
అమరావతి: సీఎంఆర్ఎఫ్ పథకంలో జరిగిన అవినీతిపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. 2016లో వివిధ వ్యక్తుల పేర్లతో ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మయ్య యాదవ్ సీఎంఆర్ఎఫ్కు ఫేక్ మెడికల్ బిల్లులు సమర్పించారు. సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం చేశారని లక్ష్మయ్యపై ఆరోపణలు వచ్చాయి. 2017లో సింహాద్రిపురం పీఎస్‌లో లక్ష్మయ్యపై క్రిమినల్ కేసు నమోదు అయింది. 2014 నుంచి సీఎంఆర్ఎఫ్ ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సీఎంఆర్ఎఫ్లో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మెడికల్ ప్యాకేజీలో పేర్కొన్న దానికంటే ఎక్కువ మొత్తంలో బిల్లులు మంజూరు చేశారని, అనుమానాస్పదంగా ఉన్న 88 మెడికల్ క్లెమ్స్ను గుర్తించారు. ఈ అక్రమాలపై పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ చేపట్టింది. సీఎంఆర్ఎఫ్ ఆఫీస్‌లో సబార్డినేటర్ సీహెచ్.సుబ్రహ్మణ్యం, ఏపీ సెక్రటేరియట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సబార్డినేట్ సోకా రమేష్‌ను అరెస్ట్ చేశారు. చదలవాడ మురళీ కృష్ణ, కొండేపూడి జగదీశ్ ధనరాజ్లు కూడా అరెస్ట్ చేశారు. 2014 నుంచి సీఎంఆర్ఎఫ్లో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది. రూ.60 లక్షల సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం జరిగినట్లు వెల్లడించింది.