పేద కుటుంబానికి పెద్ద కష్టం!

ABN , First Publish Date - 2020-09-21T10:36:03+05:30 IST

పేద కుటుంబానికి పెద్ద కష్టం!

పేద కుటుంబానికి పెద్ద కష్టం!

- గుండెపోటుతో ఇంటి పెద్ద మృతి

- ఒకరోజు వ్యవధిలోనే భార్య కన్నుమూత

- అనాథలైన ముగ్గురు పిల్లలు, వృద్ధురాలు

- గొనకపాడులో విషాదం


(సోంపేట రూరల్‌, సెప్టెంబరు 20)

నిరుపేద కుటుంబం. నిత్యం వెంటాడుతున్న ఆర్థిక, అనారోగ్య కష్టాలు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక, పిల్లల భవిష్యత్‌పై బెంగతో గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు కుటుంబ పెద్ద. భర్త అకాల మరణాన్ని తట్టుకోలేక అక్కడికి ఒకరోజు వ్యవధిలోనే భార్య మృతిచెందింది. దీంతో ముగ్గురు పిల్లలు, వృద్ధురాలైన తల్లి అనాథలుగా మిగిలారు. సోంపేట మండలం గొనకపాడులో ఆదివారం వెలుగుచూసిన విషాద ఘటన స్థానికులను కలిచివేసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 


కొర్లాం ప్రభుత్వాస్పత్రి సమీపంలో రాంబుడ్డి హేమసుందరరావు టీ దుకాణం నిర్వహిస్తూ కొన్నేళ్లుగా ఉపాధి పొందుతున్నాడు. ఖాళీ సమయాల్లో భార్య జయ్యమ్మతో పాటు ఉపాధి పనులకు వెళ్లేవాడు. వీరికి ఉపేంద్ర, జ్యోత్స్న, భోగేశ్వరరావు అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉపేంద్ర బారువ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జ్యోత్స్న పది, భోగేశ్వరరావు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.  వృద్ధురాలైన తల్లి సావిత్రమ్మ కూడా హేమసుందరరావు కుటుంబతోనే నివాసముంటోంది. పేద కుటుంబం కావడం, పిల్లల చదువులు, అనారోగ్య సమస్యలు వెంటాడాయి. దీంతో హేమసుందరరావు కొంత మొత్తం అప్పుచేశాడు. ఈ పరిస్థితుల్లో భార్య జయ్యమ్మ ఇటీవల అనారోగ్యానికి గురి కాగా పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇటు లక్షలాది రూపాయల అప్పులు, భార్య అనారోగ్యం, పిల్లల భవిష్యత్‌పై బెంగ హేమసుందరరావును వెంటాడాయి. కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉన్న ఆయన శనివారం గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయన మరణ వార్త విన్న భార్య జయ్యమ్మ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆదివారం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె మృతిచెందింది. దీంతో ముగ్గురు పిల్లలు, తల్లి సావిత్రమ్మ అనాథలుగా మిగిలిపోయారు. రెండు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మృతిచెందడంతో పిల్లలు గుండెలలిసేలా రోదించారు. వారి పరిస్థితిని చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. నా అన్నవారు లేకపోవడంతో గ్రామపెద్దలు, యువకులు చొరవ తీసుకొని అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని.. దాతలు సహకరించేందుకు ముందుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2020-09-21T10:36:03+05:30 IST