వక్కలు, పసుపు కొమ్ముల కిరీటాలు

ABN , First Publish Date - 2020-09-21T11:51:35+05:30 IST

వక్కలు, పసుపు కొమ్ముల కిరీటాలు

వక్కలు, పసుపు కొమ్ముల కిరీటాలు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం కన్నులపండువగా స్నపనతిరుమంజనం జరిగింది. ఎండుద్రాక్ష, వక్కలు, పసుపుకొమ్ములతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపనం జరిపించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు రంగనాయక మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేదమంత్రాల నడుమ కంకణభట్టర్‌ గోవిందాచార్యులు స్నపనం చేశారు. ఉత్సవంలో స్వామివారికి ఏదైనా తెలియని శ్రమకలిగినట్లయితే దానిని పోగొట్టి నూతనత్వాన్ని ఆపాదింపచేయటమే స్నపన తిరుమంజనం పరమార్థం. తొలిగా ఉత్సవర్లను స్వర్ణపీఠంపై ఆశీనులుచేసి తీర్థం (కుంకుమపువ్వు, యాలకలు, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం కలిపిన జలం)తో తిరుమంజనం చేశారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం ఒక దాని తరువాత ఒకటి జియ్యంగార్లు శంఖనిధి, పద్మనిధి ప్రాతలలో అందిస్తుండగా వేదపండితులు పంచశూక్త పారాయణం చేస్తుండగా కంకణ భట్టాచార్యులైన గోవిందాచార్యులు ఉత్సవర్లకు అభిషేకం చేశారు. చివరగా సహస్రధారపళ్లెంతో అభిషేకించడంతో పూర్తయింది. ఇలా ఒక్కో ద్రవ్యంతో అభిషేకించిన తరువాత ప్రత్యేక మాలలు, కిరీటాలు అలంకరించారు. ఎండుద్రాక్ష, వక్కలు, పసుపుకొమ్ములు, తులసిగింజలు, తామరగింజలు, తమలపాకులు, రోజా పూల రేకుల, పగడపు పూలతో తయారు చేసిన మాలలు, కిరీటాలను అలకరణకు వినియోగించారు. వీటిని టీటీడీ ఉద్యానవనం సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తయారుచేశారు. ఆయా కార్యక్రమాల్లో టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శేఖర్‌, ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్‌ పాల్గొన్నారు. కాగా, స్నపన తిరుమంజనం నిర్వహించే రంగనాయకుల మండపాన్ని వివిధ రకాల సంప్రదాయ పుస్పాలు, కట్‌ఫ్లవర్స్‌, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, ఆస్ట్రేలియా బత్తయి, ద్రాక్షగుత్తులతో ఆకర్షిణీయంగా తీర్చిదిద్దారు. 


వీణాపాణిగా.. 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం సాయంత్రం 7 గంటలకు మలయప్పస్వామి హంస వాహనంపై వీణాపాణిగా దర్శనమిచ్చారు. కల్యాణోత్సవ మండపంలో స్వామిని హంస వాహనంపై ఆశీనులు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారు భక్తుల్లో అహంభాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణోక్తి. కాగా, ఉదయం రంగనాయక మండపం నుంచి కలాణోత్సవ మండపం వరకు మలయప్పస్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఐదుతలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, పిల్లనగ్రోవితో మురళీకృష్ణుడు అవతారంలో మలయప్ప దర్శనమిచ్చారు. వాహనసేవలో నిర్వహించే వైదిక కార్యక్రమాలను పూర్తిచేశారు.

Updated Date - 2020-09-21T11:51:35+05:30 IST