ఔషద రంగానికి అవినీతి రోగం

ABN , First Publish Date - 2021-02-24T06:47:21+05:30 IST

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) ఔషధ రంగం అవినీతి రోగంతో బాధపడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ మెడికల్‌ హోల్‌సేల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు ఒకరు ఏకంగా సీఎంకు, ఔషధ నియంత్రణ ఉన్నతా

ఔషద రంగానికి అవినీతి రోగం

ముఖ్యమంత్రికి, డ్రగ్స్‌ ఉన్నతాధికారులకు 

రాజమహేంద్రవరానికి చెందిన ఓ మెడికల్‌ ఏజెన్సీ అధినేత ఫిర్యాదు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఔషధ రంగం అవినీతి రోగంతో బాధపడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ మెడికల్‌ హోల్‌సేల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు ఒకరు ఏకంగా సీఎంకు,  ఔషధ నియంత్రణ  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లాలో ఈ శాఖలో జరుగుతున్న అవినీతి చర్చనీయాంశమైంది. మనిషికి, మెడిసిన్‌కు విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. మందులు లేకపోతే మనిషి బతకలేని పరిస్థితి. కొవిడ్‌-19 సమయంలో అన్ని వ్యాపారాలు మూతపడి జనం ఇళ్లకే పరిమితమైనప్పటికీ మెడికల్‌ షాపులు, చాలా ఆసుపత్రులు తెరిచే ఉన్నాయి. మందుల తయారీదారులు ఎక్కువే ఉన్నారు. నకిలీ మందులు కూడా ఉన్నాయి. నాణ్యత లేనివీ తయారు చేస్తున్నారు. ఇవన్నీ ధరలు ఎక్కువే. పైగా ఈ రంగంలో ధరలను కంట్రోలు చేసేవారు కూడా లేరు. బీపీ, షుగర్‌ ట్యాబ్‌లెట్ల ధరలు అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వం చెప్తుంది. కానీ ఒక్కో రకం ధరలు కొద్ది నెలల్లోనే విపరీతంగా పెంచేయడం గమనార్హం. బీపీ టాబ్లెట్‌ రకమైన ఇస్‌పిన్‌ 2.5 అట్ట రూ.20లోపే ఉండేది. ఇవాళ రూ.50 దాటేసింది. హృద్రోగం నివారణకు వాడే స్టంట్స్‌ను అతి తక్కువకు విక్రయించాలని కేంద్రం ప్రకటించింది. కానీ అదెక్కడా అమలు కావడంలేదు. కొన్ని రకాలు రూ.వేలల్లో ఉంటాయి. మెడికల్‌ షాపుల్లో కొందరు 10శాతం వరకు తగ్గిస్తుంటారు.


ఇటీవల ఆసుపత్రుల్లో కూడా మందులను విక్రయిస్తున్నారు. అక్కడ పైసా కూడా తగ్గించరు. పైగా కొన్నిచోట్ల ఎక్కువ ధరలు కూడా వసూలు చేస్తున్నారే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని నియంత్రించడానికి ఓవిభాగం ఉంది. జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరం కేంద్రంగా  ఔషధ నియంత్రణ సహాయ సంచాలకుడు (అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ డ్రగ్‌ కంట్రోలర్‌) ఉన్నారు. ఆయనకు ఒక ఆఫీసు, సిబ్బంది, ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. మెడికల్‌ షాపులు, ఏజెన్సీలు, ఆసుపత్రుల్లోని షాపులను తరచూ తనిఖీ చేసి నాసిరకం అమ్మకుండా చూడడం వారి విధి. నిషేధించినవి కూడా అమ్మకుండా చూడాలి. ఇంకా బిల్లులు దగ్గర నుంచి ధరలను ధిక్కరించకుండా కూడా చర్యలు తీసుకోవాలి. అంటే మొత్తం జిల్లాలో జరిగే మందుల వ్యాపార వ్యవహారాలపై నియంత్రణ అధికారం వారికే ఉంటుంది. అవన్నీ సక్రమంగా చేయకుండా ఏవో నామమాత్ర కేసులు నమోదు చేసి, ప్రతీ దుకాణం నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో  మెడికల్‌ దుకాణం నుంచి ఏడాదికి రూ.4,500 వసూలు చేస్తున్నారని రాజమహేంద్రవరానికి చెందిన శ్రీసూర్య మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు భాస్కర్‌ బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. ఒక విషయంలో ఏకంగా సీఎంకు,  ఔషధ నియంత్రణ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఈ రంగంలో జరిగే వ్యవహారాలన్నీ చర్చనీయాంశమయ్యాయి. రాజమహేంద్రవరంలో మెడికల్‌ షాపులు... జిల్లాలో సుమారు 6వేల మెడికల్‌ షాపులు, ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న దుకాణాల జోలికి పెద్దగా వెళ్లరు. పెద్దగా లాభాలు లేని షాపులు కూడా చాలా ఉన్నా యి. రాజమహేంద్రవరం, కాకినాడలతో పెద్ద పట్టణాల్లో కొన్ని షాపులే రద్దీగా ఉంటాయి. ఈ రంగానికి కూడా కార్పొరేట్‌ దెబ్బ తగలడంతో చాలా షాపుల నిర్వాహకులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి వారి జోలికి వెళ్లకుండా మిగతా దుకాణాల నుంచి ఏడాదికి ఓసారి వసూలు చేస్తారనేది ఆరోపణ. కొత్త షాపులకు లైసెన్స్‌ ఇవ్వాలంటే రూ.25వేలు, తనిఖీ చేసినప్పుడు రూ.10వేలు, రెన్యువల్‌ చేయడానికి రూ.5 వేలు ఎగ్జంప్షన్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.10వేలు తీసుకుంటారనేది ఆరోపణ.  


నేను ఎందుకు ఫిర్యాదు చేశానంటే

చెన్నా భాస్కర్‌, శ్రీసూర్య మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు

కరోనా సమయంలో నగరంలోని గాంధీ ఆసుపత్రిలో  నా బంధువును కొవిడ్‌ పేషెంట్‌గా జాయిన్‌ చేశాను. రోజుకు రూ.20వేలకు ఆసుపత్రి వర్గాలతో ఒప్పందం కుదిరింది.  కొవిడ్‌ తగ్గిన తర్వాత బిల్లు కట్టడానికి వెళితే రోజుకు రూ.30వేలు అడిగారు. ఇవ్వకపోతే డిశార్జి చేయనన్నారు. దానితో డబ్బు తీసుకుని బిల్లు అడిగాను. ఇవ్వనన్నారు. దాంతో కేసు కూడా పెట్టాను. తర్వాత  ఈ కేసును వెనక్కి తీసుకోవాలని  ఔషధ నియంత్ర శాఖ అధికారులు  ఒత్తిడి తెచ్చారు. నేను ఒప్పుకోలేదు. దాంతో తాను కొన్ని రకాలు బాగా తక్కువ ఎమ్మార్పీకి అమ్ముతున్నాననే కారణంతో తనిఖీలు చేసి నాలుగు శాంపిల్స్‌ తీసుకుని వెళ్లారు.  వాటి రిజల్ట్‌ బాగానే వచ్చింది. ఆ రిపోర్ట్‌ ఇవ్వడానికి రూ.50 వేలు లంచం అడిగారు. అది ఇవ్వకపోవడంతో తనను అసలు వాళ్ల ఆఫీసుకే రానివ్వలేదు. అగౌరవంగా మాట్లాడుతున్నారు. దీంతో  ఉన్నతాధికారులతో పాటు సీఎంకు కూడా ఫిర్యాదు చేశాను. కాగా భాస్కర్‌ ఆరోపణలపై  వివరణ కోరడానికి  ప్రయత్నించగా ఏడీ అందుబాటులో లేరు. ఫోన్‌ కూడా ఎత్తలేదు.

Updated Date - 2021-02-24T06:47:21+05:30 IST