కొత్తగా 38

ABN , First Publish Date - 2020-04-03T09:07:54+05:30 IST

కొత్తగా 38

కొత్తగా 38

రాష్ట్రానికి ‘ఢిల్లీ’ దెబ్బ 

తాజా కేసులన్నింటికీ అక్కడే లింకు 

రాష్ట్రంలో 149కి చేరిన కరోనా బాధితులు 

నెల్లూరులో ఒక్కరోజే 21 మందికి పాజిటివ్‌ 

కృష్ణాలో 8, చిత్తూరులో 3, ప్రకాశంలో 2, 

కడపలో 3, ‘పశ్చిమ’లో ఒకరికి నిర్ధారణ 

విజయవాడలో ఒకే కుటుంబంలో ఏడుగురికి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రానికి ‘ఢిల్లీ’ దెబ్బ గట్టిగానే పడింది. తాజాగా ఇక్కడ నమోదవుతున్న కరోనా కేసులన్నీ దేశ రాజధానితో ముడిపడి ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మొత్తం 38 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 149కి పెరిగింది. రాష్ట్రంలో తొలి పాజిటివ్‌ కేసు నెల్లూరులో నమోదైన తర్వాత అక్కడ కేసుల సంఖ్య పెద్దగా పెరగలేదు. బుధవారం రాత్రి వరకూ ఈ జిల్లాలో 3 కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ గురువారం ఒక్కరోజే 21 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ బాధితుల సంఖ్య 24కి పెరిగింది. తాజాగా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారందరూ ఢిల్లీ సమావేశాలకు వెళ్లినవారే కావడం గమనార్హం. కృష్ణాజిల్లాలో గురువారం 8 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావ్యాప్తంగా కేసుల సంఖ్య 23కు చేరింది. జిల్లా నుంచి ఢిల్లీ సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటికే 10మందికి కరోనా సోకింది. తాజాగా నిర్ధారణ అయినవారిలో ఇద్దరు జగ్గయ్యపేట, ఒకరు నూజివీడు, మరొకరు చందర్లపాడు మండలానికి చెందినవారు కాగా, మిగిలినవారు విజయవాడ వాసులు. విజయవాడకు చెందిన ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా నిర్ధారణ అయింది. ఈ ఇంట్లో తండ్రి, కొడుకు ఢిల్లీ సమావేశాలకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లాలో గురువారం నమోదైన 2 కేసుల్లోనూ బాధితులు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చినవారే. ఈ జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 17కేసులు గుర్తించగా వారిలో ఒక్కరు తప్ప మిగిలిన వారందరికీ ఢిల్లీ లింక్‌ ఉన్నట్లు తేలింది. చిత్తూరు జిల్లాలో తాజాగా నమోదైన 3కేసులతో ఇక్కడ బాధితుల సంఖ్య 9కి చేరింది.


ఇదిలా ఉండగా, పంజాబ్‌లో చదువుకుంటున్న తిరుమల బాలాజీనగర్‌కు చెందిన యువకుడు(19) కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. కడప జిల్లాలో బుధవారం ఒక్కరోజే 15 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా గురువారం మరో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం మరొకరికి వైరస్‌ సోకింది. దీంతో ఈ జిల్లాలో బాధితుల సంఖ్య 15కు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తొలి పాజిటివ్‌ కేసుగా నమోదైన ఓ యువకుడి ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం కాకినాడ జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నారు. కాగా కర్నూలు జిల్లాలో 3 ప్రిజెంటివ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఇవి నిర్ధారణ కావాల్సి ఉంది.


ఏపీలో మరో రెండు ల్యాబ్‌లు 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతో గుంటూరు, కడపలో కూడా వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. గుంటూరులో గురువారం క్వాలిటీ టెస్టింగ్‌ పూర్తి చేయడంతో శుక్రవారం నుంచి నిర్ధారణ పరీక్షలు మొదలుపెడతారు. కడపలో శుక్రవారం క్వాలిటీ టెస్టింగ్‌ చేసి, శనివారం నుంచి పరీక్షలు ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా ల్యాబ్‌ల సామర్థ్యం 570కి పెరుగుతుంది.   


వార్డు వలంటీరుకు కరోనా

చిత్తూరు జిల్లా తిరుపతి నగరానికి చెందిన వార్డు వలంటీరుకు కరోనా నిర్ధారణ అయింది. గతనెల 20న ఢిల్లీ వెళ్లిన ఆయన నిజాముద్దీన్‌ మర్కజ్‌లో రెండు రోజులు గడిపారు. అక్కడి నుంచి వచ్చాక హోమ్‌ క్వారంటైన్‌లో ఉండకుండా బాధ్యత మరిచి బాహ్య సంచారం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు మార్చి 30న ఆయన్ను తిరుపతి రుయా ఆస్పత్రి క్వారంటైన్‌కు తరలించారు. 


మసీదులో గుజరాత్‌ బృందం! 

గుజరాత్‌లోని వడోదర నుంచి పదిమందితో కూడిన జమాత్‌ బృందం గతనెల 12న రైల్లో రేణిగుంట చేరుకుంది. అక్కడనుంచి మదనపల్లె వెళ్లి ఓ మసీదులో ఆరు రోజులు గడిపింది. తర్వాత 18న బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లె మసీదు చేరుకుని అక్కడే ఉంటున్నారు. మసీదు నిర్వాహకులు, కొందరు స్థానికులు ఈ బృందం గురించి అధికారులకు సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించారు. ఆలస్యంగా వీరి ఉనికిని గుర్తించిన గ్రామానికే చెందిన ముస్లింలు మసీదు నిర్వాహకులతో గొడవకు దిగా రు. వారే సమాచారమివ్వడంతో పోలీసు, వైద్య, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని వారిని, మసీదు నిర్వాహకులను క్వారంటైన్‌కు తరలించారు.


జిల్లాల వారీగా కేసుల వివరాలు...

గుంటూరు- 20

కడప- 18

ప్రకాశం -17

కృష్ణా -23

పశ్చిమ గోదావరి -15

విశాఖపట్నం -11

తూర్పు గోదావరి  -9

చిత్తూరు -9

నెల్లూరు -24

అనంతపురం -2

కర్నూలు -1

మొత్తం  -149

Updated Date - 2020-04-03T09:07:54+05:30 IST