ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా.. హైదరాబాద్‌‌లో చికిత్స

ABN , First Publish Date - 2020-07-13T19:25:58+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది

ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా.. హైదరాబాద్‌‌లో చికిత్స

తిరుపతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. పేద, ధనిక, కుల, మత, సామాన్యుడు, సెలబ్రిటీ, రాజకీయ నేత ఇలాంటి బేధాలేమీ లేకుండా అందరికీ వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, వ్యక్తిగత సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు కరోనా సోకింది. శుక్రవారం నాడు ఆయన కరోనా రావడంతో తిరుపతిలో స్విమ్స్‌లో చేరారు. అంతకు మునుపు కడపలోని రిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. కార్డియో థోరాసిక్ సమస్యలు ఉండటంతో తిరుపతి స్విమ్స్‌కు రిమ్స్ వైద్యులు రెఫర్ చేశారు. ఆదివారం రాత్రి వరకు స్విమ్స్‌లో అంజద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు చికిత్స తీసుకున్నారు. 


తిరుపతి నుంచి హైదరాబాద్‌కు..

ఈ విషయమై స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ మీడియాతో మాట్లాడారు.అంజద్ బాషాకు కరోనా సోకింది. కోవిడ్ లక్షణాలు ఏవీ ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు లేవు. గతంలో ఆయనకు ఉన్న కార్డియో థోరాసిక్ సమస్య వల్ల కోవిడ్ సమస్య తీవ్రమవుతుందనే ముందు జాగ్రత్తగా స్విమ్స్‌లో చేరారు. కార్డియో థోరాసిక్ సమస్యలు కనిపించలేదని స్విమ్స్ వైద్యులు చెప్పటంతో, ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్‌తో చర్చించి ఆయన హైదరాబాద్‌కు వెళ్లారుఅని వెంగమ్మ మీడియాకు వెల్లడించారు. పాజిటివ్ అని తేలడంతో డిప్యూటీ సీఎం అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అంజద్ బాషా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.! మరోవైపు ఆయనతో గత పది రోజులుగా కలిసి తిరిగిన, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా టెస్ట్‌లు చేయించుకోవడానికి సిద్ధమయ్యారు.

Updated Date - 2020-07-13T19:25:58+05:30 IST