కష్టాలు.. రెండింతలు..!

ABN , First Publish Date - 2020-10-22T10:39:12+05:30 IST

కష్టాలు.. రెండింతలు..!

కష్టాలు.. రెండింతలు..!

ఎఫ్‌పీ షాపుల్లో రెండుసార్లు వేలిముద్రలు వేయాల్సిన దుస్థితి..

సర్వర్‌ మొరాయింపుతో మరిన్ని ఇబ్బందులు..

కార్డుదారులకు తప్పని నిరీక్షణ..


అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 21:  చౌకధరల దుకాణాల్లో సరుకులు తీసుకునేందుకు ఒకసారి వేలిముద్రలు వేయాలంటే సర్వర్‌ సమస్యతో ప్రతి నెలా ఇబ్బంది పడాల్సిందే. అలాంటిది రెండుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావటం మరింత సమస్యగా మా రింది. కష్టాలు రెండింతలయ్యాయి. రెండు రోజులుగా ఎఫ్‌పీ షాపుల్లో 14వ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతోంది. ఈసారి కార్డుదారుడు రెండుసార్లు వేలిముద్రలు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. గత నెల వరకు ఒకసారి వేలిముద్ర వస్తే కార్డుదారులకు కావాల్సిన అన్నిరకాల సరుకులు పంపిణీ చేసేవారు. ఇదివరకు 6.6 సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా సరుకులు అందజేశారు. ఈ నెలలో 6.7 అడ్వాన్స్‌డ్‌ వర్షన్‌కు సాఫ్ట్‌వేర్‌ను మార్చారు. కొత్త వర్షన్‌లో బియ్యం కోసం ఒక సారి, శనగల కోసం మరోసారి వేలిముద్రలు వేసేలా ఆప్షన్‌ ఇచ్చారు. ఇది కార్డుదారులు, డీలర్లకు ఇబ్బందిగా మారింది. సర్వర్‌ సక్రమంగా పనిచేయకపోవటం మరింత సమస్యగా పరిణమించింది. బుధవారం రెండోరోజు ఉదయం నుంచే సర్వర్‌ సమస్య ఉత్పన్నమైంది. రెండుసార్లు వేలిముద్రలు వేయాలన్న నిబంధనకు అదనంగా సర్వర్‌ మొరాయించటంతో గంటల తరబడి కార్డుదారులు ఎఫ్‌పీ షాపుల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేలా జిల్లా యంత్రాంగం చొరవ చూపాల్సి ఉంది. మరి ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. జిల్లావ్యాప్తంగా 3012 ఎఫ్‌పీ షాపుల  పరిధిలో 12.55 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. రెండోరోజు 88వేల మందికి ఉచిత సరుకులు బియ్యం, శనగలు పంపిణీ చేశారు. ఇప్పటిదాకా లక్ష మందికి అందించారు.

Updated Date - 2020-10-22T10:39:12+05:30 IST