ఆర్కేపై జీరో ఎఫ్ఐఆర్ దురుద్దేశమే: పట్టాభి

ABN , First Publish Date - 2021-12-13T02:23:30+05:30 IST

ఏపీ ప్రభుత్వ లోపాలను ప్రసారం చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దురుద్దేశంతోనే సీఐడీ పోలీసులు జీరోఎఫ్ఐఆర్ నమోదు చేశారని...

ఆర్కేపై జీరో ఎఫ్ఐఆర్ దురుద్దేశమే: పట్టాభి

అమరావతి: ఏపీ ప్రభుత్వ లోపాలను ప్రసారం చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దురుద్దేశంతోనే సీఐడీ పోలీసులు జీరోఎఫ్ఐఆర్ నమోదు చేశారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టాభి స్పందించారు.  గంటా లక్ష్మీనారాయణ ఇంటికి ఆర్కే స్నేహ పూర్వకంగానే వెళ్లడం జరిగిందని,  సీఐడీ అధికారుల విధులకు ఎక్కడా ఆటంకం కలిగించినట్లు లేదన్నారు. మఫ్టీలో సీఐడీ పోలీసులు వెళ్లడం వల్ల లక్ష్మీనారాయణ కుటుంబం కొంత ఆందోళన చెందిందని ఆయన పేర్కొన్నారు. సీఐడీ అధికారులను కూడా లక్ష్మీనారాయణ కుటుంబం గట్టిగా ప్రశ్నించడం జరిగిందని పట్టాభి తెలిపారు.


‘‘ఆ సమయంలో రాధాకృష్ణ అక్కడికి వెళ్లారు. లక్ష్మీనారాయణ కుటుంబంతో పాటు సీఐడీ అధికారులతోనూ ఆర్కే మాట్లాడారు. సీఐడీ విచారణకు సహకరించమని లక్ష్మీనారాయణ కుటుంబానికి ఆర్కే చెప్పారు. రాధాకృష్ణ వెళ్లిన తర్వాత సీఐడీకి లక్ష్మీనారాయణ కుటుంబం సహకరించింది. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి సర్దుమనిగిందని, ఇంకా కొంత సమయం ఉండమని రాధాకృష్ణను సీఐడీ అధికారులు కోరారు. ఇది వాస్తవం. అక్కడ జరిగిందంతా కూడా ప్రత్యక్ష ప్రసారాల్లో చూశాం. గతంలో నుంచే ఏబీఆన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కక్ష ఉంది. ఏదోరకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ జీరోఎఫ్ఐఆర్. సీఐడీలాంటి వ్యవస్థలను చేతిలో పెట్టుకుని మీడియాపై కూడా దాడి చేయిస్తున్నారు.’’ అని పట్టాభి తెలిపారు.  



కాగా.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ... రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.  లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల సందర్భంలో విధులకు ఆటంకం కలిగించారని సీఐడీ ఆర్కేపై కేసు నమోదు చేయడం గమనార్హం. 


చిరకాల మిత్రుడు లక్ష్మీనారాయణను పరామర్శించేందుకు ఆర్కే అక్కడికి వెళ్లారు. అయితే రాధాకష్ణను కొద్దిసేపు ఇక్కడే ఉండాలని సీఐడీ అధికారులే కోరారు. అంతేకాదు.. మీరు ఇక్కడే ఉంటే లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు సహకరిస్తారని కూడా సీఐడీ కోరింది. ఈ క్రమంలో అధికారులకు అన్ని విధాలా సహకరించాలని కూడా రిటైర్డ్‌ ఐఏఎస్‌ కుటుంబీకులకు ఆర్కే సూచించారు. అయితే ఈ లోపే ఏం జరిగిందో ఏమోకానీ ఒక్కసారిగా సీఐడీ అధికారులు ప్లేట్ మార్చేశారు.


విచారణకు ఆటంకం కలిగించారంటూ 36 గంటల తర్వాత ఏబీఎన్ ఎండీపై కేసు నమోదు చేశారు. విచారణకు అడ్డుకుని ఉంటే అదే సమయంలో.. లేదా అదే రోజు సాయంత్రం వరకో.. అదీ కాకుంటో ఆ మరుసటి రోజో ఎందుకు ఫిర్యాదు చేయలేదో..!. ఈ ప్రశ్నకు సీఐడీనే సమాధానం చెప్పాలి మరి. ఇవన్నీ అటుంచితే.. సాక్ష్యాధారాలతో సహా వీడియో ఫుటేజ్‌ను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఇలా సీఐడీ.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందనేది క్లారిటీగా అర్థమవుతోంది. విచారణ సమయంలో ఆర్కేని అక్కడే ఉండాలని కోరడమేంటి..? 36 గంటల తర్వాత మళ్లీ ఇలా కేసు 


నమోదు చేయడమేంటి..? ఇదేం విచిత్రమో అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు, నిపుణులు, విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిజంగా ఆర్కే విచారణను అడ్డుకుని ఉంటే అప్పుడే హైదరాబాద్‌లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? ఇది కచ్చితంగా ఆర్కేపై కక్షసాధింపు చర్యేనని రాజకీయ ప్రముఖులు సైతం సీఐడీ తీరును తప్పుబడుతున్నారు.



Updated Date - 2021-12-13T02:23:30+05:30 IST