అవసరం అయితే ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధం: APNGO

ABN , First Publish Date - 2021-10-07T18:46:23+05:30 IST

అమరావతి: ప్రభుత్వం తీరుపై ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవసరం అయితే ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధం: APNGO

అమరావతి: ప్రభుత్వం తీరుపై ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే ప్రత్యేక కార్యాచరణ మొదలు పెడతామని, అవసరం అయితే ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధమని ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఏపీ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సంఘాలు సమస్యల సాధనకై ఏకతాటిపైకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వడంలేదని, పెన్షన్లు అందని పరిస్థితి నెలకుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ ఏరియర్స్, పీఆర్సీ పెండింగ్‌లో ఉన్నాయని, మరోసారి సమస్యల పరిష్కారానికి సీఎస్‌తో చర్చిస్తామన్నారు. సానుకూల నిర్ణయం రాకపోతే ఉమ్మడి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు కరోనాతో మరణిస్తే, మట్టి ఖర్చులకు కూడా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఒకలాగా, ఖర్చులు మరోలా చేస్తున్నారని విమర్శించారు. 11వ పీఆర్సీ 39 నెలలుగా పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని బండి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-10-07T18:46:23+05:30 IST