ఏపీలో చేరికలకు బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఈ కీలక నేతలతో భేటీ!

ABN , First Publish Date - 2021-01-15T20:12:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తోంది.

ఏపీలో చేరికలకు బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఈ కీలక నేతలతో భేటీ!

ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ : ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తోంది. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే అటు అధికార పార్టీని.. ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం.. మరీ ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను, మాజీలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రులను సైతం పార్టీలో చేర్చుకోవాలని నేతలు ప్రయత్నాలు షురూ చేశారు. ఇప్పటికే పలువుర్ని పార్టీలో చేర్చుకున్న సోమువీర్రాజు మరికొంత మంది కీలక నేతలతో భేటీ అయ్యి వారికి ఢిల్లీ పెద్దల చేత కాషాయ కండువాలు కప్పేందుకు సిద్ధమవుతున్నారు.


ప్రముఖ నటి కండువా కప్పుకుంటారా..!?

ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఏపీ బీజేపీ నేతలతో వరుస భేటీలు అవుతున్నారు. ఇటీవలే ప్రముఖ నటి వాణీవిశ్వనాథ్‌తో సోము వీర్రాజు భేటీ అయ్యి పార్టీలో చేరిక విషయంపై చర్చించారు. గతంలో ఈమె టీడీపీలో చేరతారని.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రోజాపై పోటీ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వాణీ పార్టీలో చేరలేదు.. రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆమెకు కాషాయ కండువా కప్పడానికి బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా..? లేదా..? అనేది తెలియరాలేదు.


ఈ కీలక నేతలతో భేటీ..!?

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఉద్యమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు.. తాను కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉంటున్నట్లు ఆ మధ్య కీలక ప్రకటన చేయడం.. ఆ తర్వాత కాపు నేతలందరూ ఆయనతో భేటీ కావడం.. ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. అయితే ఈ విషయాలన్నీ క్యాష్ చేసుకున్న బీజేపీ పార్టీలోకి ఆహ్వానించాలని సన్నాహాలు చేస్తోంది. పైగా సామాజిక వర్గం అనే కార్డు కూడా కలిసొస్తుందని రాష్ట్ర కమలనాథులు భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే రేపు అనగా శనివారం నాడు సోము వీర్రాజు తన బృందంతో ముద్రగడ ఇంటికెళ్లి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో చేరికతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలపై నిశితంగా ఆయనతో వీర్రాజు చర్చించనున్నారు. మరి ఈ భేటీ అనంతరం ముద్రగడ ఎలా రియాక్ట్ అవుతారో అనేదానిపై ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.


టీడీపీ కీలక నేత సంగతేంటో..!?

కిమిడి కళా వెంకటరావు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టీడీపీలో ఆయన కీలక నేతగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడుకి అధిష్టానం కట్టబెట్టిన తర్వాత కళా అసంతృప్తితో ఉన్నారని.. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనట్లేదని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో కళాను కలవాలని బీజేపీ నేతలు భావించారు. అసంతృప్తితో ఉన్న ఆయన్ను బీజేపీలో చేర్చుకుని కీలక పదవి కూడా ఇవ్వాలనే యోచనలో ఏపీ కమలనాథులు అనుకుంటున్నారట. త్వరలోనే కళా వెంకట్రావుతో సోమువీర్రాజు భేటీ కానున్నారు. పార్టీలో చేరికపై చర్చించనున్నారు. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేదా సైకిల్ పార్టీలో కొనసాగుతారా..? అన్నది త్వరలోనే తెలియనుంది.


పడాల పరిస్థితేంటో..!?

ముద్రగడ, కళాతో పాటు ఉత్తరాంధ్ర టీడీపీలో కీలక మహిళానేతగా పేరొందిన వ్యక్తి పడాల అరుణను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన ఆమెకు విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో మంచి కేడర్ ఉంది. 1995లో చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగారు. అంతేకాదు బాబు క్యాబినేట్‌లో శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న అరుణను బీజేపీలో చేర్చుకుంటే నియోజకవర్గంలో పార్టీకి కలిసొస్తుందని భావించిన సోము వీర్రాజు త్వరలోనే భేటీ కానున్నారు.


ఎవరెవరు చేరుతారో..!?

మొత్తానికి చూస్తే.. రాష్ట్రంలో బలోపేతానికి గాను పక్కా వ్యూహంతోనే ముందుకెళ్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బలమైన సామాజిక వర్గంలోని అసంతృప్త నేతలకు కాషాయ కండువా కప్పడానికి రాష్ట్ర కమలనాథులు వేసిన మాస్టర్ ప్లాన్ ఏ మాత్రం ఫలిస్తుంది..? పైన చెప్పిన వారిలో ఎంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు..? ఎవరెవరు ఇప్పుడున్న పార్టీలోనే కొనసాగుతారు..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-01-15T20:12:44+05:30 IST