మళ్లీ ముంచారు..!

ABN , First Publish Date - 2020-09-21T10:29:03+05:30 IST

మళ్లీ ముంచారు..!

మళ్లీ ముంచారు..!

2019 అక్టోబరులో పల్లెలను ముంచిన సోమశిల బ్యాక్‌వాటర్‌

గంగపేరూరు, పొత్తపి ఖాళీకి నివేదిక

420 ఎకరాల భూసేకరణకు సర్వే

పునరావాస ప్యాకేజీ రూ.950 కోట్లకుపైగా అవసరమని అంచనా

ఏడాదైనా ఒక్కపైసా ఇవ్వని జగన్‌ సర్కారు

తాజాగా గ్రామాలను కబళించిన సోమశిల బ్యాక్‌వాటర్‌ 

ఆందోళనలో కష్జజీవులు


సోమశిల బ్యాక్‌వాటర్‌ గతేడాది గంగపేరూరు, పొత్తపి తదితర గ్రామాల్ని ముంచేసింది. సుదూరంగా కంటికి కనిపించే పెన్నా జలాలు రాత్రికిరాత్రి ఊళ్లు, పంటచేలను కబళించడంతో కష్టజీవులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ప్రతి ఇంట కన్నీళ్లే మిగిలాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, రాజంపేట ఎంపీ మిఽథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి గ్రామాలకు వెళ్లారు. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాలు, పొలాలు సర్వే చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద సుమారుగా రూ.950 కోట్ల అంచనాతో నివేదిక పంపారు. ఏడాదైనా ఒక్కపైసా రాలేదు. ఆ గ్రామాల్ని మళ్లీ బ్యాక్‌ చుట్టుముట్టింది. చేతికొచ్చిన వరి పైరు నీటిపాలై.. ఊళ్లు జలమయమై.. ప్రభుత్వ చేయూత కరువై సాయం కోసం నిరీక్షిస్తున్న సోమశిల ముంపు బాధితుల కన్నీటి వ్యథలపై ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి కథనం.

(కడప-ఆంధ్రజ్యోతి): 

నెల్లూరు జిల్లాలో సుమారుగా 8  లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యంగా పెన్నానదిపై సోమశిల జలాశయం నిర్మాణానికి 1975లో శ్రీకారం చుట్టారు. 1989లో నిర్మాణం పూర్తి చేశారు. నీటి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు. గరిష్ట నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 330 అడుగులు (100.548 మీటర్లు). జలాశయంలో అత్యధికంగా జిల్లా రైతాంగమే నష్టపోయింది. గోపవరం, అట్లూరు, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు మండలాల్లో పెన్నానది తీరంలో 114 గ్రామాలు, 62 వేల ఎకరాలు నీటి మునిగాయి. రిజర్వాయర్‌ కాంటూరు లెవల్‌ 330 అడుగుల లెవల్‌లో ఉన్న గ్రామాలను 1978లో సర్వే చేసి భూముల కోల్పోయిన భూములు, ఇళ్లకు పరిహారం ఇచ్చారు. జలాశయం ఫోర్‌షోర్‌ ఏరియా సుమారు 5 వేల చదరపు కిలోమీటర్లు శాటిలైట్‌ ద్వారా సర్వే చేసి 330 అడుగులు కాంటూరు లెవల్‌లో సరిహద్దులు నిర్ణయించారు. ఆ సరిహద్దు పరిధిలో ఉన్న గ్రామాలు, భూములకు మాత్రమే పరిహారం ఇచ్చారు. 1989లో నిర్మాణం పూర్తయినా 30 ఏళ్ల తరువాత 2019 అక్టోబరులో పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు తొలిసారిగా నిల్వ చేశారు. శాటిలైట్‌ సర్వే సరిహద్దు కాంటూరు లెవల్‌ దాటి పెన్నా జలాలు గంగపేరూరు, తప్పెటవారిపల్లె, కొత్తపి గ్రామాలను ముంచెత్తాయి. వేల ఎకరాలు వరి, అరటి, మిరప తదితర పంటలు నీటిపాలై రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. ఆ సమయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, రాజంపేట ఎంపీ మిఽథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, జిల్లా అధికారులు ముంపు గ్రామాలను పరిశీలించారు. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.


ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ప్రతిపాదన

సోమశిల బ్యాక్‌వాటర్‌ ముంచెత్తిన గ్రామాలను గాలేరు-నగరి ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సతీ్‌షచంద్ర పర్యవేక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేశారు. కాంటూరు లెవల్‌ 330 అడుగుల లెవల్‌లో సోమశిల బ్యాక్‌వాటర్‌ చేరిన పొలాలు, గ్రామాలకు గుర్తించి రెడ్‌మార్క్‌ వేసి పిల్లర్లు పాతారు. 420 ఎకరాల్లో పెన్నా జలాలు ముంచెత్తినట్లు గుర్తించారు. కాంటూరు లెవల్‌, ఆపై 100 మీటర్లు దూరంలో ఒంటిమిట్ట మండలం గంగపేరూరు, తప్పెటవారిపల్లె గ్రామాలు, నందలూరు మండలంలో పొత్తపి గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతుందని గుర్తించారు. గంగపేరూరులో 1,100 ఇళ్లు, పొత్తపిలో 500-750కుపైగా ఇళ్లు ముంపునకు గురౌతాయని గుర్తించారు. భూసేకరణ, పునరావాసం (ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్‌) యాక్ట్‌-2013 కింద ఆయా గ్రామాలకు పునరావాస ప్యాకేజీ, ఇళ్లు (నిర్మాణాలు), పొలాలకు నష్టపరిహారం కలిపి సుమారుగా రూ.950-1,000 కోట్ల నిధులు అవసరమని అంచనాతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఏడాది దాటినా ప్రభుత్వం నుంచి ఒక్కపైసా నిధులు రాకపోగా.. పరిహారం, పునరావాస ప్యాకేజీ ఇస్తామనే భరోసా కల్పిస్తూ జీవో కూడా ఇవ్వలేదు. సీఎం జగన్‌ మా గోడు వింటారు.. నిధులు ఇస్తారని ఏడాదిగా ఎదురు చూసిన బాధితులకు పరిహాసమే మిగిలింది. మళ్లీ బ్యాక్‌వాటర్‌ ఊళ్లు, పొలాలను ముంచెత్తింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు. 


నివేదిక పంపాం - సతీ్‌షచంద్ర, జీఎన్‌ఎ్‌సఎ్‌స స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, కడప

గత ఏడాది అక్టోబరులో సోమశిల జలాశయంలో తొలిసారిగా 78 టీఎంసీలు నిల్వ చేశారు. ఒంటిమిట్ట, నందలూరు గ్రామాల్లో పలు గ్రామాల్లోకి నీళ్లు వచ్చాయి. పంటచేలు నీటమునిగాయి. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కాంటూరు లెవల్‌ 330 అడుగుల్లో గంగపేరూరు/తప్పెటవారిపల్లి, పొత్తపి గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించాలని, 420 ఎకరాలకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక పంపిన మాట వాస్తవమే. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. 


రైతుల బాధలు కనిపించవా - హరిప్రసాద్‌, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి

సోమశిల బ్యాక్‌వాటర్‌ గ్రామాలను, పంట చేలను ముంచెత్తి రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. గత ఏడాది జరిగిన నష్టపరిహారం అందకనే మళ్లీ నీళ్లొచ్చి రెండవసారి కూడా నష్టపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి 330 అడుగుల లెవల్‌ పరిధిలోని గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేసి పునరావాసం కల్పించాలి. నీట మునిగిన చేలకు ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్‌ యాక్ట్‌-2013 ప్రకారం పరిహారం చెల్లించాలి. లేదంటే ప్రజాందోళన తప్పదు. 


నరసన్నగారిపల్లె పొలాలకు నష్టపరిహారం అందించాలి 

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లె గ్రామానికి సంబంధించిన 200 ఎకరాల్లో పండించిన పంటలన్నీ బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయాయి. ఒకవైపు బ్యాక్‌వాటర్‌, మరోవైపు కొండపై నుంచి వచ్చే నీటితో చేతికొచ్చే పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఈ సమయంలో మా గ్రామ పొలాలన్నింటినీ ముంపు ప్రాంతంగా ప్రకటించి నష్టపరిహారం అందించాలి. 

-తుమ్మలగుంట ఈశ్వరయ్య, నరసన్నగారిపల్లె, ఒంటిమిట్ట మండలం


పాములు, విషనాగులతో సచ్చేటట్లున్నామయ్యా... 

డ్యాములో నీళ్లన్నీ ఊరు చుట్టూ చేరడం వల్ల ఎక్కడ లేని పాములు, విషకీటకాలు ఇళ్లల్లోకి వస్తున్నాయి. రాత్రుళ్లు ఆ ఈగలమోతతో సచ్చేటట్లున్నాం.. మాకు ఇళ్లకు డబ్బివ్వకుండా ఊరును ముంచితే ఎట్టయ్యా.. మాకు ఇళ్లకు డబ్బిచ్చి ఖాళీ చేయించండి లేదంటే నీళ్లుతగ్గించి ఆదుకోండి. 

-రామలక్షుమ్మ, తప్పెటవారిపల్లె, ఒంటిమిట్ట మండలం

Updated Date - 2020-09-21T10:29:03+05:30 IST