ఢిల్లీ ఏం చేయాలో అది చేస్తుంది.. ఏపీ బీజేపీకి రామ్ మాధవ్ హితబోధ

ABN , First Publish Date - 2020-08-11T19:49:17+05:30 IST

ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అభిలషించారు.

ఢిల్లీ ఏం చేయాలో అది చేస్తుంది.. ఏపీ బీజేపీకి రామ్ మాధవ్ హితబోధ

అమరావతి: ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అభిలషించారు. సోము వీర్రాజు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ జూనియర్ పాట్నర్‌గా పోషించిన పాత్ర నుంచి బయటకు రావాలన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, విమర్శనాత్మక మిత్రత్వంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే నాలుగేళ్లలో బలమైన శక్తిగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో బలమైన ప్రతిపక్షం లేదని, ఒక నిర్మాణం జరగాలన్నారు. ‘‘మోదీ మరో పది, పదిహేనేళ్ల ఉండొచ్చు. కానీ అది ఏపీ బీజేపీకి సరిపోదు. మంచి అవకాశాన్ని బీజేపీ కార్యకర్తలు ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ వైఖరిని మనం గమనిస్తున్నాం. ఆ వైఖరిని కూడా ధీటుగా ఎదుర్కోవాలి. ఇదేమీ పూలపాన్పు కాదు. అధికార పార్టీ దురహంకారాన్ని ఎదుర్కోవాలి. అధికారంలో ఉన్న వ్యక్తులను సంఘర్షణ వైఖరితో ఎదుర్కోవాలన్నారు. ప్రతిసారీ ఢిల్లీకి ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదని.. ఢిల్లీ ఏం చేయాలో అది చేస్తుంది. ముందు మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ప్రజాస్వామ్య బద్ధంగా వీధుల్లో నిలబడి పోరాడాలి. ఏపీలో అప్పుడే ముందుకు వెళ్లగలం. ప్రజల కోసం నిలబడే పార్టీగా ఎదగాలి’’ అని హితబోధ చేశారు. 

Updated Date - 2020-08-11T19:49:17+05:30 IST