కేంద్రం కంటే ఏపీ అప్పులే తక్కువ

ABN , First Publish Date - 2022-07-29T09:45:47+05:30 IST

కేంద్రం కంటే ఏపీ అప్పులే తక్కువ

కేంద్రం కంటే  ఏపీ అప్పులే తక్కువ

శ్రీలంకతో పోలికే లేదు.. పన్నుల్లో కేంద్రం అన్యాయం

41శాతం వాటా అంటూ 32.56 శాతమే ఇస్తోంది: విజయసాయి

న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి) కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఆంధ్రప్రదేశ్‌ చేసిన అప్పులు చాలా తక్కువని వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. అప్పుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేంద్రంతో, పలు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుందన్నారు. శ్రీలంకతో ఎలాంటి పోలికా లేదని చెప్పారు. ఎగుమతులు, విదేశాల నుంచి డబ్బులు రావడం తగ్గిపోవడం, దిగుమతులు పెరిగిపోవడం, సేంద్రియ వ్యవసాయం వల్ల ఉత్పత్తి తగ్గడం, టూరిజం కూడా తగ్గిపోవడం.. వంటి కారణాలతో శ్రీలంకలో సంక్షోభం తలెత్తిందని.. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవని తెలిపారు. రాష్ట్రం అప్పును దేశ జీడీపీ, రాష్ట్ర జీడీపీతో పోల్చితే 2021-22లో కేంద్రం అప్పులు 57 శాతం, పంజాబ్‌-47 శాతం, రాజస్థాన్‌-39.8 శాతం, పశ్చిమ బెంగాల్‌-38.8 శాతం, కేరళ అప్పులు 38.3 శాతం ఉంటే.. ఏపీ 32.4శాతంతో 5వ స్థానంలో ఉందన్నారు. 2021-22లో కేంద్రం ఆర్థిక లోటు 6.9 శాతం కాగా, ఏపీ  లోటు 3.18 శాతమేనని తెలిపారు. మొత్తం ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వాటా  పంపిణీ చేస్తున్నామని కేంద్రం చెబుతున్నా.. వాస్తవానికి 32.56 శాతమే ఇస్తూ తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. పన్నులు పెంచకుండా సెస్‌, సర్‌చార్జీలు మాత్రం పెంచుకుంటూ పోతోందని విమర్శించారు. వాటిలోనూ వాటా ఇచ్చి ఉంటే.. ఏపీకి రూ.40-50 వేల కోట్లు వచ్చి ఉండేవన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశం అప్పులు 60 శాతం పెరిగాయని.. అదే సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం అప్పులు 117.42 శాతం పెరిగాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో 43 శాతం మాత్రమే పెరిగాయని వివరించారు. ప్రజలకు డీబీటీ స్కీం కింద రూ.1.62 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఐదుగురి కోసమే పనిచేసిందని, వైసీపీ సర్కారు ఐదు కోట్ల మంది ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తోందని విజయసాయి అన్నారు. ఏపీ శ్రీలంక కావడంకాదు గానీ.. చంద్రబాబు, ఆయన కుమారుడు రాజపక్సలా ఏ సింగపూర్‌కో పారిపోతారని ఎద్దేవా చేశారు. ఆదాయం పెంచుకోవడానికి జగన్‌ ప్రభుత్వం ఏం చేస్తోందన్న విలేకరుల పశ్నకు.. రామాయణమంతా విని రాముడు సీతకేం కావాలన్నట్లుగా మీ ప్రశ్న ఉందంటూ సమాధానం దాటవేశారు. అధికారిక లెక్కలను కాకిలెక్కలుగా మార్చడం మీడియాకు అలవాటైందంటూ ఎదురుదాడికి దిగారు.

Updated Date - 2022-07-29T09:45:47+05:30 IST