‘సోమశిల’లో ఉత్కంఠ!

ABN , First Publish Date - 2020-09-21T10:20:01+05:30 IST

‘సోమశిల’లో ఉత్కంఠ!

‘సోమశిల’లో ఉత్కంఠ!

వరద తాకిడితో కోతకు గురైన రివిట్‌మెంట్‌

ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదీ!?


అనంతసాగరం, సెప్టెంబరు 20 : పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చి సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఇన్‌ఫ్లో గంట గంటకూ హెచ్చుతగ్గులు ఉండటంతో ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన రేగుతోంది. ఈ పరిస్థితుల్లో జలాశయం దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు.


సోమశిలకు ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు 1,15,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,30,200 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగింది. 1వ గేటు మినహా మిగిలిన 11 క్రస్ట్‌గేట్ల నుంచి నీరు వదులుతున్నారు. జలాశయ భద్రతా దృష్ట్యా నిల్వ సామర్థ్యం 75 టీఎంసీలకు కుదించారు. 


సోమశిల నుంచి భారీగా నీరు దిగువకు విడుదల  చేయడంతో జలాశయం ముందు ప్రొటెక్షన్‌ వాల్‌కు సమీపంలో ఎడమ వైపు నిర్మించి ఉన్న పొర్లుకట్ట రివిట్‌మెంట్‌ సుమారు 150 మీటర్లు కోతకు గురైంది. జలాశయం నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే ఈ ప్రాంతంలో కట్టకు ప్రమాదం తప్పదు. 


కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసిన వర్షాలకు కుందూ, పాపాగ్ని, సగిలేరు, చిత్రావతి నదుల నుంచి వస్తున వరద పెన్నాలో కలవడంతో సోమశిలకు భారీగా వరద వస్తోంది. మంగళవారం ఉదయం వరద మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


సోమశిల నుంచి నెల్లూరు వరకు పెన్నాతీరం వెంబడి చాలా గ్రామాల్లో పొర్లు కట్టలు ధ్వంసం చేసి కొందరు పొలాలుగా మార్చారు. దీంతో దిగువ పరివాహక ప్రాంతాలలోని గ్రామాలకు ముప్పు పొంచి వుంది. వరద భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.


సుదూర ప్రాంతాల నుంచి సందర్శఽకులు అధిక సంఖ్యలో జలాశయం వద్దకు చేరుకొంటున్నారు. దీంతో రద్దీ ఎక్కువవడంతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు


కండలేరుకు వరద కాలువ ద్వారా 11000 క్యుసెక్కుల నీరు తరలిసున్నారు. దీంతో కాలువ ప్రమాదభరితంగా మారుతోంది. నీటి ఒరవడి ఎక్కువై  కాలువ గోడల నుంచి లీకేజీలు కొనసాగుతున్నాయి.  


సోమశిలకు భారీగా వరద వస్తున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. సిబ్బంది పర్యవేక్షణలో నీటి విడుదల జరుగుతోంది. రెండు రోజులుగా ఎస్‌ఈ, సీఈ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇంజనీరు వర్గాల్లో ఆందోళన నెలకొంది.


Updated Date - 2020-09-21T10:20:01+05:30 IST