Abn logo
Sep 26 2021 @ 02:08AM

మంత్రులందరినీ మార్చేస్తారు!

  • ముఖ్యమంత్రే ఈ విషయం చెప్పారు
  • పదవికన్నా పార్టీ ముఖ్యం: బాలినేని


ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 25: ‘‘మంత్రివర్గంలో అందరినీ మార్చేస్తారు. వందశాతం మార్పు ఖాయం. అంతా కొత్తవారిని తీసుకుంటానని ఇటీవలే ముఖ్యమంత్రి నాకు చెప్పారు’’ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అది వంద శాతం సరైన నిర్ణయమని చెప్పానన్నారు. తనకు మంత్రి పదవి కన్నా పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో సమూల ప్రక్షాళన ఉంటుందని.. మొత్తం అందరినీ తప్పిస్తారని ‘మంత్రులందరికీ మంగళం’ శీర్షికన ఇప్పటికే ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలినేని దీనిని ధ్రువీకరించారు. ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా శనివారం ఒంగోలులో బూచేపల్లి వెంకాయమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ దర్శిలో అంతర్గత విభేదాల గురించి ప్రస్తావించారు. సీఎం తీసుకునే నిర్ణయాలకు అందరం కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. సీఎం చెప్పిన మాటలనే తాను ఇక్కడ చెబుతున్నానన్నారు.