చాలా సందర్భాల్లో గమనించాం.. Chandrababu వ్యాఖ్యలపై సోమువీర్రాజు రియాక్షన్..

ABN , First Publish Date - 2022-05-08T18:49:39+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన పొత్తుల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పరోక్షంగా స్పందించారు..

చాలా సందర్భాల్లో గమనించాం.. Chandrababu వ్యాఖ్యలపై సోమువీర్రాజు రియాక్షన్..

విజయవాడ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన పొత్తుల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పరోక్షంగా స్పందించారు. ఆదివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారని.. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించామని కాస్త సెటైరికల్‌గా మాట్లాడారు. ఇకపై గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్ధంగా లేదని ఈ మీడియా వేదికగా స్పష్టంగా చెబుతున్నాం. అభివృద్ది, సంక్షేమం మన దగ్గర ఉంది.. ఈ కుటుంబ పార్టీలకోసం మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. త్యాగధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. 2024 లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని సోమువీర్రాజు చెప్పుకొచ్చారు. అయితే వీర్రాజు వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి.


ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు..!?

వైసీపీ అరాచక పాలన అంతానికి మరో ప్రజా ఉద్యమం రావాలని ఇటీవల Chandrababu వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని వైసీపీ వర్గీయులను సైతం కోరారు. ఈ ప్రజా ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుందన్నారు. ‘క్విట్‌ జగన్‌... సేవ్‌ ఏపీ’ అని నినదించారు. వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలి. ఇందుకోసం ప్రజా ఉద్యమం రావాలి. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ పోరాటంలో జైలుకు వెళ్లడానికీ భయపడేది లేదు అని బాబు చెప్పుకొచ్చారు. గత శుక్రవారం నాడు చంద్రబాబు కాకినాడ జిల్లాలో పర్యటించారు. తొలుత అన్నవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.



Read more