ఏపీ సీఐడీ వరస్టు!

ABN , First Publish Date - 2022-07-02T07:53:09+05:30 IST

ఏపీ సీఐడీ వరస్టు!

ఏపీ సీఐడీ వరస్టు!

గోడలు దూకి వెళ్లి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది

కస్టడీలో ఉన్న వ్యక్తిని కొట్టడమేంటి?

పోస్టు పెట్టినట్లు, ఫార్వర్డు చేసినట్లు ఆధారాల్లేకుండా అరెస్టు చేస్తారా?


టోటల్‌ ఫెయిల్యూర్‌!!

అధికారులపై మేజిస్ట్రేట్‌ ఆగ్రహం

వ్యక్తిగత పూచీకత్తుపై యూట్యూబర్‌ వెంకటేశ్‌ విడుదల


గుంటూరు, జూలై 1: ‘ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ వరస్టు.. టోటల్‌ ఫెయిల్యూర్‌. అర్ధరాత్రి గోడలు దూకి వెళ్లి అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తిని కొట్టడం ఏమిటి..’ అని అంటూ సీఐడీ అధికారులపై కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్‌ తల్లి విజయలక్ష్మి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారనే అభియోగంపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో టీడీపీ సానుభూతిపరులైన ధరణికోటకు చెందిన యూట్యూబర్‌ గార్లపాటి వెంకటేశ్‌, మంగళగిరికి చెందిన సాంబశివరావులను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. బుధవారం అర్ధరాత్రి ధరణికోటలో వెంకటేశ్‌ ఇంటి గోడ దూకి వెళ్లి తాళాలు పగులగొట్టి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు సాంబశివరావుకు 41ఏ నోటీసు జారీ చేసి పంపేశారు. వెంకటేశ్‌ను మాత్రం సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ఇన్‌చార్జి మేజిస్ట్రేట్‌ జియావుద్దీన్‌ ఎదుట గురువారం అర్ధరాత్రి దాటాక హాజరుపరిచారు. అయితే తనను సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని వెంకటేశ్‌ మేజిస్ట్రేట్‌కు తెలిపారు. దీంతో అతడికి జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు నిర్వహించాలని మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. దరిమిలా శుక్రవారం వేకువఝామున పోలీసులు వెంకటేశ్‌ను జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నివేదికను సాయంత్రం మేజిస్ట్రేట్‌కు ఆయన ఇంట్లో అందజేశారు. వెంకటేశ్‌ను కూడా హాజరుపరిచారు. నివేదికను పరిశీలించిన మేజిస్ట్రేట్‌.. రైతు కుటుంబానికి చెంది.. గ్రామీణ నేపథ్యం ఉన్న వెంకటేశ్‌పై ఇంతకు ముందు ఎలాంటి కేసులు లేవని.. సీఐడీ ఉద్దేశపూర్వకంగానే వివిధ సెక్షన్లు పెట్టిందని అభిప్రాయపడ్డారు. ఇదే కేసులో ఇంతకుముందు నలుగురైదుగురికి 41ఏ నోటీసులిచ్చి పంపిన సీఐడీ.. వెంకటేశ్‌పై ఏడేళ్లు శిక్షపడే సెక్షన్లు పెట్టి అతడిని మాత్రమే అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అన్నారు. అర్ధరాత్రి సమయంలో గోడ దూకి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. వెంకటేశ్‌ కుటుంబ సభ్యులు సహకరించలేదని, తన వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడని.. అందువల్లే సీఐడీ అధికారులు అలా వ్యవహరించాల్సి వచ్చిందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) తెలిపారు. పోస్టు పెట్టినట్లు గానీ, ఫార్వర్డు చేసినట్లు గానీ ఏం ఆధారాలు ఉన్నాయని మేజిస్ట్రేట్‌ ప్రశ్నించారు. ఆధారాల్లేకుండా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్‌ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.


సీఐడీ అధికారులపై ప్రైవేటు కేసు వేస్తాం

ఎంపీ రఘురామరాజు తరహాలోనే సీఐడీ అధికారులు వెంకటేశ్‌ను విచారణ పేరుతో అక్రమంగా నిర్బంధించి కొట్టారని అతడి తరఫు న్యాయవాదులు మాగులూరి హరిబాబు, దొద్దాల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్‌, రావిపాటి సాయికృష్ణ ఆరోపించారు. వారు రౌడీల మాదిరిగా వ్యవహరించారని.. వారిపై ప్రైవేటు కేసు వేస్తామని హెచ్చరించారు. వారు కొట్టడం వల్ల వెంకటేశ్‌కు దెబ్బలు తగిలితే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి సంబంధిత విభాగాల వైద్య అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పించారని ఆరోపించారు.


అరెస్టుపై సీఐడీ వివరణ

వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్న ఉదంతంపై సీఐడీ అధికారులు స్పందించారు. అందుకు దారితీసిన కారణాలను వివరిస్తూ శుక్రవారం పత్రికలకు నోట్‌ విడుదల చేశారు. నోటీసు ఇచ్చేందుకు వెళ్లినప్పుడు తీసుకోవడానికి వెంకటేశ్‌ నిరాకరించాడని, దర్యాప్తు అధికారులకు సహకరించలేదని, తప్పించుకోవడానికి, ఎలక్ర్టానిక్‌ పరికరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడని, గమనించిన సీఐడీ బృందం బలవంతంగా తలుపులు తెరిచి అతడిని అదుపులోకి తీసుకుందని తెలిపారు. సీఐడీ పోలీసులు తనను కొట్టినట్టు వెంకటేశ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట ఆరోపించారని.. అయితే జీజీహెచ్‌ వైద్యులు పరీక్షించి ఇచ్చిన నివేదిక ఆధారంగా అతడి ఆరోపణలు తప్పుడు ఉద్దేశంతో చేసినవేనని కోర్టు తోసిపుచ్చిందని పేర్కొన్నారు.


డిశ్చార్జి కోసం సూపరింటెండెంట్‌ ఒత్తిడి?

అంతకుముందు వెంకటేశ్‌ చికిత్సపై గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం వేకువ జాము నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. ఒక్కో వైద్యుడు ముందు ఒక మాట చెప్పడం, తర్వాత మాట మార్చడం, చివరకు అంతా బాగానే ఉందని సర్టిఫికెట్‌ ఇవ్వడం.. మరోసారి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. వెంకటేశ్‌ను గురువారం అర్ధరాత్రి దాటాక న్యాయమూర్తి ముందు హాజరుపరచిన సీఐడీ పోలీసులు.. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు శుక్రవారం వేకువజామున 2.30 ప్రాంతంలో జీజీహెచ్‌కు తరలించారు. ముందుగా పరీక్షించిన వైద్యుడొకరు.. పక్కటెముకల్లో దెబ్బలు ఉన్నాయని, మూతి భాగంపై చికిత్స అందించాలని, మూడ్రోజులు ఆస్పత్రిలో ఉంచితే గానీ పరిస్థితి మెరుగవదని నోటిమాటగా చెప్పారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన వైద్యులు జీజీహెచ్‌లో ప్రవేశించి వైద్యులతో ఏదో మాట్లాడారు. అప్పటి నుంచి వెంకటేశ్‌కు చికిత్స అవసరం లేదు.. అంతా బాగానే ఉందని డాక్టర్లు చెప్పడం ప్రారంభించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి ఒత్తిడితో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో) సహా అన్ని విభాగాల వైద్యులూ డిశ్చార్జి చేయాలంటూ నివేదిక ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2022-07-02T07:53:09+05:30 IST