ఏపీ పోలీసులకు.. వారి కుటుంబాలకు డీజీపీ బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2020-03-31T22:57:15+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బహిరంగ లేఖ రాశారు...

ఏపీ పోలీసులకు.. వారి కుటుంబాలకు డీజీపీ బహిరంగ లేఖ

అమరావతి :  ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రస్తావించారు. దేశం జాతీయ విపత్తు ఎదుర్కొంటున్న సమయంలో మొక్కవోని ధైర్యంతో పోలీసులు పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. అండగా ఉంటూ నైతిక స్థైర్యాన్ని నింపుతున్న పోలీసు కుటుంబాలకు మనస్ఫూర్తిగా డీజీపీ అభినందనలు తెలిపారు. పోలీసు కుటుంబ సభ్యులు పరోక్షంగా చేస్తున్న త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేనివని.. నిరంతరం పోలీసులు పని వత్తిడితో కుటుంబాలకు సరైన సమయాన్ని కేటాయించకపోయినా ఇంటి‌ బాధ్యతలు చూస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

 

నేను గర్వ పడుతున్నా..

చివరకు ప్రజలు నిత్యం పూజించే దేవాలయాలు మూతపడ్డాయి కానీ, పోలీస్ స్టేషన్లు మాత్రం ప్రజల మాన, ప్రాణ రక్షణే కర్తవ్యంగా భావించి అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులను చూసి నేను గర్వ పడుతున్నాను. కొద్ది రోజుల క్రితం మన కుటుంబ సభ్యులతో  వీడియో కాన్ఫరెన్స్‌లో నేను మీ అందరితో మాట్లాడటం జరిగింది. మీరంతా పోలీసు ఉద్యోగం చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పడంతో  నేను చాలా సంతోషించాను. అదే స్ఫూర్తితో మీ కుటుంబంలో ఒకడిగా కరోనా వైరస్ నుండి కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. నా మాటను మన్నించి ఎంత ప్రమాదకరమో తెలిసినప్పటికీ విధులకు హాజరు అవుతున్నారు. ప్రజలను ఇంట్లో ఉండమని రోడ్లపై ఒంటరిగా కాపలా కాస్తున్నారు. ఒకరి వస్తువులు ఒకరు తాకలేని పరిస్థితుల్లో కనీసం తాగడానికి మంచినీరు అందుబాటులో లేకున్నా.. పని చేస్తున్నారు. మీరంతా ఐకమత్యంతో పనిచేస్తున్న విధానం రక్షకభటుడు అని పేరు పెట్టుకున్నందుకు ప్రజలకు రక్షకులుగా నిలిచారు. వారిని కాపాడుకోవాలన్న తపన మీలో నేను గుర్తించాను.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఏమవుతుందో అని లెక్క చేయకుండా ఇంట్లోకి కూడా వెళ్లకుండా ఇంటి బయట విడిగా ఉంటున్నారు. రోడ్లపైనే విధులు నిర్వర్తిస్తున్న మీ  త్యాగాలను ప్రజలు, ప్రభుత్వం గుర్తించింది. ప్రతిరోజు యూనిఫామ్‌తో డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేవరకు మీ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఎంతో మదనపడుతున్నారో నేను ఊహించగలను. ప్రతిరోజు ఆ యూనిఫాంను పరిశుభ్రంగా చేస్తూ మళ్లీ డ్యూటీ పంపిస్తున్న పోలీస్ గృహిణులకు చేతులెత్తి నమస్కరించాలని ఉందిఅని డీజీపీ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.


నేను కూడా వస్తున్నా..!

డ్యూటీ చేసిన తండ్రి ఇంటికి వచ్చేసరికి దగ్గరకు‌ వచ్చే.. పిల్లలను కూడా దూరంగా ఉండమని చెప్పాల్సిన పరిస్థితి అయినా మా నాన్న పోలీస్ మీరంతా ఇంట్లో ఉండండి.. మా నాన్నకు సాయం చేయండి అని సామాజిక మాధ్యమాల్లో చిన్నారులు ప్రదర్శించిన తీరు చూస్తే ముచ్చటేసింది. మీరు సమయానికి భోజనం చేసినా, చేయకున్నా.. ఆకలితో‌ ఉన్న వారికి  అన్నం పెడుతున్న ఖాకీ దుస్తులలో నాకు అమ్మ కనిపిస్తుంది. చెప్పినా వినిపించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని మందలించే ఖాకీ దుస్తులలో తండ్రి కనిపిస్తున్నారు. నాకు తెలిసిన ఇంత పెద్ద ఆపదలో ఉన్న వారికి సేవ చేయటం వల్ల ఇమ్యూనిటీ పవర్ అమాంతం పెరుగుతుంది. త్వరలో మీతో నేను కూడా రోడ్లపైకి వచ్చి చెక్‌పోస్టు వద్ద నా వంతుగా మీతో కలిసి విధులు పంచుకోవాలి అనుకుంటున్నాను. మీరు సేవ అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి జాతీయ విపత్తు సమయంలో తన కొడుకును దేశ రక్షణకై మీరు చేస్తున్న త్యాగం వర్ణనాతీతం అనుకోని సంఘటన జరిగితే కుటుంబాలకు నష్టం అని తెలిసి కూడా మీరు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. మా వంతు ప్రయత్నంగా దాతల సహకారంతో లక్షల విలువైన మాస్క్‌లు, ఇతర పరికరాలు సిబ్బందికి అందజేయడం జరుగుతుంది’ అని డీజీపీ లేఖలో పేర్కొన్నారు. 


నేను మాటిస్తున్నా..

55 సంవత్సరాలు నిండిన వారు, కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నవారు ఈ రోడ్లపై డ్యూటీలు లేకుండా చూశాం. పోలీసు స్టేషన్‌లకే‌ వారిని  పరిమితం చేయాలని ఆదేశాలు ఇచ్చాం. 24గంటలూ భద్రత ఉండేలా వెల్ఫేర్ డెస్క్ పోలీస్ ఫ్యామిలీస్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్పీ గారి పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. కనిపించని కరోనా మహమ్మారిని  దేశాన్ని, రాష్ట్రాన్ని నుంచి తరిమికొట్టాలి. రాష్ట్రాన్ని కాపాడటం పోలీసుల కర్తవ్యం.. దానిని అర్థం చేసుకునే హృదయం మీకు ఉంది.రాబోయే రోజుల్లో దేశానికి బంగారు భవిష్యత్ ఇవ్వడానికి మేము మనసా.. వాచా మమేకం అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. కరోనా  మహమ్మారి అంతమై చిరునవ్వులతో తిరిగి సాధారణ జీవితం ప్రారంభించాలని, అందరనీ మేము కాపాడుకుంటామని మన పోలీసు కుటుంబాలు తరపున నేను మాటిస్తున్నాను. ప్రజలందరి కోసం మీరు మీ అందరి కోసం మేముఅని గౌతమ్ సవాంగ్ ఆ లేఖలో పేర్కొన్నారు.







Updated Date - 2020-03-31T22:57:15+05:30 IST