కన్నీటి ఉప్పెన

ABN , First Publish Date - 2020-10-19T10:54:02+05:30 IST

కన్నీటి ఉప్పెన

కన్నీటి ఉప్పెన

తగ్గని ఉప్పుటేరు ఉధృతి.. శాంతిస్తున్న యనమదుర్రు

వరద నీటిలోనే గ్రామాలు.. నానుతున్న పంట పొలాలు

మళ్లీ వాయుగుండం.. రెండు రోజుల పాటు వర్షాలు

ఆందోళనలో రైతులు.. పంటలపై నీరుగారుతున్న ఆశలు

గ్రామాల్లో అందని తాగునీరు.. అందుబాటులో లేని వైద్యులు


జిల్లాలో వర్షాలు, వరదల ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంపునకు గురైన పంట నీటిలోనే నానుతోంది. దిక్కుతోచని స్థితిలో రైతులున్నారు. తమ్మిలేరు, యనమ దుర్రు, ఉప్పుటేరు, ఎర్రకాల్వ పోటెత్తి ఊళ్లపై పడటంతో జరిగిన నష్టం నుంచి ఇంకా తేరుకోలేదు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పుటేరుకు పెరిగి.. యనమదుర్రుకు తగ్గి..భీమవరం, అక్టోబరు 18 : జిల్లాలో ప్రధాన డ్రైయిన్‌ ఉప్పుటేరుకు ఆదివారం మరింత వరద పెరిగింది. కొల్లేరు నుంచి మరింత వరద నీరు రావడంతో పరివాహక ప్రాంతాల పరిస్థితి దిగజారింది. తమ్మిలేరు, రామిలేరు తదితర ప్రధాన మురుగు కాలువల నుంచి ప్రవాహం పెరగడంతో ఆదివారం ఉప్పుటేరుకు వరద పోటు పెరిగింది. ఆకివీడు రైలు వంతెన వద్ద 2.9 మీటర్ల ప్రవాహం నమోదైంది. 32 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండడంతో ఆకివీడు, కాళ్ళ, భీమవరం మండలాలలో తీర గ్రామాలకు ముంపు సమస్య తగ్గలేదు. కాళ్ళ, ఆకివీడు మండలాలలో రహదారులు మునిగిపోయి పరిస్థితి ఉంది. ఉప్పు టేరులో కలిసే రుద్రాయకోడు, బొండాడ డ్రెయిన్‌, గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌, గొంతేరులలో వరద నీరు వరుసగా నాలుగో రోజు సాఫీగా ప్రవహిస్తున్నాయి. పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలకు చేరిన వరద నీరు బయటకు వెళ్లడం లేదు. యనమదుర్రు డ్రెయిన్‌ వరద నీరు కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నందమూరు ఆక్విడెక్టు వద్ద 34 అడుగులు, దువ్వ రెగ్యులేటర్‌ వద్ద 29.5 అడుగులు ఎత్తున ప్రవాహం నమోదైంది. అక్కడ 17,011 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని డ్రెయినేజీ శాఖ అధికారులు వెల్లడించారు. భీమవరం వద్ద 19 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. సుమారు రెండడుగులు నీరు తగ్గింది.


తమ్మిలేరు.. రైతు కంట కన్నీరు..

ఏలూరు రూరల్‌ : తమ్మిలేరు వాగు పొంగి ముంచెత్తడంతో ఏలూరు రూరల్‌ మండలంలోని కోతకు సిద్ధమైన వరి నీట మునిగింది. బూరాయిగూడెంలో వంద ఎక రాలు, పాలగూడెంలో 400 ఎకరాలు, లింగా రావుగూడెం,మాదేపల్లి, కాట్లంపూడి, జాలి పూడి తదితర ప్రాంతాల్లో 700 ఎకరా లకు పైగా వరి పంట దెబ్బతింది. ప్రస్తుతం వరద నీటిలోనే నానుతుండటంతో వరి కుళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నా యని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సకాలంలోనే ఖరీఫ్‌ సాగైనప్పటికీ తమ్మిలేరు మాత్రం ఈ ప్రాంతవాసులకు మాత్రం కన్నీరునే మిగిల్చింది. 


నేటికీ తేరుకోని ఊళ్లు

గణపవరం : వారం క్రితం పచ్చగా కనువిందు చేసిన పంటలు పొలాలు యనమదుర్రు వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేటికి నీళ్లలోనే నానుతు న్నాయి. యనమదుర్రు ప్రవాహం తగ్గిన ప్పటికి చేలల్లో నీరు తగ్గకపోవడతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పిప్పరలోని కాలనీలు, కోమర్రు, కేశవరం, కొముట్ల గ్రామాల్లో పల్లపు ప్రాంతా ల్లోని ఇళ్లు వరద నీటి నుంచి తేరుకోలేదు. అధికా రులు ఆయిల్‌ ఇంజన్ల ద్వారా ముంపు నీరు తొలగించే ప్రయత్నం చేస్తున్న ప్పటికీ ఫలి తం కనిపించడం లేదు.


ఊట బారిన చేలు

పెరవలి : నిడదవోలు - నరసాపురం కాలువకు గోదావరి నుంచి చుక్కనీటిని విడుదల చేయకుండా విజ్జేశ్వరం బ్యారేజీ వద్ద తలుపులు బిగించినప్పటికీ వర్షపు నీటితో కాలువ నిండుగా ప్రవహిస్తున్నాయి. కాలువ పొడువునా మురుగునీరు డ్రెయిన్లలో కాలువలోకి నీరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడే నీరు నిలిచింది. ఫలితంగా పెరవలి మండలంలో పంట చేలల్లో నీరు లాగక ఊట బారిన పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పంట భూములు రక్షించుకునేందుకు పొలాల నుంచి నీటిని బయటకు తోడుతున్నారు. రెండు రోజుల్లో మళ్లీ  భారీ వర్షాలు కురుస్తాయనే వార్తల నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-10-19T10:54:02+05:30 IST