దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకం: నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2022-02-17T21:49:42+05:30 IST

దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొనియాడారు. బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన

దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకం: నితిన్ గడ్కరీ

విజయవాడ: దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొనియాడారు. బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన పలు జాతీయ రహదారులను సీఎం జగన్, గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ అభివృద్ధికి పోర్టులు చాల అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు ఇస్తామని, 22 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు ప్లాన్ చేస్తున్నామని, అందులో 6 ఏపీలో ఉంటాయని తెలిపారు. విశాఖ నుంచి రాయపూర్ 16,102 కోట్ల విలువైన రోడ్ నిర్మిస్తామని తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే 2024 లోపే పూర్తిచేస్తామని పేర్కొన్నారు. నాగ్‌పూర్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేను 2025 నాటికి పూర్తిచేస్తామని, హైదరాబాదు-విశాఖ ప్రాజెక్ట్‌ 2025 నాటికి పూర్తవుతుందని గడ్కరీ వివరించారు. 


‘‘బెంగళూరు-చెన్నై 17 వేల కోట్ల ప్రాజెక్టు ద్వారా.. ఏపీ, కర్నాటక, తమిళనాడు మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ హైవేపై గంటకు 160 కి.మీ. వేగంతో వెళ్లవచ్చు. గ్రీన్ హైడ్రోజన్ అందుబాటులోకి తెచ్చేందుకు చూస్తున్నాం. విజయవాడ తూర్పు రింగ్ రోడ్‌కు అనుమతిస్తున్నాం. 50 శాతం ల్యాండ్ పూలింగ్ ఖర్చు కేంద్రానిదే. ఏపీ సీఎం 20 ఆర్ఓబీలు అడిగారు, మేం 30 ఆర్ఓబీలకు అనుమతిస్తున్నాం’’ అని గడ్కరీ ప్రకటించారు.

Updated Date - 2022-02-17T21:49:42+05:30 IST