Chandrababu: లెక్క చూసుకో జగన్ రెడ్డి... నాలుగంటే నాలుగే!

ABN , First Publish Date - 2022-07-20T01:57:55+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి తూర్పుగోదావరి (East Godavari), పశ్చిమగోదావరి (West Godavari) జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో..

Chandrababu: లెక్క చూసుకో జగన్ రెడ్డి... నాలుగంటే నాలుగే!

అమరావతి (Amaravathi): ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి తూర్పుగోదావరి (East Godavari), పశ్చిమగోదావరి (West Godavari) జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎగువన కురిసిన వర్షానికి గోదావరి నది (Godavari River)కి వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరి పరివాహన ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, పంటలు నీట మునిగాయి. పలుచోట్ల వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.


ఇక లంక గ్రామాల్లో పరిస్థితి ఇంకా కుదుట పడలేదు. ప్రస్తుతం గోదావరి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.. ఇక వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు.. ఒక్కోకుటుంబానికి  2 వేల రూపాయల నగదు తాగునీరు, రేషన్, పశుగ్రాసం అందించాలని ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు. దీంతో వరద ప్రాంతాల్లో బాధితులకు అధికారులు వరద సాయం అందిస్తున్నారు.


అయితే 100 గ్రాముల కందిపప్పు.. 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 4 బంగాళాదుంపలు అందిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం విమర్శల పాలవుతోంది.  వరద బాధితులకు ఇదేనా సాయం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. 


ఇక వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. అల్లూరి జిల్లా చింతూరు మండలం చట్టిలో గోదావరి వరద సాయంపై మీడియాలో వచ్చిన కథనంపై చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘నాలుగంటే నాలుగే! ఇది జగన్ సర్కార్ వరద సాయం. నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు!.ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం....లెక్క చూసుకో జగన్ రెడ్డి... నాలుగంటే నాలుగే!.’’ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. 


మరోవైపు చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈనెల 21న కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటిస్తారు. 22వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంటలో వరద బాధితులను పరామర్శించనున్నారు. 


Updated Date - 2022-07-20T01:57:55+05:30 IST