ఏపీలో 4,400 కంపెనీల రద్దు!

ABN , First Publish Date - 2021-11-30T08:15:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో 4,400 కంపెనీలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) రద్దు చేయనుంది. వరుసగా రెండేళ్ల పాటు ఆస్తులు...

ఏపీలో 4,400 కంపెనీల రద్దు!

5,000 మంది డైరెక్టర్లపై వేటు.. రిటర్న్‌లు దాఖలు చేయని కంపెనీలకు ఆర్‌ఓసీ నోటీసులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌లో 4,400 కంపెనీలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) రద్దు చేయనుంది. వరుసగా రెండేళ్ల పాటు ఆస్తులు, అప్పుల పట్టిక, వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయని కంపెనీలతో పాటు  కంపెనీలను నమోదు చేసి 180 రోజుల్లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించని వాటిని ఆర్‌ఓసీ రద్దు చేస్తోంది. 2018-19, 2019-20 కాలానికి బ్యాలెన్స్‌ షీట్లు, రిటర్న్‌లు దాఖలు చేయని కంపెనీలకు నోటీసులు ఇచ్చి 30 రోజుల గడువు ఇస్తున్నామని, గడువు లోపు వీటిని దాఖలు చేయని కంపెనీలను రద్దు చేస్తామని ఆర్‌ఓసీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2,436 కంపెనీలు ఈ విధంగా వరుసగా రెండేళ్ల పాటు ఆస్తులు, అప్పుల పట్టిక, వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయలేదు. ‘స్ట్రయిక్‌ ఆఫ్‌ డ్రైవ్‌’ పేరుతో 2017 నుంచి రిటర్న్‌లు, వార్షిక నివేదికలు సమర్పించని డొల్ల కంపెనీలను కంపెనీ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) రద్దు చేస్తోంది. ఈ విధంగా రద్దు చేయడం ఈ ఏడాది ఇది నాలుగోసారి. 2020లో కొవిడ్‌ కారణంగా స్ట్రయిక్‌ ఆఫ్‌ డ్రైవ్‌ను చేపట్టలేదు. ఈసారి కొత్తగా కంపెనీలను ప్రారంభించి, 180 రోజుల వరకూ కార్యకలాపాలు చేపట్టని కంపెనీలపై కూడా వేటు పడనుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలను ప్రారంభించని 1,964 కంపెనీలను కూడా 30 రోజుల గడువు ముగిసిన తర్వాత ఆర్‌ఓసీ రద్దు చేయనుంది. అంటే మొత్తం 4,400 కంపెనీలపై ఆర్‌ఓసీ వేటు వేయనుంది. ఈ కంపెనీలు కాక 202 కంపెనీలు రద్దుకు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుని రద్దయ్యాయి. 86 ఎల్‌ఎల్‌పీలు కూడా ఈ విధం గా మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 37,000 కంపెనీలు ఉన్నాయి. వీటిలో 25,700 కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. వీటితోపాటు 2,500 ఎల్‌ఎల్‌పీలు నమోదయ్యా యి. స్ట్రయిక్‌ ఆఫ్‌ డ్రైవ్‌ కింద 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌ఓసీ 971 కంపెనీలను రద్దు చేసింది. కాగా తెలంగాణకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. 


దేశవ్యాప్తంగా లక్షకు పైగా కంపెనీలు..

తాజాగా దేశవ్యాప్తంగా వరుసగా రెండేళ్ల పాటు ఆస్తులు, అప్పులు పట్టిక, రిటర్న్‌లు దాఖలు చేయని 1,02,000 కంపెనీలను గుర్తించినట్లు తెలుస్తోంది. అలానే 2.8 లక్షల మంది  డైరెక్టర్లపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ డ్రైవ్‌ ద్వారా ఇప్పటి వరకూ 3 లక్షల కంపెనీలను ఆర్‌ఓసీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 6 లక్షల మంది డైరెక్టర్లపై వేటు పడినట్లు అంచనా. 


డైరెక్టర్లపైనా..

కంపెనీల చట్టం 164 (2) సెక్షన్‌ కింద డైరెక్టర్ల అర్హతను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రద్దు చేయనుంది. వరుసగా మూడేళ్ల పాటు 2017-18 నుంచి 2019-20 వరకూ ఆస్తులు, అప్పుల పట్టిక, వార్షిక రిటర్న్‌లు దాఖలు చేయని కంపెనీల్లోని డైరెక్టర్లను ఐదేళ్లపాటు అనర్హులుగా ప్రకటించనుంది. దీంతో వారు ఐదేళ్ల పాటు ఏ కంపెనీలోనూ డైరెక్టర్లుగా ఉండేందుకు వీలుండదు. నిబంధనల ప్రకారం మూడేళ్ల పాటు రిటర్న్‌లు దాఖలు చేయని ఆంధ్రప్రదేశ్‌  కంపెనీల్లోని 5,000 మంది డైరెక్టర్లను ఆర్‌ఓసీ గుర్తించింది. ప్రస్తుతం వీరికి నోటీసులు జారీ చేస్తోంది. స్పందించని కంపెనీల డైరెక్టర్లపై వేటు వేయనుంది.  

Updated Date - 2021-11-30T08:15:13+05:30 IST