికారులు విడుదల చేశారు. వారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టిందని ఎస్పీ నవదీప్‌సింగ్‌ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను వెంటనే 83329 33865కుగాని, పోలీసు పీఆర్‌వో సెల్‌ నెంబరు 99595 10759 సమాచారం అందించాలని ఎస్పీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-31T17:35:53+05:30 IST